అవినీతి పార్టీలను ఓడించాలె : ఆకునూరి మురళి 

అవినీతి పార్టీలను ఓడించాలె : ఆకునూరి మురళి 

 

  • అవినీతి పార్టీలను ఓడించాలె
  • ‘జాగో తెలంగాణ’ మీటింగ్​లో ఆకునూరి మురళి 
  • కమీషన్ల కోసమే ప్రాజెక్టులు: జస్టిస్ చంద్రకుమార్

హైదరాబాద్, వెలుగు:   విద్వేష, మతతత్వ, అవినీతి, ఆర్థిక దోపిడీ రాజకీయాలు చేసే పార్టీలను ఓడించాలని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. కర్నాటక ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన ఎన్జీవోలను రోల్ మోడల్‌‌‌‌గా తీసుకుని ‘జాగో తెలంగాణ’ పేరుతో తెలంగాణ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తామని ఆయన వెల్లడించారు. శనివారం హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్‌‌‌‌ క్లబ్‌‌‌‌లో ‘జాగో తెలంగాణ’ పేరిట నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. 

‘‘రాష్ట్రం ఏర్పడ్డాక పేదరికం లేని తెలంగాణను చూస్తానని అనుకున్నా. కానీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని, బీజేపీ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి” అని విమర్శించారు. అన్ని ప్రభుత్వాల్లోనూ దోపిడీ జరిగింది కానీ ఈ స్థాయిలో దోపిడీ ఏ ప్రభుత్వమూ చేయలేదన్నారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ప్రజాస్వామిక పరిపాలన చేయట్లేదని, రాజరిక పాలన చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు, వైఎస్ఆర్, రోశయ్య ఇలా ఎంతో మంది పాలించారని, కానీ ఎన్నడూ ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి లేదన్నారు.

 అసలు ఇదొక పరిపాలనేనా? అని అనిపిస్తోందన్నారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేవలం కమీషన్ల కోసమే ప్రాజెక్టులు కడుతున్నారని ఆరోపించారు. హిందూ, ముస్లిం, ఇతర ఏ మతోన్మాదాన్ని అయినా తాము వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు.  

లీడర్ల తప్పులను ఎత్తిచూపాలె: పాశం యాదగిరి  

రౌండ్ టేబుల్ సమావేశంలో సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి మాట్లాడుతూ.. కర్నాటకలో నాయకుల తప్పులను ఎత్తిచూపడంలో ఎన్జీవోలు సక్సెస్ అయ్యారని, ఇక్కడ కూడా ఎన్నికల్లో అదే తరహాలో ప్రచారం చెయ్యాలన్నారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో విద్వేషాలను రెచ్చగొట్టే నాయకులకు వ్యతిరేకంగా, జాతీయ, రాష్ట్ర స్థాయిలో అవినీతి, దోపిడీని మేధావులు, పౌర సంఘాలు ఎండగట్టాలని, ప్రజల ఆకాంక్షలతో మేనిఫెస్టోను తీసుకురావాలని సమావేశంలో తీర్మానం చేశారు.