
- ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరిని విశాఖపట్టణంలో ప్రారంభించిన రాజ్ నాథ్ సింగ్
- నేవీ సముద్ర రక్షణతోపాటు ఆర్థిక భద్రతలోనూ కీలకం
- పహల్గాం దాడికి ‘ఆపరేషన్సిందూర్’తో సమాధానం చెప్పామన్న రక్షణ మంత్రి
విశాఖపట్నం: ఏపీలో విశాఖపట్టణంలోని ఈస్టర్న్ నేవల్ కమాండ్‌లో రెండు మల్టీమిషన్ స్టెల్త్ ఫ్రిగేట్లు ఐఎన్‌ఎస్ ఉదయగిరి, ఐఎన్‌ఎస్ హిమగిరిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం ప్రారంభించారు. రెండు వేర్వేరు షిప్‌యార్డుల్లో నిర్మించిన యుద్ధ నౌకలను ఏకకాలంలో ప్రారంభించడం దేశంలో ఇదే మొదటిసారి. ఐఎన్ఎస్ఉదయగిరి ముంబైలోని మజగాం డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌లో, హిమగిరి కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్‌లో నిర్మించారు. వాటిని ఈస్టర్న్ నేవల్ కమాండ్‌లో జలప్రవేశం చేయడం ఇండియా తూర్పు సముద్ర తీరానికి పెరుగుతున్న ప్రాముఖ్యతను చాటింది.
శివాలిక్ శ్రేణి చెందినఈ రెండు ఫ్రిగేట్లను నేవీ అత్యాధునిక ప్రాజెక్ట్ 17ఏలో భాగంగా రూపొందించారు. వీటిలో రాడర్లకు కనిపించని స్టెల్త్ టెక్నాలజీ, వెపన్స్, సెన్సర్ వ్యవస్థలను చాలా డెవలప్‌చేశారు. బ్లూ వాటర్ పరిస్థితుల్లో(తీరం నుంచి చాలా దూరంగా) కూడా అన్ని రకాల కార్యకలాపాలను నిర్వహించగలవు.
ఫ్రిగేట్లను ప్రారంభించిన తర్వాత రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ నౌకాదళం సముద్ర రక్షణతో పాటు ఆర్థిక భద్రతకు కూడా ముఖ్యమని చెప్పారు. దేశ ఇంధన అవసరాలు ఈ ప్రాంత భద్రతపై ఆధారపడతాయి. ఈ రెండు యుద్ధనౌకలు మన నేవీ బలం, స్థిరత్వాన్ని పెంచుతాయని, ఆత్మనిర్భర్ భారత్‌కు, దేశ భద్రతకు ఇవి మైలురాళ్లని చెప్పారు. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో శాంతి, సమృద్ధిని కాపాడుతుందని తెలిపారు. ఇండియా ఎన్నడూ దూకుడుగా విస్తరించలేదని, ఏ దేశంపైనా మొదట దాడి చేయలేదని చెప్పారు. అయితే దేశ భద్రతకు భంగం కలిగితే గట్టి స్పందించడం తెలుసన్నారు. పహల్గాం ఉగ్రదాడికి ‘ఆపరేషన్ సిందూర్’తో గట్టి సమాధానం ఇచ్చామని తెలిపారు. పాక్‌లోని టెర్రరిస్టుల క్యాంపులు ధ్వంసం చేశామని తెలిపారు. ఈ ఆపరేషన్ తాత్కాలికంగా నిలిపివేసినా, ఇంకా ముగియలేదన్నారు.
ఫ్రిగేట్ల ప్రత్యేకతలు
మాడ్యులర్ తరహా నిర్మాణంతో ఈ క్లాస్‌లో అత్యంత వేగంగా రూపుదిద్దుకున్న నౌకగా ఐఎన్ఎస్ ఉదయగిరి గుర్తింపు పొందింది. 6,700 టన్నుల బరువుతో శివాలిక్ శ్రేణి యుద్ధనౌకల కంటే ఐదు శాతం పెద్దగా ఉంటుంది. రాడార్లకు చిక్కని టెక్నాలజీ, సన్నని రూపంతో రూపొందాయి. ఇందులో స్వదేశీ ఆయుధాలు, సెన్సర్లు, సూపర్‌సోనిక్ సర్ఫేస్- టు సర్ఫేస్ మిసైళ్లు, మధ్య శ్రేణి సర్ఫేస్ -టు-ఎయిర్ మిసైళ్లు, 76 ఎంఎం గన్, 30 ఎంఎం, 12.7 ఎంఎం వంటి ఆయుధ వ్యవస్థలు ఉన్నాయి.
ఐఎన్‌ఎస్ హిమగిరి ఫ్రిగేట్.. ప్రాజెక్ట్ 17ఏలో భాగంగా నీలగిరి క్లాస్ లో తయారు చేసిన మొదటి అత్యాధునిక స్టెల్త్ యుద్ధనౌక. దీని బరువు 6,700 టన్నులు, పొడవు149 మీటర్లు. రాడార్లకు కనిపించని స్టెల్త్ డిజైన్ దీని ప్రత్యేకత. బ్రహ్మోస్, బారక్–8 మిసైళ్లు, ఓటీవో మెలారా 76 మి.మీ. గన్‌తో కూడిన ఇది బ్లూ వాటర్ మిషన్లను సమర్థంగా నిర్వహించగలదు. దీని వేగం 28 నాటికల్ మైళ్లు.