భారత్‌లో హింసకు తావులేదు

భారత్‌లో హింసకు తావులేదు

ఢిల్లీలో సీఏఏ వ్యతిరేక నిరసనల్లో చెలరేగిన అల్లర్లు తీవ్ర హింసాత్మకమంగా మారడంపై దేశ వ్యాప్తంగా పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రకమైన అల్లర్లు సరికాదని రాజకీయ నేతలంతా హితవు చెప్పారు. గాంధీజీ పుట్టిన దేశంలో ఇటువంటి హింస జరగడం దారుణమని, అందరూ సంయమనం పాటించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పిలుపునిచ్చారు.

పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ కూడా ఈ అల్లర్లపై స్పందించారు. ఢిల్లీలో జరిగిన ఈ హింస తనను కలచి వేసిందని, ఇలా జరగడం చాలా బాధాకరమని అన్నారామె. మన దేశంలో హింసకు స్థానం లేదని చెప్పారు. భారత్ శాంతిని కోరుకునే దేశమని, ప్రజలంతా శాంతి భద్రతలు దెబ్బతినకుండా సంయమనం పాటించాలని కోరారు.

పదికి చేరిన మృతుల సంఖ్య

నిన్నట్నుంచి ఈశాన్య ఢిల్లీలో CAA వ్యతిరేక ఆందోళనలు పెచ్చరిల్లాయి. మౌజ్ పూర్, జఫ్రాబాద్, కర్వాల్ నగర్, విజయ్ పార్క్, యమునా విహార్ ప్రాంతాల్లో సిటిజెన్ షిప్ అమెండ్ మెంట్ యాక్ట్ కు వ్యతిరేకంగా ఓ వర్గం, అనుకూలంగా మరో వర్గం రోడ్లపైకి వచ్చాయి. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో కొందరు దుండగులు రాళ్లు రువ్వడంతో పాటు కాల్పులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. అల్లర్లలో చెలరేగిన హింస కారణంగా గడిచిన 24 గంటల్లో ఒక హెడ్ కానిస్టేబుల్ సహా పది మంది మరణించారని ఢిల్లీ పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. 56 మంది పోలీసులు, 130 మంది సామాన్యులకు గాయాలయ్యాయని చెప్పారు. వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.