శ్మశానంలో పూడ్చుతుంటే.. ఏడ్చిన చిన్న పాప :డాక్టర్ డెత్ సర్టిఫికెట్ ఎలా ఇచ్చాడు..?

శ్మశానంలో పూడ్చుతుంటే.. ఏడ్చిన చిన్న పాప :డాక్టర్ డెత్ సర్టిఫికెట్ ఎలా ఇచ్చాడు..?

అప్పుడే పుట్టిన శిశువు..అతి తక్కువ బరువుతో పుట్టింది. హృదయ స్పందన తక్కువగా ఉంది. కదలిక కనిపించడం లేదు.. మా ప్రయత్నం మేం చేశాం.. శిశువు చనిపోయిందని వైద్యం అందించిన డాక్టర్లు ప్రకటించారు. మరణ ధృవీకరణ పత్రంతో పాటు మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు..పురిట్లోనే బిడ్డ చనిపోవడంతో భోరున విలపించిన తల్లిదండ్రులు శిశువును అంత్యక్రియలకు స్మశాన వాటికకు తీసుకెళ్లారు. అయితే  అంతిమ సంస్కారాలకు ఒక క్షణం ముందు ఆస్పత్రిలో శిశువును అప్పగించిన పార్శిల్ తెరిచి చూడగా.. శిశువు ఏడుస్తున్నట్లు శబ్ధం విని అంతా షాక్ అయ్యారు. తేరుకొని డాక్టర్ల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వివరాల్లోకి వెళితే.. అస్సాంలోని సిల్చార్ పట్టణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించిన నవజాత శిశువు అంతిమ సంస్కారాలకు కొద్ది క్షణాల ముందు సజీవంగా ఉన్నట్లు బంధువులు గుర్తించారు. మంగళవారం (అక్టోబర్ 3)రాత్రి శిశువుకు జన్మనివ్వగా బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. నవజాత శిశువును శ్మశానవాటికకు తీసుకెళ్లారు.  ఆసుపత్రిలో డాక్టర్ల పార్శిల్‌ను తెరిచి చూడగా ఆ శిశువు ఏడుస్తున్నట్లు కనిపించడంతో అక్కడి వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

 ప్రెగ్నెన్సీ సంబంధిత సమస్యల కారణంగా మూడు రోజుల ముందు ఆరు నెలల గర్భిణిని ప్రభుత్వాసుపత్రిలో చేర్చినట్లు బంధువులు తెలిపారు."ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన చికిత్స చేయని కారణంగా మేము రోగిని మంగళవారం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాం.. అక్కడ ఆమె రాత్రి 10 గంటలకు మగబిడ్డకు జన్మనిచ్చింది. పాప కదలికలు కనిపించడం లేదని, అందుకే అబ్జర్వేషన్‌లో ఉంచుతామని డాక్టర్లు తండ్రి రతన్ దాస్‌కి చెప్పారు. అయితే బుధవారం ఉదయం శిశువు చనిపోయినట్లు తెలిపారు. మరణ ధృవీకరణ పత్రంతో పాటు మృతదేహాన్ని అప్పగించారు. 

మరోవైపు పాప ప్రాణాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రిపై సమగ్ర విచారణ జరిపించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఆసుపత్రి అధికారులపై కుటుంబ సభ్యులు సిల్చార్ సదర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.