భూమి తాపానికి డీకార్బనైజేషనే పరిష్కారం

భూమి తాపానికి డీకార్బనైజేషనే పరిష్కారం

ప్రభుత్వాలకు సలహా ఇచ్చే శాస్త్రీయ సంస్థ వాతావరణ మార్పుపై అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం నివేదిక, ఈ శతాబ్దం చివరి నాటికి ఉష్ణోగ్రతలు 1990 కంటే 5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉండవచ్చని 2000 సంవత్సరంలో అంచనా వేసింది. అదే బృందం 21 ఏండ్ల తరువాత 2021 ఆగస్టులో ఇచ్చిన నివేదిక ప్రకారం పరిస్థితి చేయి దాటిపోతున్నది అని చెబుతూ ‘కోడ్ రెడ్’ గా అభివర్ణించింది. భూమి మీద ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల విపరీతమైన వాతావరణ మార్పులు వచ్చి, ఉత్పాతాలు పెరిగి, శాస్త్రానికి, ఊహకు అందని విధంగా ప్రకృతి వైపరీత్యాల రూపంలో కనపడుతున్నాయి. 

నివేదిక‌‌‌‌ చెప్పినట్లే పరిణామాలు

2023లో గ్రీస్ దేశంలో సగం భూభాగం వరదల బారిన పడింది. చైనా వరదల బీభత్సం గత మూడేళ్ళుగా పెరుగుతూనే ఉన్నది. రాజధాని బీజింగ్ నగరంలో వరదలు ఆశ్చర్యం కలిగించాయి. లిబియా దేశంలో అధిక వర్షాల వల్ల రెండు ఆనకట్టలు తెగి డేర్ణ పట్టణంలో 20 వేల మంది గల్లంతయ్యారు. సగం పట్టణం తుడిచిపెట్టుకుపోయింది. అమెరికాలో, కెనడాలో, ఆస్ట్రేలియాలో, ఐరోపా ఖండంలో కారడవులు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. మన దేశంలో హిమాచల ప్రదేశ్ రాష్ట్రంలో కుండపోతకు రెండు సార్లు తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. అనేక దేశాల్లో ప్రకృతి వైపరీత్యాలు వరుసగా సంభవిస్తున్నాయి. ఐరోపాలో ఎండలు, ఉక్కపోత, వేడి పెరిగింది. సగటు ఉష్ణోగ్రతలు ప్రపంచమంతటా పెరిగాయి. 

 ఉష్ణోగ్రతలు ఎందుకు పెరుగుతున్నాయి?

పెరుగుతున్న ఉష్ణోగ్రతల్లో దాదాపు సగం బాధ్యత వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ శాతం పెరగడం వల్ల అని అధ్యయనాలు చెబుతున్నాయి. 1980 ల్లో కార్బన్ డై ఆక్సైడ్ వాతావరణ సాంద్రత 1800 కు ముందు స్థాయి కంటే 20 నుండి 25 శాతం ఎక్కువగా ఉంది. ఇంకా మీథేన్ 18 శాతం, క్లోరోఫ్లూరో కార్బన్లు 14 శాతం, నైట్రస్ ఆక్సైడ్ 6 శాతం, ట్రోపోస్ఫెరిక్ ఓజోన్, ఇతర వాయువులతో (12 శాతం), మిగతా శాతం నిండి ఉన్నాయి. 2030 నాటికి గత 12,000 ఏళ్లలో ఏ సమయంలోనూ లేనంతగా ప్రపంచ సగటు ఉష్ణోగ్రత వెచ్చగా ఉంటుంది అని శాస్త్రవేత్తల అంచనా. వాహనాలు, పారిశ్రామిక ఉత్పత్తి కొరకు శిలాజ ఇంధనాలను విస్తృతంగా, విపరీతంగా మండించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. పారిశ్రామిక విప్లవానికి ముందు, కార్బన్ డై ఆక్సైడ్ గాఢత మిలియన్ కు 280 భాగాలు ఉండగా, 2018 నాటికి, ఇది సుమారు 408 పీపీఎమ్. దీనికి 80 శాతం కారణం శిలాజ ఇంధనాలను మండించడం వల్ల. ఇదే కొనసాగితే, 2035 నాటికి, భూమి ఉష్ణోగ్రత 4.5 సెంటీగ్రేడ్ కు పెరుగుతుందని అంచనా. 
 
