ఆదిలాబాద్ రిమ్స్ అగ్ని ప్రమాద ఘటనలో మూడుకు చేరిన మృతులు

ఆదిలాబాద్ రిమ్స్ అగ్ని ప్రమాద ఘటనలో మూడుకు చేరిన మృతులు
  • 24 మంది శిశువులకు చికిత్స
  • ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం
  • షార్ట్ సర్క్యూట్​తోనే మంటలు..
  • అంతలోనే వార్డులో దట్టమైన పొగలు
  • అద్దాలు పగులగొట్టి పసికందులను తీసుకొని బయటికి బంధువుల పరుగులు

హైదరాబాద్: ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్‌‌‌‌ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన శిశువుల సంఖ్య మూడుకు చేరింది. షార్ట్​సర్క్యూట్‌‌‌‌తో ఎస్ఎన్సీయూ వార్డులోని ఏసీకి మంటలు అంటుకొని పేలిపోయింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కపడ్డ సిబ్బంది, పసికందుల కుటుంబ సభ్యులు ఏం జరుగుతోందో తెలిసేలోగా వార్డు మొత్తం పొగలు కమ్మేశాయి. దీంతో అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు, ఇతర సిబ్బంది, చిన్నారుల బంధువులు అద్దాలు పగలగొట్టి శిశువులను తీసుకొని బయటకు పరుగులు తీశారు. 

వెంటనే కరెంట్ సరఫరా నిలిపివేయడంతో ప్రమాదస్థాయి తగ్గింది. జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెల్లవారుజాము వరకు రిమ్స్‌‌‌‌లో ఉండి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాగా వార్డులో మొత్తం 27 మంది నవజాత శిశువులు ఉండగా రాత్రికే ఇచ్చోడ మండలం సుభాష్ నగర్ కాలనీకి చెందిన సలీం ఖాన్ ఐదు రోజులు పాప చనిపోయింది. 

మిగతా శిశువులను వెంటనే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్‌‌‌‌లోని హాస్పిటళ్లకు తరలించారు. మంగళవారం ఉదయం ఉట్నూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన సమ్రిన్ కూతురు, ఇంద్రవెల్లి మండలంలోని గిన్నెరకు చెందిన కుమ్ర దినేశ్ 15 రోజుల కూతురు చికిత్స పొందుతూ చనిపోయారు. మిగతా 24 మంది శిశువులు చికిత్స పొందుతుండగా.. ఇందులో ఇద్దరి పరిస్థితి కొంచెం విషమంగానే ఉన్నట్టు డాక్టర్లు చెబుతున్నారు.