- 16న ఫైనల్ ఓటర్ల జాబితా విడుదల
- ఆసక్తి కలిగిస్తున్న గజ్వేల్ మున్సి'పోల్స్'
సిద్దిపేట/గజ్వేల్, వెలుగు: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వార్డుల పెంపుపై జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే ప్రాథమిక ఓటర్ల జాబితాను విడుదల చేసిన అధికారులు ఈ నెల 16న ఫైనల్ఓటర్ల జాబితాలను విడుదల చేస్తామని చెబుతున్నారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణంతో ముంపునకు గురైన 8 గ్రామాలను గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన ఆర్అండ్ఆర్ కాలనీకి నాలుగేండ్ల కింద తరలించారు.
ఇటీవల ముంపు గ్రామాలను గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో కలపడంతో ఐదు నుంచి ఆరు వార్డులు పెరుగుతాయని అందరూ భావించారు. కానీ అధికారులు ఆరు వార్డుల్లోనే నిర్వాసిత గ్రామాలకు చెందిన 14 వేల మంది ఓటర్లను సర్దుబాటు చేశారు.
దీంతో వార్డుల సంఖ్య పెరిగితే ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చని భావించిన ఆశావహులు నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వాసిత గ్రామాలను కలుపుకుని మొత్తం 46,740 ఓటర్లుండగ వారిలో పురుషులు 22,738 మంది, మహిళలు 24,001 మంది ఉన్నారు. వార్డులను పెంచాలని నిర్వాసిత గ్రామాలకు చెందిన వారు కలెక్టర్ తో పాటు అధికారులకు వినతిపత్రాలు ఇస్తుండగా అధికార పార్టీ నేతలు ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఓటర్ల సర్దుబాటుపై అసంతృప్తి
గజ్వేల్ మున్సిపాలిటీలో గతంలో మల్లన్న సాగర్ నిర్వాసితులు కాకుండా 20 వార్డుల్లో 32 వేల ఓటర్లు ఉండేవారు. 8 నిర్వాసిత గ్రామాలను మున్సిపాలిటీలో కలపడంతో ఐదు నుంచి ఆరు వార్డులు అదనంగా పెరుగుతాయని భావించారు. కానీ అధికారులు 14 వేల మంది ఓటర్లను 7 నుంచి 12 వార్డుల్లో సర్దుబాటు చేయగా మిగిలిన పాత ఓటర్ల ను 14 వార్డుల్లో సర్దుబాటు చేశారు. ఓటర్ల సర్దుబాటుపై ఎమ్మెల్సీ యాదవరెడ్డి శాసన మండలిలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగినా వార్డులు పెరగక పోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు క్షేత్రస్థాయి సమస్యలను పరిగణలోకి తీసుకోకుండా వార్డులను విభజించారని నిర్వాసితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో వార్డులో 1600 నుంచి 2600 ఓట్ల వరకు ఉన్నాయి. నిర్వాసిత గ్రామాలు ఇప్పటి వరకు గ్రామ పంచాయతీల ఇంటి నంబర్లతో కొనసాగడంతో మున్సిపాలిటీలో కలిసిన తర్వాత అవే కొనసాగడం వల్ల ఇబ్బంది ఏర్పడినట్టు తెలుస్తోంది.
వార్డుల పెంపుపైనే వినతులు
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ప్రాథమిక ఓటర్ల జాబితా విడుదల చేసిన తర్వాత ఎక్కువగా వార్డుల పెంపుపైనే అభ్యంతరాలు వచ్చాయి. ఈ విషయం అధికారుల పరిధిలో లేకపోవడంతో వాటిని కలెక్టర్ పరిశీలనకు పంపించారు. వార్డుల వారీగా జాబితాల వెల్లడికి ఈ నెల 16 వరకు గడువు ఉండడంతో ఫైనల్ ఓటర్ల లిస్ట్ ను అధికారులు ఇప్పటికీ వెల్లడించలేదు. దీంతో అసలు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వార్డుల పెంపు ఉంటుందా, లేదా అనే ఉత్కంఠ కొనసాగుతోంది.