ఒప్పందాలు తప్ప ఏకాభిప్రాయం లేదు

 గత 150 సంవత్సరాల మానవ కార్యకలాపాలు వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ స్థాయిని 30 శాతం పెంచింది. సముద్రంలో, నేలలో, పచ్చదనంలో, అడవులలో ఉండే కార్బన్ క్రమంగా వాతావరణంలో పేరుకుపోతున్నది. అది సమస్యగా మారింది. కోపెన్ హాగన్ లోని COP15 లో, ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 2 డిగ్రీల సి కంటే ఎక్కువ పెరగనివ్వకూడదని ప్రపంచ నాయకులు అంగీకరించారు. ఆ మేరకు 80% కంటే ఎక్కువ ప్రపంచ ఉద్గారాలకు కారణమైన దేశాలు కోపెన్ హాగన్ ఒప్పందం, కాన్కున్ ఒప్పందాల కింద తమ దేశీయ లక్ష్యాలను వెల్లడించాయి. వాతావరణ ఉద్గారాలను నియంత్రించాలంటే శక్తి ఉత్పత్తి,  సరఫరా, పంపిణీ, వినియోగం మీద పరిమితులు, ప్రత్యామ్నాయ పునరుత్పాదక శక్తి వనరుల సామర్థ్యం పెంపు చాల కీలకం. సంప్రదాయ వాణిజ్య శిలాజ ఇంధనాలు (చమురు, గ్యాస్ మరియు బొగ్గు) వినియోగం గణనీయంగా, వేగంగా తగ్గించాలి. అయితే, ఏ దేశం ఎంత తగ్గించాలి అనే విషయం మీద ప్రపంచ దేశాల మధ్య ఏకాభిప్రాయం లేదు. అన్ని దేశాలు తమ లక్ష్యాలను ప్రకటించినా కూడా అమలులో వెనుకబడి ఉన్నాయి. జీహెచ్​జీ ఉద్గారాలను తగ్గిస్తే వాయు కాలుష్యం తగ్గి గాలి నాణ్యత పెరుగుతుంది. నగరాల్లో విద్యుదీకరణ, ప్రజా రవాణా విస్తరణ ద్వారా గాలి నాణ్యతను పెంచవచ్చు. ఐరోపా కూటమి దేశాల్లో శిలాజ ఇంధన వినియోగం తగ్గించాలని తీసుకున్న విధాన నిర్ణయాల వల్ల 2005తో పోలిస్తే 2030లో వాయు కాలుష్యం 65 శాతం తగ్గుతుందని అంచనా. 

భారతదేశంలో శక్తి పరిస్థితి 

మొత్తం ప్రపంచ శిలాజ ఇంధన డిమాండ్ లో భారతదేశం వాటా 2040 నాటికి 6 నుండి 11 శాతానికి పెరుగుతుంది. దురదృష్టవశాత్తు దేశంలో ప్రస్తుత శక్తి వనరుల మిశ్రమం ఎక్కువగా బొగ్గు మీద ఆధారపడి ఉంది. భూమి ఉష్ణోగ్రతల పెరుగుదల, వాతావరణ మార్పుల ఆందోళనల నేపథ్యంలో భారతదేశం తన శక్తి వనరుల గురించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నది? ప్రస్తుతం మన సగటు తలసరి ఇంధన వినియోగం ప్రపంచంలో పావు వంతు. అయితే, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎదుగుతున్న కొద్దీ, శిలాజ ఇంధనాల -ఆధారిత  శక్తి వినియోగం పెరుగుతున్నది. ఈ వినియోగం పెరగకుండా భారత దేశం అవలంబించే విధానాలు, కార్బన్ రహిత (Decarbonisation) శక్తి  వనరుల వినియోగం,  మార్పు ప్రణాళికలు ప్రపంచానికి కీలకం కాబోతున్నాయి. అయితే, భారత ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. థర్మల్ విద్యుత్ తగ్గిస్తూ ఇతర పునరుత్పాదక శక్తి వనరుల వినియోగం పెంచడానికి వ్యూహరచన చేయడం చాల ముఖ్యం. 

మోడీ పంచామృత్​ లక్ష్యాలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ COP26 సదస్సులో పంచామృత్ లక్ష్యాలు ప్రకటించారు. 2030 నాటికి పునరుత్పాదక శక్తి సామర్థ్యం 500 గిగావాట్లకు పెంచుతామని, అప్పటికి 50 శాతం విద్యుత్ అవసరాలు పునరుత్పాదక శక్తి వనరుల నుంచి వాడుకుంటామని, 2070 నాటికి కాలుష్య ఉద్గారాలు తటస్థ స్థితికి తెస్తామని అన్నారు. విద్యుత్ పరివర్తన ప్రణాళిక నీతి అయోగ్ సంస్థ తయారు చేసింది కూడా. కాగా, సమాంతరంగా థర్మల్ విద్యుత్ సామర్థ్యం మరో 64 గిగావాట్లకు పెంచే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి ముగింపు పలికే విధానపర నిర్ణయాలు తక్షణం అమలు చేయడానికి భారత దేశం సహా ప్రపంచ దేశాలేవీ సిద్ధంగా లేవు.

