ట్రాక్టర్లకూ కరోనా దెబ్బ!

ట్రాక్టర్లకూ కరోనా దెబ్బ!

ఫస్ట్‌ వేవ్‌ టైమ్‌లో సేల్స్‌ పెరిగినా ఇప్పుడు పడుతున్నాయి
 గ్రామాల్లో డిమాండ్ తగ్గడమే కారణం
 టూ వీలర్ల పరిస్థితి కూడా అంతే..

బిజినెస్‌‌డెస్క్‌‌, వెలుగు: కరోనా సెకెండ్‌‌ వేవ్‌‌ ప్రభావం ట్రాక్టర్ల అమ్మకాలపై కూడా తీవ్రంగా పడుతోంది. కిందటేడాది నేషనల్‌‌ లాక్‌‌డౌన్‌‌తో ప్యాసెంజర్‌‌‌‌, కమర్షియల్ వెహికల్స్‌‌ సేల్స్ భారీగా తగ్గాయి. కానీ, ఆ టైమ్‌‌లో కూడా ట్రాక్టర్ల అమ్మకాలు పుంజుకోవడం చూశాం. సెకెండ్‌‌ వేవ్‌‌ మాత్రం ట్రాక్టర్ల సేల్స్‌‌పై నెగిటివ్‌‌ ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది మార్చితో పోల్చుకుంటే ఏప్రిల్‌‌లో ట్రాక్టర్ల అమ్మకాలు ఏకంగా 45 శాతం తగ్గాయి. మే నెల అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 8 శాతం మేర తగ్గాయి. కరోనా కేసులు పెరుగుతుండడంతో వివిధ రాష్ట్రాల్లో లాక్‌‌డౌన్‌‌ రిస్ట్రిక్షన్లు  అమలవుతున్నాయి. కరోనా సెకెండ్‌‌వేవ్‌‌ ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో కూడా తీవ్రంగా కనిపిస్తోంది. టైర్‌‌‌‌ 2, 3 సిటీలలో కరోనా రిస్ట్రిక్షన్లు పెరిగాయి. డీలర్‌‌‌‌షిప్‌‌లు మూతపడడం, రూరల్ డిమాండ్ పడిపోవడం వంటి కారణాలతో ఈ సారి ట్రాక్టర్ల సేల్స్‌‌ పుంజుకోవడం లేదు. కిందటేడాది రూరల్‌‌ డిమాండ్‌‌ బలంగా ఉండడంతో లాభపడ్డ టూ–వీలర్ సేల్స్ కూడా ఈ సారి తగ్గుతున్నాయి.  ఈ ఏడాది మార్చితో పోలిస్తే  ఏప్రిల్‌‌లో టూ వీలర్ అమ్మకాలు 28 శాతం తగ్గి 8,89,453 వెహికల్స్‌‌గా నమోదయ్యాయని ఫెడరేషన్‌‌ ఆఫ్‌‌ ఆటోమొబైల్‌‌ డీలర్స్‌‌ అసొసియేషన్‌‌(ఫాడా) పేర్కొంది. అదే ఏప్రిల్‌‌తో పోలిస్తే  మే  నెలలో టూ వీలర్ అమ్మకాలు ఏకంగా 62.81 శాతం తగ్గి కేవలం 3,30,823 వెహికల్స్‌‌గా నమోదయ్యాయి. 
టాప్‌‌ ట్రాక్టర్‌‌‌‌ కంపెనీల సేల్స్ డౌన్‌‌!
అర్బన్‌‌ ఏరియాలలో  డిమాండ్‌‌ తగ్గినా రూరల్‌‌ డిమాండ్‌‌ ఉండడంతో కిందటేడాది  ట్రాక్టర్‌‌‌‌, టూ వీలర్‌‌‌‌ అమ్మకాలు బాగానే జరిగాయి. ఈ  సారి మాత్రం కరోనా ప్రభావం గ్రామీణ ప్రాంతాలలో కూడా కనిపిస్తోంది. దీంతో సేల్స్‌‌ పడుతున్నాయి.  మార్కెట్‌‌ లీడర్‌‌‌‌గా ఉన్నా మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టర్ల అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన చూస్తే మే నెలలో 4.9 శాతం మేర తగ్గాయి.  