పాక్ ఆక్రమిత కాశ్మీర్ను త్వరలో స్వాధీనం చేసుకుంటాం

పాక్ ఆక్రమిత కాశ్మీర్ను త్వరలో స్వాధీనం చేసుకుంటాం

పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాక్కు గట్టి హెచ్చరికలు పంపారు. పీఓకేలో అనేక అరాచకాలు జరుగుతున్నాయని..వీటిపై పాక్  కు తీవ్ర పరిణామాలు తప్పదని హెచ్చరించారు. అంతేకాదు..త్వరలోనే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేసుకుంటామని రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. 75వ ఇన్ ఫాంట్రీ డే  కార్యక్రమంలో భాగంగా శ్రీనగర్‌లో నిర్వహించిన శౌర్యదివాస్లో  రాజ్‌నాథ్‌ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

పీఓకే ప్రజల బాధలు బాధిస్తున్నాయి. 
ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ మానవహక్కుల కోసం పోరాడుతున్నట్లు చెప్పుకుంటోందని...కానీ పీవోకేలో మాత్రం ప్రజల హక్కులను కాలరాస్తోందని రాజ్ నాథ్ సింగ్ మండిపడ్డారు. పీవోకేలో ప్రజలు అనేక బాధలు పడుతున్నారని చెప్పారు. త్వరలో వారి బాధలను తొలగిస్తామన్నారు. మోడీ నాయకత్వంలో  370 అర్టికల్ను రద్దు చేశామని గుర్తు చేశారు. దీని వల్ల జమ్మూ కశ్మీర్ ప్రజలు స్వేచ్ఛాయుత జీవితాన్ని అనుభవిస్తున్నారన్నారు. జమ్మూకశ్మీర్, లద్దాఖ్ కేంద్రప్రాంతాలుగా మారిన తర్వాత అభివృద్ధిలో దూసుకుపోతున్నాయన్నారు. త్వరలో ఈ అభివృద్ధి ప్రయాణం  గిల్గిట్, బాల్టిస్థాన్కు చేరుకుంటుందన్నారు. 

ఇన్ ఫాంట్రీ డే...
స్వాతంత్య్ర సమయంలో పాక్ సైన్యం కశ్మీర్ పై దాడి చేసింది. 1947 అక్టోబర్ 27న పాక్ దాడిని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. దీనిని పురస్కరించుకుని భారత ఆర్మీ ప్రతీ ఏడాది అక్టోబర్ 27న ఇన్ ఫాంట్రీ డేను జరుపుకుంటోంది. దీనిలో భాగంగా పాకిస్తాన్ సైన్యం  దాడిలో అమరులైన భారతీయ పదాతిదళ సైనికులను గౌరవించడం, నివాళులర్పించడం కోసం ప్రతి సంవత్సరం అక్టోబర్ 27 న పదాతిదళ దినోత్సవాన్ని జరుపుతున్నారు. 

పాక్ ఎందుకు దాడి చేసింది...?
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన కొద్దిరోజుల తర్వాత జమ్మూ కశ్మీర్ భారతదేశంలో భాగమైంది. 1947 అక్టోబర్ 26న శ్రీనగర్ మహారాజ్ హరి సింగ్ దేశంలో జమ్మూకశ్మీర్ ను విలీనం చేసేందుకు సంతకం చేశారు. ఆ తర్వాత జమ్మూకాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమైంది. అయితే దీన్ని తట్టుకోని పాకిస్థాన్‌.. తర్వాతి రోజే...జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో కశ్మీర్పై దాడికి పాల్పడి.. కొంత భాగాన్ని ఆక్రమించుకుంది. పాక్ దాడిని భారత ఆర్మీ విజయవంతంగా తిప్పికొట్టింది. ధైర్యంగా పోరాడినా... చాలా మంది భారత ఆర్మీ అధికారులు అమరులయ్యారు.