- గత వానాకాలంలో 3.80 లక్షల టన్నులు వేలం వేస్తే దాదాపు రూ.380 కోట్లు లాస్!
- యాసంగిలో రికార్డు స్థాయిలో 14.72 లక్షల టన్నుల మక్కలు కొన్న మార్క్‌ఫెడ్
- ఈ నెల 15, 16, 17 తేదీల్లో వేలానికి అధికారుల ఏర్పాట్లు
- అదను కోసం కాచుకున్న వ్యాపారులు, దళారులు, ఫీడ్ మిల్లర్లు
- సిండికేట్‌గా మారి తక్కువకు పాడేందుకు పావులు
- అప్రమత్తంగా లేకుంటే వందల కోట్ల నష్టం తప్పదంటున్న నిపుణులు
హైదరాబాద్, వెలుగు: ఇన్నిరోజులూ మార్కెట్‌లో మద్దతు ధరకు మక్కలు కొనేందుకు వెనుకాడిన వ్యాపారులు, దళారులు.. త్వరలో సర్కారు నిర్వహించబోయే వేలం పాటలో పాల్గొని అగ్గువకు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. రైతుల నుంచి క్వింటాల్‌కు రూ.2,400 చొప్పున కొనుగోలు చేసిన మార్క్‌ఫెడ్.. లోన్లపై వడ్డీలు, సేకరణ, నిల్వ చార్జీలు కలుపుకొని రూ.500 దాకా అదనంగా ఖర్చుచేసింది. అంటే క్వింటాల్‌కు తక్కువలో తక్కువ రూ.2,900 చొప్పున అమ్మితేనే ఎలాంటి నష్టాలు ఉండవు.
కానీ ఈ నెల 15, 16, 17 తేదీల్లో నిర్వహించబోయే ఈ-వేలం పాటలకు కనీస ధర నిర్ణయించకుండానే అధికారులు నోటిఫికేషన్ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ అదును కోసమే కాచుకొని ఉన్న వ్యాపారులు సిండికేట్‌గా మారి తక్కువకు పాడితే ప్రభుత్వానికి భారీ నష్టం తప్పదు. గత వానకాలంలో పలికిన రేటు పలికితే ఈసారి వేలం వేయబోయే 14.70 లక్షల టన్నుల మక్కలపై రూ.1,500 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల నష్టం రావచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
14.72 లక్షల టన్నుల మక్కల సేకరణ..
ఈ యాసంగి రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 12.94 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. 30 లక్షల టన్నుల వరకు దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం మక్కల కొనుగోళ్లకు అనుమతి ఇవ్వనప్పటికీ రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 338కి పైగా సెంటర్లను ఏర్పాటు చేసి కొనుగోళ్లు చేపట్టింది. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.2,400 చొప్పున రూ.3535.15 కోట్ల విలువైన 14.72 లక్షల టన్నుల మక్కలను సేకరించింది. ఇందులో సగానికి పైగా చెల్లింపులు పూర్తిచేసింది. తెలంగాణ మక్కల కొనుగోలు చరిత్రలో ఇది సరికొత్త రికార్డుగా నిలిచింది.
క్వింటాల్ కు రూ.2900 దాకా ఖర్చు..
మక్కల కొనుగోళ్ల కోసం మార్క్‌ఫెడ్ బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుంది. ఈ రుణంపై వడ్డీలు, సెంటర్ల ఏర్పాటు, హమాలీ, రవాణా చార్జీలు, గోడౌన్ల కిరాయిలు, నిల్వ ఖర్చులు కలిపి క్వింటాల్‌కు మరో రూ.500 దాకా వెచ్చించింది. ఈలెక్కన మక్కలపై మార్క్ ఫెడ్ క్వింటాల్‌కు రూ.2900 దాకా ఖర్చు చేసింది. ఈ రేటుకు అమ్మితేనే ప్రభుత్వానికి ఎలాంటి నష్టం ఉండదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రేటు రావడం కష్టమేనని అధికారులే చెప్తున్నారు. దీని వల్ల దళారులు, బడా వ్యాపారులు, ఫీడ్ మిల్లులు, పౌల్ట్రీ నిర్వాహకులు లాభపడతారని అంటున్నారు.
ప్రభుత్వం సేకరించిన మక్కలను భారీ లాట్లుగా అమ్మడం వల్ల చిన్న వ్యాపారులు పోటీ పడలేరని గుర్తుచేస్తున్నారు. ఈసారి వరిధాన్యం ఎక్కువగా రావడంతో రాష్ట్రవ్యాప్తంగా గోడౌన్ల సమస్య ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే గోడౌన్లు ఖాళీ చేయాలనే ఉద్దేశంతో ఈనెల 15, 16, 17 తేదీల్లో మక్కలను వేలం పాట ద్వారా విక్రయించాలని మార్క్ ఫెడ్ నిర్ణయించింది. ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేయగా, -వేలం పాటకు కనీస ధర నిర్ణయించకపోవడంతో క్వింటాల్‌కు ఎంత రేటు పలుకుతుందనేది ఆసక్తికరంగా మారింది. వ్యాపారులంతా సిండికేట్అయి రూ.1400 నుంచి రూ.1600 కు మించి పాడే అవకాశం లేదని, ఇదే జరిగితే ప్రభుత్వానికి భారీ నష్టం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గత వానాకాలం ఏం జరిగిందంటే..
గత వానాకాలంలో ప్రభుత్వం దాదాపు 3.80 లక్షల టన్నుల మక్కలను మార్క్‌ఫెడ్ ద్వారా సేకరించింది. వాటిని బహిరంగ మార్కెట్‌లో విక్రయించడానికి టెండర్లు పిలవగా టన్నుకు రూ.14 వేల నుంచి రూ.14,355 వరకు మాత్రమే పెట్టేందుకు వ్యాపారులు ముందుకొచ్చారు. దాంతో ఆ టెండర్లు రద్దు చేసి ఇటీవల ఈ---వేలం ద్వారా మక్కలను విక్రయించారు.
ఈ వేలంలో టన్నుకు సగటున రూ.19,337 ధర వచ్చిందని, దీంతో రూ.202 కోట్లకు పైగా అదనపు ఆదాయం వచ్చిందని అధికారులు ప్రకటించారు. కానీ రైతుల నుంచి కొన్న మక్కల రవాణా, గోదాముల అద్దె, నిల్వ, నిర్వహణ, వడ్డీ వంటి ఖర్చులన్నీ కలిపితే టన్నుకు దాదాపు రూ.29 వేలకుపైగా ఖర్చు అయిందని, టన్ను మక్కలు రూ.19,337కే అమ్మడంతో దాదాపు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.380 కోట్ల వరకు ప్రభుత్వానికి నష్టం వచ్చిందని అధికారులు చెప్తున్నారు.