కిందటేడాది మే లో  24,017 ట్రాక్టర్లను అమ్మిన ఈ కంపెనీ, ఈ ఏడాది మే లో 22,843 ట్రాక్టర్లను విక్రయించగలిగింది. మిగిలిన ట్రాక్టర్‌‌‌‌ కంపెనీల సేల్స్‌‌ కూడా తగ్గాయి. ఏడాది ప్రాతిపదికన చూస్తే టేఫ్‌‌ గ్రూప్‌‌ ట్రాక్టర్ అమ్మకాలు 32.4 శాతం, సోనాలిక ట్రాక్టర్‌‌‌‌ అమ్మకాలు 10.2 శాతం పడ్డాయి. ఎస్కార్ట్స్‌‌ అమ్మకాలు  4.6 శాతం, నూ హోలాండ్ అమ్మకాలు 10.5 శాతం మేర తగ్గాయి. జాన్ డీర్‌‌‌‌, కుబోట్‌‌, ప్రీత్‌‌, ఇండో ఫార్మ్‌‌ వంటి మార్కెట్ షేర్‌‌‌‌ తక్కువగా ఉన్న కంపెనీల ట్రాక్టర్‌‌‌‌ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన పెరిగాయి.  ఈ ఏడాది మే నాటికి ట్రాక్టర్ సెగ్మెంట్‌‌లో ఎం అండ్ ఎం మార్కెట్‌‌ షేరు 1.3 శాతం పెరిగి 41.1 శాతానికి చేరుకుంది. తర్వాతి స్థానాల్లో  టేఫ్‌‌ గ్రూప్‌‌ (17.1 శాతం), సోనాలిక (12.3 శాతం), ఎస్కార్ట్స్‌‌ (11.1 శాతం), జాన్‌‌ డీర్‌‌‌‌ (7.8 శాతం) కంపెనీలు ఉన్నాయి. ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్‌‌‌‌లో ట్రాక్టర్‌‌‌‌ ఇండస్ట్రీ గ్రోత్‌‌ సింగిల్ డిజిట్‌‌కే పరిమితమయ్యే అవకాశం ఉందని ఎం అండ్ ఎం అభిప్రాయపడుతోంది.  గ్లోబల్‌‌గా సెమికండక్టర్ల కొరత నెలకొనడంతో ప్రొడక్షన్‌‌, సేల్స్‌‌పై నెగిటివ్ ప్రభావం పడుతోందని కంపెనీ క్యూ4 రిజల్ట్స్‌‌ ప్రకటన సందర్భంగా పేర్కొంది. 
సగానికి పైగా తగ్గిన వెహికల్‌‌ రిజిస్ట్రేషన్లు
ఈ ఏడాది ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో రిటైల్ వెహికల్ రిజిస్ట్రేషన్లు సగానికి పైగా తగ్గాయి. కరోనా రిస్ట్రిక్షన్లు పెరగడంతో వివిధ రాష్ట్రాల్లో డీలర్‌‌‌‌షిప్‌‌లు మూతపడడం, రూరల్ డిమాండ్ పడిపోవడంతో వెహికల్‌‌ రిజిస్ట్రేషన్లు తగ్గాయని ఎనలిస్టులు చెబుతున్నారు. మినిస్ట్రీ ఆఫ్‌‌ రోడ్ ట్రాన్స్‌‌పోర్టేషన్‌‌ అండ్ హైవేస్ వెబ్‌‌సైట్‌‌లోని డేటా ప్రకారం మే నెలలో డీలర్‌‌‌‌షిప్‌‌ల వద్ద వెహికల్ రిజిస్ట్రేషన్‌‌లు 55 శాతం మేర తగ్గి 5.36 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. ట్రాక్టర్‌‌‌‌ రిటైల్ రిజిస్ట్రేషన్‌‌లు ఈ ఏడాది వరసగా రెండో నెలలోనూ తగ్గాయి. ఈ ఏడాది ఏప్రిల్‌‌లో 30,301 ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్లు జరగగా, మే నెలలో కేవలం 13,479 ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్లు  మాత్రమే జరిగాయి. ప్యాసెంజర్ కార్ల రిజిస్ట్రేషన్లు 60 శాతం తగ్గి 2,29,894 యూనిట్ల నుంచి 91,916 యూనిట్లకు పడిపోయాయి. టూ వీలర్‌‌‌‌ సెగ్మెంట్‌‌లో ఏప్రిల్‌‌లో 8,65,576 యూనిట్లు రిజిస్టర్‌‌‌‌ అవ్వగా, మే లో కేవలం 4,10,842 యూనిట్లు రిజిస్టర్ అయ్యాయి.కమర్షియల్‌ వెహికల్ రిజిస్ట్రేషన్లు కూడా తగ్గాయి.