బీజేపీని ఢీకొట్టడం  అంత ఈజీ కాదేమో!

బీజేపీని ఢీకొట్టడం  అంత ఈజీ కాదేమో!

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహ రచన చేస్తున్నాయి. ఎన్నికలకు దాదాపు మరో 24 నెలలు మాత్రమే సమయం ఉండటంతో అటు కాంగ్రెస్ తో పాటు ప్రాంతీయ పార్టీలూ బీజేపీని ఢీకొట్టేందుకు సమాయత్తమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సహా శివసేన పార్టీ నేతలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. తెలంగాణలో మొన్నటి టీఆర్ఎస్  ప్లీనరీ లో కేసీఆర్ చేసిన ప్రసంగం, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో ఆ పార్టీ ఒప్పందం, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ తో సమావేశాలు బీజేపీపై ఉన్న వ్యతిరేకతను సూచిస్తున్నాయి. అయితే బీజేపీ దేశంలో ప్రత్యక్షంగా, అలయెన్సులతో కలిపి దాదాపు18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రంలో పటిష్టంగా ఉన్న బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఓడించడం ప్రతిపక్షాలకు సులువేనా? 2014లో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, జార్ఖండ్, మధ్య ప్రదేశ్, చత్తీస్ గఢ్, ఉత్తరప్రదేశ్, గోవా, కర్నాటకతో పాటు కాశ్మీర్ వంటి రాష్ట్రంలో కూడా పీడీపీ మద్దతుతో కాషాయ జెండా రెపరెపలాడింది. ఈశాన్య రాష్ట్రాల్లో సైతం పార్టీ అధికారంలోకి వచ్చింది. మొన్న జరిగిన ఐదు రాష్టాల ఎన్నికల్లో తిరిగి నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించింది. 

నాలుగు రాష్ట్రాల గెలుపుతో..

నిజానికి మొన్నటి ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ పాలనపైనే కాకుండా ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో తిరిగి పార్టీ గెలుపుపై రకరకాల అనుమానాలు వచ్చాయి. ముఖ్యంగా ‘రైతు చట్టాల’పై రైతుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నదని, కరోనా కాలంలో మోడీ ప్రభుత్వ పని తీరు బాగాలేదని, ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ పరం చేస్తున్నారని, యూపీలో ఉన్నావ్ రేప్ కేసు, హత్రాస్ ఘటన ఇలా ఎన్నో కారణాలు చూపుతూ.. బీజేపీ ఓటమి తథ్యమని అంతా భావించారు. కానీ విశ్లేషకులు, ప్రతిపక్షాల అంచనాలు తలకిందులయ్యాయి. నాలుగు రాష్టాల్లో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. యూపీలో ఈ స్థాయిలో గెలుపు ఎవరూ ఊహించ లేదు. అంటే, దేశంలోని మెజారిటీ ప్రజలు ఇప్పటికీ బీజేపీ పాలననే కోరుకుంటున్నారనే విషయం స్పష్టమైంది. బీజేపీ పాలన మిగిలిన పార్టీల పాలన కంటే భిన్నమైనది. స్థానిక పరిస్థితులు ఎట్లా ఉన్నా, దేశ ప్రజలు కేంద్రంలో బీజేపీనే ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. దానికి మోడీ మానియా, సుస్థిర పాలన, సమస్యకు పరిష్కారం అనే సిద్ధాంతం లాంటి కారణాలు ఎన్నో ఉన్నాయి.

సుస్థిర పాలన

అటు కేంద్రంలో ఇటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సుస్థిర పరిపాలన సాగుతున్నది. ఒకప్పుడు అస్థిర ప్రభుత్వాలతో కేంద్రంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో అనే గందరగోళం ఉండేది. 2014 నుంచి పరిస్థితులు పూర్తిగా మారాయి. ప్రధానిగా మోడీ పాలనలోనూ తనదైన ముద్ర వేశారు. అవినీతికి తావులేని, భారతాన్ని ఆవిష్కరించారు. ‘టీం ఇండియా’ అనే నినాదంతో రాష్ట్రాలను సమన్వయం చేసుకుంటూ దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. అప్పటి దాకా ఉన్న పన్నులన్నీ రద్దుచేసి ఒకే దేశం ఒకే పన్ను అనే నినాదంతో జీఎస్టీ తెచ్చినా, నల్లధనం బయటకు తీసేందుకు పెద్దనోట్లు రద్దు చేసినా, వ్యవసాయ మార్కెట్ విధానంలో సంస్కరణలు తెచ్చినా.. అది తమకోసమే అని ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే ప్రజలు తిరిగి మోడీకి విజయం కట్టబెట్టారు. మోడీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. ‘స్కిల్ ఇండియా’ పథకం కింద యువతలో నైపుణ్యాలను మెరుగుపరిచి వారికీ ఉద్యోగ అవకాశాలు అందేలా చేశారు. దశాబ్దాల నాటి జాతీయ విద్యా విధానంలో సంస్కరణలు తెచ్చారు. ‘మేక్ ఇన్ ఇండియా’ ద్వారా దేశాన్ని తయారీ కేంద్రంగా మార్చారు. ‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమంతో ఆర్థికలావాదేవీల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం  ద్వారా  రైతులకు పెట్టుబడి సాయం అందుతోంది. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన, ఆయుష్మాన్ భారత్, స్వచ్ఛ్​ భారత్, స్మార్ట్ సిటీ పథకం, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, కౌశల్ వికాస్ యోజన వంటి పథకాలతో మోడీ తన పాలన మార్క్ వదిలారు. భేటీ బచావో భేటీ పడావో ద్వారా మహిళలకు మరింత చేరువయ్యారు. అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట పెరిగేలా చేశారు. 

మోడీపై తగ్గని ప్రజాదరణ 

బీజేపీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లు గడుస్తున్నా మోడీపై ప్రజాదరణ తగ్గ లేదు. కేంద్రంలో వరుసగా రెండు సార్లు పార్టీని అధికారంలోకి తీసుకురావడం, మెజారిటీ రాష్ట్రాల్లో పార్టీ అధికారంలోకి రావడం ఒక్క మోడీతోనే సాధ్యమైంది. పార్లమెంట్ ఎన్నికలతోపాటు, ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోడీని చూసే ప్రజలు ఓట్లు వేస్తున్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఈ విషయం రుజువైంది కూడా. ఉత్తరప్రదేశ్ తో సహా ఇతర మూడు రాష్ట్రాల్లో అంతర్గతంగా ఆయా నాయకుల మధ్య విభేదాలు, ప్రజల్లో వారిపై వ్యతిరేకత ఉన్నా ‘మోడీ మానియా’ ముందు అవేవి ప్రజలకు కనిపించలేదు. స్వతహాగా రాజకీయ వారసత్వం లేని మోడీ, బీజేపీలో వారసత్వ రాజకీయాలకు తావులేకుండా చేస్తున్నారు. తన హయాంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు బీజేపీ పాలిత రాష్టాల్లోనూ ఎలాంటి కుంభకోణాలు, నిధుల దుర్వినియోగాలు జరగకుండా చేయడంతో ఆయన పై ప్రజల్లో సానుకూల దృక్పథం ఏర్పడింది.  
‌‌‌‌- డా. బండారు రామకృష్ణ
అసిస్టెంట్ ప్రొఫెసర్, కిట్ యూనివర్సిటీ, ఒడిశా