
- గాంధీ ఆసుపత్రి ఆవరణలోనెల రోజుల వ్యవధిలో 20 మంది మృతి
- కుటుంబసభ్యులు, బంధువులు ఎవరూ రాకపోవడంతో
- బల్దియా ఆధ్వర్యంలో అంత్యక్రియలు
పద్మారావునగర్, వెలుగు: గాంధీ ఆసుపత్రి ఆవరణలో అనారోగ్యంతో గుర్తు తెలియని వ్యక్తుల వరుస మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే దాదాపు 20 మందికి పైగా గాంధీ ఆవరణలో మరణించారు. వీరిలో యాచకులతో పాటు అనారోగ్యం బారిన పడిన వృద్ధులు ఉన్నారు. ఈ 20 మంది మృతులకు సంబంధించి ఎలాంటి వివరాలు తెలియకపోవడం కూడా ఆందోళనకు గురి చేస్తుంది. గాంధీ హాస్పిటల్ ఆవరణలో చాలా మంది భిక్షాటన చేస్తుంటారు. అనారోగ్యంతో వారు చనిపోతే కుటుంబసభ్యులకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. వివరాలు దొరకకపోతే డెడ్ బాడీని అంత్యక్రియల కోసం బల్దియా సిబ్బందికి అప్పగిస్తున్నారు.
పట్టించుకునే వారు లేక..
సిటీతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి అనారోగ్యంతో చాలామంది గాంధీ హాస్పిటల్ కు వస్తుంటారు. వీరిలో కొందరు కుటుంబసభ్యులతో వస్తుండగా.. మరికొందరు ఒంటరిగా వచ్చి అడ్మిట్ అవుతుంటారు. అయితే, ఒంటరిగా వచ్చిన వారి ఆరోగ్యం కుదటపడకపోవడంతో తిరిగి వెళ్లకుండా గాంధీ హాస్పిటల్ ఆవరణలోనే భిక్షాటన చేస్తూ గడుపుతుంటారు. గాంధీ హాస్పిటల్ వద్ద జరిగే అన్నదానంలో తింటూ నెలల తరబడి అక్కడే ఉంటారు.
ఈ క్రమంలో వ్యాధి ముదిరితే హాస్పిటల్ ఆవరణలోనే చనిపోతున్నారు. అయితే, వీరు ఎక్కడ నుంచి వచ్చారనే వివరాలు తెలియకపోవడంతో వారి కుటుంబసభ్యులను కనుక్కోవడం పోలీసులకు సవాల్‌గా మారుతోంది. మరోవైపు అనారోగ్యం బారిన పడ్డ వృద్ధులను గాంధీ హాస్పిటల్లో చేర్పిస్తున్న కుటుంబసభ్యులు ఆ తర్వాత వారిని అక్కడే వదిలేసి వెళ్తున్నారు. దీంతో అనారోగ్యంతో వృద్ధులు చనిపోతే కనీసం వారిని డెడ్‌బాడీని తీసుకెళ్లేందుకు కూడా రావడం లేదు.
ఈ డెడ్‌బాడీలను పోలీసులు గాంధీ మార్చురీకి తరలిస్తున్నారు. అక్కడ కొద్ది రోజులు ఫ్రీజర్‌లో ఉంచి, ఆ తర్వాత అంత్యక్రియల కోసం జీహెచ్‌ఎంసీకి అప్పగిస్తున్నారు. ఒక్క అక్టోబర్ నెలలోనే 20 మంది గుర్తు తెలియని వ్యక్తులు గాంధీ ఆవరణలో చనిపోయారని ఎస్సై కిశోర్ తెలిపారు. పేపర్లలో, సోషల్ మీడియాలో గుర్తు తెలియన డెడ్ బాడీల గురించి సమచారం ఇస్తున్నప్పటికీ వాటిని తీసుకెళ్లేందుకు ఎవరూ రావడం లేదని ఆయన చెప్పారు.
అయినా వారే కాదనుకుని..!
అనాథల చావుల వెనక మరో కోణం దాగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇంట్లో వయస్సు పైబడి, అనారోగ్యంతో బాధపడే వారిని ఎలాగైనా వదిలించుకోవాలనే ఉద్దేశంతో కుటుంబసభ్యులే వారిని వాహనాల్లో తీసుకొచ్చి గాంధీ ఆసుపత్రి ఆవరణలో వదిలి పెట్టి వెళ్లిపోతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గాంధీ హాస్పిటల్ ఆవరణలోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తే ఏ సమయంలో ఎవరూ పేషెంట్లను తీసుకువచ్చి వదిలి వెళ్తున్నారో తెలిసిపోతుందని అక్కడి సిబ్బంది చెబుతున్నారు.
అయితే, మూడ్రోజుల కిందట గాంధీ ఆవరణలోని ఓపీ బ్లాక్ సమీపంలో ఓ డెడ్‌బాడీని చూసిన సెక్యూరిటీ గార్డులు చిలకలగూడ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు డెడ్ బాడీని మార్చురీకి తరలించారు. చనిపోయిన వ్యక్తికి 60 నుంచి 65 ఏండ్లు ఉంటాయని ఆచూకీ తెలిసిన వారు తమను సంప్రదించాలని చిలకలగూడ ఏఎస్సై రామేశ్వర్ తెలిపారు.