26/11.. గుర్తొస్తేనే ఒళ్లు గగుర్పొడిచే మారణకాండ.. పదిహేడేళ్ల చేదు జ్ఞాపకం

26/11.. గుర్తొస్తేనే ఒళ్లు గగుర్పొడిచే మారణకాండ.. పదిహేడేళ్ల చేదు జ్ఞాపకం

26/11.. అంటే.. నవంబర్ నెల.. 26వ తేదీ.. ఈ డేట్ వింటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అవును ఆరోజు ముంబై మహా నగరంలో జరిగిన మారణకాండ అటువంటిది. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే ఈ తోయిబాకు చెందిన 10 మంది ముష్కరులు సముద్ర మార్గం ద్వారా భారత్‌లోకి ప్రవేశించారు. సాయుధులైన ఆ 10 మంది ముంబైలో 12 చోట్ల దాడులు జరిపారు.

ఆనాటి దాడుల్లో 166 మంది అమాయకులు చనిపోగా..300 మందికి పైగా గాయపడ్డారు. నవంబర్ 26, 2008న ప్రారంభమైన.. ఈ దాడులు మూడు రోజుల పాటు ముంబై వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఏ క్షణం ఎక్కడ ఏ ఉగ్రవాది కాల్పులు జరుపుతాడోనని భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ గడిపారు. నవంబర్ 29, 2008న ఉగ్ర దాడులకు అడ్డుకట్ట పడింది.

ఈ దాడుల్లో కీలక పాత్ర వహించిన ఉగ్రవాది కసబ్. మూడు రోజుల కాల్పుల ఘటన తర్వాత భారత సైన్యం అతనిని సజీవంగా పట్టుకుంది. ఆ తర్వాత కోర్టుల చుట్టు తిప్పీ.. తిప్పీ.. చివరికి నవంబర్ 21, 2012న పూణేలోకి యరవాడ జైలులో ఉరి తీశారు. 26/11 దాడులలో అమాయకులైన 166 మంది ప్రాణాలు పొగొట్టుకున్నారు. అది జరిగి నేటికి 17 సంవత్సరాలు గడిచింది. ప్రాణాలొదిలిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌.. పోలీస్ మెమోరియల్ దగ్గర నివాళులు అర్పించారు.