ప్రభుత్వాన్ని కూలుస్తామంటే చూస్తూ ఊరుకోవాలా? : పొన్నం ప్రభాకర్ గౌడ్

ప్రభుత్వాన్ని కూలుస్తామంటే  చూస్తూ ఊరుకోవాలా? : పొన్నం ప్రభాకర్ గౌడ్

 

 

  •      సర్కారు సుస్థిరత కోసమే చేరికలు
  •     కుల గణనపై రెండు రోజుల్లో నిర్ణయం
     

కరీంనగర్, వెలుగు: పార్టీ ఫిరాయింపులకు తాము వ్యతిరేకమని, కానీ.. తమ ప్రభుత్వాన్ని కూలుస్తామంటే చూస్తూ ఊరుకోవాలా అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ప్రభుత్వ సుస్థిరత కోసమే చేరికలని, ప్రజలతో ఎన్నికైన ప్రజాప్రభుత్వాన్ని తాము నిలబెడుతామని వస్తున్న శాసనసభ్యులనే తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో సోమవారం నిర్వహించిన వన మహోత్సవంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు.

 తర్వాత బండి సంజయ్ కామెంట్స్ పై స్పందిస్తూ దేశంలో అనేక ప్రభుత్వాలను బీజేపీ కూల్చివేసిందని, అలాంటి ప్రభుత్వాల్లో ఎంత మంది రాజీనామా చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సంజయ్ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. తాము డిసెంబర్ 3న ఎన్నికయ్యామని, ఆ రోజే కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తే ఈ రోజు వరకు కేసీఆర్ కుటుంబసభ్యులు తప్పా ఎవ్వరూ మిగిలేవారు కాదన్నారు. 

ఆనాడు రాజకీయ పునరేకీకరణ అంటూ ప్రోత్సహించిన చేరికలు తప్పయితే...తప్పయిందని చెప్పాలని కేసీఆర్​కు సవాల్ విసిరారు. కోడ్ తో కుల గణనలో ఆలస్యం జరిగిందని, మరో మూడు రోజుల్లో ప్రభుత్వం ప్రకటన చేస్తుందన్నారు.