బయోప్యూయల్​

 భారత ప్రభుత్వం ఇటీవల కాలంలో ధాన్యం నుంచి ఇథనాల్ తయారు చేసి వాహన ఇంధనంలో 20 శాతం కలిపి, తద్వారా శిలాజ ఇంధనాల ఉపయోగం తగ్గిస్తామని భావించింది. వరి ధాన్యం నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేసే పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు ప్రకటించింది. విధాన ప్రకటన చేసి దాని మీద తన విశ్వాసం ప్రకటించింది. సెప్టెంబర్, 2023లో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశంలో జీవ ఇంధనాల (బయో ఫ్యూయల్స్) మీద ఒక అంతర్జాతీయ కూటమి ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. 

భవిష్యత్తుకు మార్గాలు

కర్బన ఉద్గారాలను తగ్గించే క్రమంలో రెండు కీలక మార్పులను, విద్యుదీకరణ, పునరుత్పాదక శక్తి విస్తరణ, ప్రోత్సహించడం, విస్తరించడంలో భారత ప్రభుత్వం అనేక విధానపర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బొగ్గు వాడకం పూర్తిగా ఆపి, 500,000 నుండి 600,000 మెగావాట్ల పునరుత్పాదక శక్తిని వ్యవస్థాపించడానికి గణనీయమైన పెట్టుబడితో సహా 20 నుంచి 30 ఏళ్ల సమయం పడుతుంది. అసంఖ్యాక కార్మికులను ఇతర జీవనోపాధులకు  మళ్లిస్తూ ఉపాధి అవకాశాలు సృష్టించాలి. మూడవ మార్పు: ప్రత్యమ్నాయ శక్తి వనరుల విద్యుత్ సరఫరా మెరుగుపరచడానికి  తగినంత శక్తి నిల్వ సామర్థ్యం పెంచుకోవడం. విద్యుత్ నిల్వ పరిష్కారాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించే విధానాలు కూడా అవసరం అవుతాయి.

బొగ్గు, ఇంధనం వాడకం తగ్గాలి

ఇప్పటికే బొగ్గు నుంచి వచ్చే విద్యుత్ మీద ఆధారపడిన రంగాల మీద భారం పడకుండా, ఆయా రంగాల వృద్ధిని కొనసాగించే విధంగా విద్యుత్ ఉత్పత్తి ఇంధనంలో మార్పు తీసుకురావడం పెద్ద సవాలు. పునరుత్పాదక శక్తి వనరులు (సౌర శక్తితో సహా) వ్యవసాయం, పరిశ్రమలు, గృహావసరాలకు, వాణిజ్య డిమాండ్ వంటి ప్రధాన వినియోగ రంగాలను సుస్థిర ఇంధన వినియోగం వైపు మళ్ళించడం అవసరమే, కాని సులువు కాదు. రవాణా వాహనాలు, కొన్ని పరిశ్రమలు నేరుగా డిజిల్, పెట్రోల్ వంటి కాలుష్య కారక ఇంధనాల మీద ఆధారపడ్డాయి. ఇటువంటి ఇంధన అవసరాలు అన్నీ విద్యుత్ ద్వారా మాత్రమే తీర్చుకుంటే ఉపయుక్తమని అధ్యయనాలు, అంతర్జాతీయ శక్తి సంస్థలు చెబుతున్న తరుణంలో, విద్యుత్ వాహనాల ఉపయోగం అవసరమని కేంద్ర ప్రభుత్వం, ఇంకా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలుగా ప్రకటించాయి. ఈ పథకం మంచిదే కాని కొన్ని సవరణలు అవసరం. సామూహిక రవాణా వ్యవస్థలైన బస్సులు, రైళ్ళు వంటివి ముందుగా మార్చి, వాటిని విస్తరిస్తే ప్రజల రవాణా అవసరాలు తీరడంతో పాటు, వ్యక్తిగత వాహనాల సంఖ్య తగ్గుతుంది..

–డా. దొంతి నర్సింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్​