
సంగారెడ్డి: పాశమైలారం సిగాచి కంపెనీలో పేలుడు కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 37కు చేరింది. మంగళవారం రాత్రి వర్షం కారణంగా సహాయక చర్యలు నిలిచిపోగా..బుధవారం (జూలై2) ఉదయం తిరిగి సహాయక చర్యలు ప్రారంభం అయ్యాయి.
శిథిలాలను తొలగించి మరో మృతదేహాన్ని వెలికి తీశారు. దీంతో మృతుల సంఖ్య 37కు పెరిగింది. అనధికారింగా ఈ సంఖ్య 50 వరకు ఉన్నట్టు తెలిసింది. ఘటనా స్థలంలో సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు శిథిలాల తొలగింపు ప్రక్రియను ముమ్మరంగా కొనసాగి స్తున్నాయి.
నిన్నటి వరకు డీఎన్ ఏ టెస్టుల ద్వారా 14డెడ్ బాడీలను గుర్తించి బంధువులకు అప్పగించారు. ఇవాళ మరో ఐదు డెడ్ బాడీలను గుర్తించారు. ఇప్పటివరకు మొత్తం 19 మృతదేహాలను డీఎన్ఏ టెస్టుల ద్వారా గుర్తించారు.
సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణం గా శిథిలాల తొలగింపునకు కొంత ఆటంకం కలిగింది. వర్షంలోనూ కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణలో రెస్క్యూ టీమ్స్ ఆపరేషన్ కొనసాగించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు వెలికితీసిన డెడ్‌బాడీలను పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
గాయపడిన 35 మంది కార్మికులకు పటాన్‌చెరులోని ధృవ హాస్పిటల్, చందానగర్‌లోని అర్చన, ప్రణామ్ ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. వీరిలో సీరియస్ ఉన్న నలుగురిని అపోలో, యశోద ఆస్పత్రులకు తరలించారు. ధ్రువ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న 9 మందిలో ఐదుగురి కండీ షన్ సీరియస్‌గా ఉందని డాక్టర్లు తెలిపారు.
హైటెంపరేచర్‌తోనే ప్రమాదం..
అధిక ఉష్ణోగ్రత వెలువడడం కారణంగానే ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పేలుడు సమయంలో 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత వెలువడి ఉంటుందని పేర్కొంటున్నారు. గుజరాత్ కేంద్రంగా పని చేస్తున్న సిగాచి కంపెనీ 4 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, ఇక్కడ ముడి సరుకులను శుద్ధి చేసి ఫార్మా ఉత్పత్తుల్లో వినియోగించే మైక్రో క్రిస్టలైన్సెల్యులోజ్ను తయారు చేస్తున్నారు.
ముడి సరుకును శుద్ధి చేసేందుకు స్ర్పేయర్ డ్రయర్‌లను ఉపయోగిస్తున్న సమయంలో ఈ భారీ విస్పోటం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. స్ప్రేయర్ డ్రయర్‌లో జరిగే రసాయన మిశ్ర మ ప్రక్రియతో టెంపరేచర్అనూహ్యంగా పెరుగుతుంది. ఆ సందర్భంలో టెంపరేచర్‌ను అదుపు చేసేందుకు ఎప్పటికప్పుడు బ్లోఎయిర్ హ్యాండ్లర్‌లను ఉపయోగిస్తుంటారు.
వాటిని తరచూ శుభ్రం చేయక పోతే దుమ్ము పేరుకుపోయి ఉష్ణోగ్రత అదుపు తప్పే అవకాశముందని, సిగాచి పరిశ్రమలో కూడా అలాంటి పరిస్థితి వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. కొన్ని సందర్భాల్లో ముడి ఔషధాన్ని శుద్ధి చేయడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడుతుంటారని.. ఇది నిబంధనలకు విరుద్ధమని, తాజా పేలుడుకు ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చని అంటున్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాతే ప్రమాదానికి కారణమేంటో తెలిసే అవకాశముందని ఆఫీసర్లు చెప్తున్నారు.