బొగ్గు బ్లాకుల వేలంతో రాష్ట్రాలకే ప్రయోజనం: ప్రహ్లాద్ జోషి

బొగ్గు బ్లాకుల వేలంతో రాష్ట్రాలకే ప్రయోజనం: ప్రహ్లాద్ జోషి
  • సింగరేణిని ప్రైవేటు చేయం
  • అందులో రాష్ట్ర వాటా 51%, కేంద్రం వాటా 49 % 
  • వేలం ద్వారా కోల్ బ్లాక్స్ కేటాయిస్తే  నష్టమేంటి?
  • దేశమంతా ఇదే విధానం.. వేలంతో రాష్ట్రాలకే ప్రయోజనం
  • కోల్ బ్లాక్స్ వేలంలో రాష్ట్రాలూ పాల్గొనొచ్చు
  • తెలంగాణ ఎంపీల వాదనలో నిజం లేదు
  • ఎంపీ ఉత్తమ్ ప్రశ్నకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమాధానం
  • కోల్ స్కామ్​లో ఉన్నవాళ్లే  వేలాన్ని వద్దంటున్నారని విమర్శ
  • అందులో రాష్ట్ర వాటా 51%, కేంద్రం వాటా 49 %: ప్రహ్లాద్​జోషి 

న్యూఢిల్లీ, వెలుగు: సింగరేణిని  ప్రైవేటీకరించడం లేదని, అన్ని రాష్ట్రాల్లో మాదిరిగానే కోల్ బ్లాక్స్ కేటాయింపు వేలం ద్వారా కొనసాగుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. సింగరేణిని  ప్రైవేటుపరం చేస్తున్నారంటూ తెలంగాణ ఎంపీలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. బొగ్గు బ్లాకుల వేలం ఆరోపణలపై ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం లోక్​సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బదులిచ్చారు.  ‘51 శాతం రాష్ట్ర వాటా, 49 శాతం కేంద్ర వాటా ఉన్న సింగరేణి సంస్థను ఏ విధంగా కేంద్రం ప్రైవేట్ పరం చేస్తుంది. కోల్ బ్లాక్స్ కేటాయింపు పూర్తిగా వేలం ద్వారా జరుగుతుంది. ఈ విధానాన్ని కేంద్రం అడాప్ట్ చేసుకుంది. బీజేపీ అధికారంలోని చత్తీస్ గఢ్, జార్ఖండ్, ఇతర రాష్ట్రాల్లో కూడా వేలం ప్రక్రియ కొనసాగుతోంది. అక్కడి ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి.. మరి తెలంగాణలో వచ్చిన సమస్య ఏంటో చెప్పాలి’ అని ప్రహ్లాద్ జోషి ప్రశ్నించారు.

మంత్రి మాట్లాడుతుండగా ఉత్తమ్, ఇతర ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముందు తాను చెబుతోన్న విషయాన్ని వినాలని సభ్యులకు విజ్ఞప్తి చేసి ఆయన ప్రసంగాన్ని కొనసాగించారు. వేలం వేస్తే మొత్తం రెవెన్యూ రాష్ట్రాలకే వెళ్తుందని, రెండున్నర ఏండ్లుగా చాలా పారదర్శకంగా ఈ పద్ధతి కొనసాగుతోందన్నారు. ఇప్పటివరకు దీనిపై ఏ రాష్ట్రం అభ్యంతరం చెప్పలేదని,  ఈ ప్రక్రియ పూర్తిగా రాష్ట్రాలకు లాభం చేకూర్చేలా ఉందన్నారు. కోల్ బ్లాక్స్ వేలంలో రాష్ట్రాలు కూడా పాల్గొనవచ్చన్నారు. ‘ఎవరైతే కోల్ స్కామ్​లో ఉన్నారో.. వాళ్లే కేంద్రం తెచ్చిన వేలం ప్రక్రియపై ఆరోపణలు చేస్తున్నారు’ అని విమర్శించారు. మధ్యలో స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకుంటూ.. తెలంగాణ వాటా 51 శాతం ఉందనేది తమ వాదన అని చెప్పుకొచ్చారు