ఢిల్లీ: కమ్లా పసంద్, రాజశ్రీ పాన్ మసాలా అధినేత కమల్ కిషోర్ ఇంట్లో ఆయన కోడలు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన కలకలం రేపింది. కమల్ కిషోర్ కొడుకు హర్ప్రీత్ చౌరాసియా భార్య దీప్తి చౌరాసియా దక్షిణ ఢిల్లీలోని వసంత్ విహార్లో ఉన్న ఇంట్లో చున్నీతో ఉరేసుకుని చనిపోయింది. పోలీసులకు ఆమె గదిలో ఒక డైరీ దొరికింది. ఆమె తన భర్త హర్ప్రీత్ చౌరాసియాతో గొడవల కారణంగానే ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు ఆ డైరీలోని వివరాలను చదివాక పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఒక రిలేషన్ షిప్లో ప్రేమ, నమ్మకం లేనప్పుడు ఆ జీవితానికి ఒక అర్థం అంటూ ఏముంది..? ( “If there is no love and trust in a relationship, what is the point of life?" ) అని ఆమె తన డైరీలో రాసుకొచ్చింది.
2010లో దీప్తికి, హర్ప్రీత్కు వివాహం జరిగింది. వీళ్లకు 14 ఏళ్ల వయసున్న కొడుకు కూడా ఉన్నాడు. ఆమె గదిలో డైరీతో పాటు సూసైడ్ నోట్ కూడా పోలీసులకు లభ్యమైంది. ‘‘No Love No Trust’’ అని ఆ నోట్లో రాసి ఉంది. అంతకు మించి ఆ నోట్లో ఏం రాసి లేదు. పోలీసులు ఆమె మృతదేహాన్ని సఫ్దర్ గంజ్ హాస్పిటల్కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇదిలా ఉండగా.. దీప్తి సోదరుడు రిషబ్ తన బావ హర్ప్రీత్ పై, అతని కుటుంబంపై సంచలన ఆరోపణలు చేశాడు. దీప్తి సోదరుడు రిషబ్ విలేకరులతో మాట్లాడుతూ.. తన సోదరిని ఆమె భర్త, అత్తమామలు శారీరకంగా దాడి చేసి, వేధిస్తున్నారని, హర్‌ప్రీత్‌కు వివాహేతర సంబంధాలు ఉన్నాయని కూడా చెప్పాడు.
Also read:- 26/11.. గుర్తొస్తేనే ఒళ్లు గగుర్పొడిచే మారణకాండ.. పదిహేడేళ్ల చేదు జ్ఞాపకం
తన సోదరిని ఆమె అత్త, భర్త కొట్టేవారని.. ఆమె భర్త హర్‌ప్రీత్‌కు వివాహేతర సంబంధం ఉండేదని.. ఆ విషయం తమకు తెలియగానే, దీప్తిని తాము పుట్టింటికి తీసుకెళ్లిపోయామని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత.. ఆమె అత్త వచ్చి దీప్తిని తిరిగి తీసుకెళ్లిందని దీప్తి సోదరుడు వివరించాడు. తన సోదరి ఫోన్ చేసి తనను హింసించారని, తన భర్తకు వివాహేతర సంబంధం ఉందని చెప్పేదని రిషబ్ కన్నీటి పర్యంతమయ్యాడు. తన సోదరిని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయని.. రెండు మూడు రోజుల క్రితం కూడా ఆమెతో మాట్లాడానని.. ఈ కేసులో నిజానిజాలను నిగ్గు తేల్చి తమ కుటుంబానికి న్యాయం చేయాలని దీప్తి చౌరాసియా సోదరుడు పోలీసులను వేడుకున్నాడు.
