దేశంలో బయటపడిన మరో కొత్త ఫంగస్.. బీహార్ లో 4 వైట్ ఫంగస్ కేసులు నమోదు

 దేశంలో బయటపడిన మరో కొత్త ఫంగస్.. బీహార్ లో 4 వైట్ ఫంగస్ కేసులు నమోదు
  • కలకలం రేపుతున్న వైట్ ఫంగస్ 
  • నిన్నటి వరకు బ్లాక్ ఫంగస్.. ఇప్పుడు వైట్ ఫంగస్

న్యూఢిల్లీ: దేశంలో మరో కొత్త ఫంగస్ బయటపడింది. బీహార్ రాజధాని పాట్నాలో 4 వైట్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. అసలే కరోనా సెకండ్ వేవ్ తో అల్లాడిపోతున్న తరుణంలో బ్లాక్ ఫంగస్ కేసులు గోరుచుట్టపై రోకటిపోటులా తయారయ్యాయి. ఈ పరిస్థితుల్లో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు తాజాగా వైట్ ఫంగస్ వెలుగులోకి వచ్చింది. బీహార్ రాజధాని పాట్నాలో నాలుగు వైట్ ఫంగస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. బ్లాక్ ఫంగస్ కంటే ఇది ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతుండడం కలకలం రేపుతోంది. పాట్నాలో వైట్ ఫంగస్ సోకిన రోగుల్లో కరోనా సోకలేదని తేలింది.
పాట్నా మెడికల్ కాలేజీలో కరోనా అనుమానంతో నలుగురికి వైద్య పరీక్షలు చేయగా నెగటివ్ గా నిర్ధారణ అయింది. అయితే కొత్త రకం ఇన్ ఫెక్షన్లు కనిపించడంతో మరింత క్షుణ్ణంగా పరీక్షలు చేయగా వైట్ ఫంగస్ గా నిర్ధారణ అయింది. దీనిపై పాట్నా మెడికల్ కాలేజీ వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ఎస్ సింగ్ మాట్లాడుతూ 4 వైట్ ఫంగస్ కేసులు నిర్ధారణ అయింది నిజమేనని ధృవీకరించారు. దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందని.. ఈ ఫంగస్ సోకిన రోగులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని.. వారి పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. కరోనా ఇన్ ఫెక్షన్ సోకినప్పుడు కనపడే లక్షణాలే ఈ అరుదైన వైట్ పంగల్ ఇన్ ఫెక్షన్ సోకినప్పుడు కనపడతాయని వైద్యులు చెబుతున్నారు. ఊపిరితిత్తులపై దాడి చేసే ఈ ఫంగస్ ను హెచ్ ఆర్ సీ టీ టెస్ట్ చేయడం ద్వారా గుర్తించవచ్చు అంటున్నారు.