
- ఫోన్ పే.. గూగుల్ పే ద్వారా లబ్ధిదారులకు నగదు చెల్లింపు
- టాస్క్ఫోర్స్దాడుల్లో బయటపడ్తున్న నిజాలు
- కేసులు నమోదు చేసినా వెనక్కి తగ్గట్లే
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: రాష్ట్రంలో పేదల బియ్యం పక్కదారి పడుతున్నాయి. కొందరు డీలర్లు రేషన్ షాపునకు వచ్చిన బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా వారికి కిలోకు రూ. 5, 6 చొప్పున లెక్క కట్టి నగదు ఇస్తున్నారు. కొందరైతే ఫోన్ పే, గూగుల్ పే వంటి ఆన్‌లైన్ పేమెంట్లు కూడా చేస్తున్నారు. ఇలా పోగేసిన బియ్యాన్ని కిలోకు రూ.2 నుంచి రూ.5 చొప్పున కమీషన్‌పై నేరుగా స్మగ్లర్లకు విక్రయించి నెలకు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు అక్రమంగా సంపాదిస్తున్నారు. రాష్ట్రంలో 17,013 రేషన్ షాపులున్నాయి. వీటిలో అన్నపూర్ణ 5,797, అంత్యోదయ 5,63,704, ఫుడ్ సెక్యూరిటీ కార్డులు 84,79,979 కార్డులున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఒకరికి 15 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం అందిస్తోంది. నలుగురు కుటుంబసభ్యులు ఉన్న ఇంటికి 60 కిలోలు, ముగ్గురు ఉంటే 45 కిలోలు బియ్యం వస్తున్నాయి. కార్డుదారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీపై నెలకు రూ.500 కోట్లకు పైగా విలువ చేసే బియ్యం పంపిణీ చేస్తున్నాయి. వీటిలో 50 శాతానికి పైగా బియ్యం రేషన్ షాపుల నుంచే స్మగ్లర్ల చేతుల్లోకి చేరుతున్నాయి. రేషన్ బియ్యం స్మగ్లింగ్ తో నెలకు రూ.200 కోట్లకు పైగా అక్రమ వ్యాపారం జరుగుతోంది. టాస్క్‌ఫోర్స్ ఆఫీసర్లు ప్రత్యేక దృష్టి పెట్టినప్పుడు మాత్రమే వీళ్లు పట్టుబడుతున్నారు.
మూడు స్థాయిల్లో స్మగ్లింగ్
బియ్యం స్మగ్లింగ్ మూడు స్థాయిల్లో జరుగుతోంది. మొదటి దశలో కొందరు రేషన్ డీలర్లు దుకాణానికి వచ్చే లబ్ధిదారుల వేలిముద్రలు తీసుకొని వారికి బియ్యం బదులు నగదు ఇచ్చి పంపిస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ఆన్‌లైన్ పేమెంట్లు చేయడం ఇటీవల బాగా పెరిగింది. రేషన్ డీలర్‌కు కిరాణా లేదా చికెన్ సెంటర్ వంటివి ఉంటే అక్కడ ఖాతా పెట్టి బియ్యం డబ్బులను రికవరీ చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. రెండో దశలో షాపులలో నిల్వ ఉన్న బియ్యాన్ని మండల, జిల్లా స్థాయిలో కొనే స్మగ్లర్లకు అందిస్తున్నారు. వాళ్లు వీళ్ల నుంచి పెద్ద మొత్తంలో బియ్యం కొని రాష్ట్రం దాటిస్తుంటారు. ఇలా ప్రతి జిల్లాలో వివిధ స్థాయిల్లో బియ్యం చేతులు మారుతున్నాయి. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్ మెంట్ శాఖ అధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు దాడులు జరిపి కేసులు నమోదు చేసినా బియ్యం అక్రమ రవాణా ఆగడం లేదు. గత కొద్ది నెలల్లో భూపాలపల్లి జిల్లాలో బియ్యం స్మగ్లింగ్ చేస్తూ 30కి పైగా వెహికల్స్ పట్టుబడగా ఓనర్లకు రూ. 10 వేలు, రూ. 20 వేలలోపు ఫైన్లు వేసి వదిలేశారు. కఠిన చర్యలు కొరవడడంతో అక్రమ దందాకు అడ్డుకట్ట పడడం లేదు.
అక్రమ రవాణా చేస్తే చర్యలు తప్పవు
రాష్ట్రంలో బియ్యం అక్రమ రవాణా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. వెహికల్స్ సీజ్ చేసి బయటికి రాకుండా చేస్తాం. కొందరు రేషన్ డీలర్లు బియ్యం స్మగ్లింగ్ లో పాల్గొన్నారనే సమాచారం ఉంది. ఇకనైనా పద్ధతి మార్చుకొని ప్రభుత్వ చట్టాల ప్రకారం నడుచుకోవాలి.
– ప్రభాకర్, స్టేట్ సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్స్పెషల్ టీమ్ ఓఎస్డీ, హైదరాబాద్
హనుమకొండ జిల్లా శాయంపేటలో మే 21న టాస్క్‌ఫోర్స్ ఆఫీసర్లు సీజ్ చేసిన గవర్నమెంట్ రేషన్ షాప్ ఇది. రేషన్ షాపు డీలర్ కస్టమర్లకు బియ్యానికి బదులు నగదు ఇచ్చేవాడు. తర్వాత బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గుజరాత్ నెట్‌వర్క్‌తో కలిసి 140 క్వింటాళ్ల బియ్యం స్మగ్లింగ్ చేస్తున్న రేషన్ డీలర్‌తో సహా15 మందిపై కేసు నమోదు చేశారు. రేషన్ షాప్‌ను సీజ్ చేయడంతో పాటు 6 వెహికల్స్,10 సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ నెల 19న స్టేట్ సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ ప్రత్యేక టీమ్ మెరుపు దాడి చేసి పట్టుకున్న 14 టన్నుల బియ్యం లోడ్ గల డీసీఎం వ్యాన్ ఇది. పరకాల, రేగొండ మండలాలకు చెందిన కొందరు డీలర్లు కస్టమర్లకు డబ్బులిచ్చి నిల్వ చేసిన బియ్యాన్ని మధ్యవర్తికి విక్రయించారు. ఆ బియ్యంతో వెళ్తున్న డీసీఎంను హైదరాబాద్ నుంచి వచ్చిన స్పెషల్ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని మధ్యవర్తులపై కేసు ఫైల్ చేశారు. రెవెన్యూ ఆఫీసర్లు లోతుగా విచారణ జరిపితే అక్రమంగా బియ్యం అమ్మిన డీలర్ల పేర్లు కూడా బయటికి వచ్చేవి. కానీ అలాకాకుండా వెహికల్‌తో పాటు ఉన్నవారిపైనే మాత్రమే కేసులు పెట్టారు.