లోటు పూడ్చేలా.. ఆదాయం పెంచేలా!..కామారెడ్డి మున్సిపాలిటీలో లోటు బడ్జెట్‌‌

లోటు పూడ్చేలా.. ఆదాయం పెంచేలా!..కామారెడ్డి మున్సిపాలిటీలో లోటు బడ్జెట్‌‌
  •     ఆస్తి పన్ను  విధింపు, లోటు పాట్లపై మున్సిపల్‌‌ యంత్రాంగం దృష్టి  
  •     క్షేత్రస్థాయిలో వార్డుకో టీమ్ ఏర్పాటు
  •      ప్రతి ఇంటి కొలతలు సరి చూస్తున్న యంత్రాంగం
  •     ఏటా ఆదాయం పెరిగే అవకాశం 

కామారెడ్డి ​, వెలుగు: కామారెడ్డి మున్సిపాలిటీలో ఆదాయం పెంచే మార్గాల కోసం అధికారులు కసరత్తు మొదలెట్టారు. ఇప్పటికే మున్సిపాలిటీ లోటు బడ్జెట్‌‌లో కూరుకుపోవడంతో  దీని నుంచి బయటపడటమే లక్ష్యంగా మున్సిపల్ ఆదాయాన్ని పెంపొందించే మార్గాలపై దృష్టి పెట్టింది.  ముఖ్యంగా ఆస్తి పన్ను విధింపులో ఉన్న లోటు పాట్లను సరిదిద్దే చర్యలపై ఫోకస్‌‌ పెట్టారు.  ప్రధాన ఏరియాలో ఉన్న బిల్డింగ్‌‌లలో గతంలో కొలతలు సరిగా తీయకపోవడంతో తక్కువగా ఆస్తి పన్ను విధిస్తున్నారు.  

ఇదే సమయంలో పైన మరో బిల్డింగ్ నిర్మాణం చేసినప్పటికీ కింది అంతస్తుకు మాత్రమే ట్యాక్స్‌‌ చెల్లిస్తున్నారు.  కమర్షియల్ బిల్డింగ్‌‌లకు రెసిడెన్షియల్ ట్యాక్స్‌‌ చెల్లించడం,  కొన్ని చోట్ల ఇండ్ల నిర్మాణాలు చేపట్టిన ఆస్తి పన్ను ఎగ్గొటడం చేస్తున్నారు.  ఆదాయ మార్గాల పెంపు కోసం క్షేత్రస్థాయిలో మున్సిపాలిటీలో మరోసారి అన్ని బిల్డింగ్‌‌ల కొలతలు సరి చూడాలని మున్సిపల్ ఆఫీసర్లు నిర్ణయించారు.  ప్రతి ఇంటి కొలతలు తీస్తున్నారు.  అయితే పరిశీలన పూర్తయితే ఇప్పుడు వస్తున్న ఆదాయం కంటే మరో రూ. కోటి అదనంగా ట్యాక్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 

22,250 బిల్డింగ్​లు

మున్సిపల్​ పరిధిలో 49  వార్డులు ఉన్నాయి.  ఇందులో  మొత్తం  22, 250  నిర్మాణాలు ఉంటే ఇందులో  17, 500 రెసిడెన్షియల్​ హౌజ్​లు,  కమర్షియల్ 1,500,  3 వేల వరకు ఇతర బిల్డింగ్​లు  ఉన్నాయి.   వీటి ద్వారా ఏటా రూ. 6.80  కోట్ల ఆస్తి పన్ను వస్తుంది.  టౌన్​లో  కొందరు తమ బిల్డింగ్​ల ఏరియా  ఎక్కువగా ఉన్న ట్యాక్స్‌‌ తక్కువగా చెల్లించటం, కమర్షియల్​కు రెసిడెన్షియల్​ ట్యాక్స్​,  గ్రౌండ్​ ఫ్లోర్​పైన ఫస్ట్, సెకండ్​ ఫ్లోర్​ల నిర్మాణం చేపట్టినప్పటికీ కేవలం గ్రౌండ్​ ఫ్లోర్​కే పన్ను చెల్లించటం వల్ల మున్సిపాలిటీ​ ఆదాయం కోల్పోతుంది.  కొలతల పక్రియ పరిశీలనకు 49 వార్డులకు ఒక్కో టీమ్ ఏర్పాటు చేశారు. 

ఏటా రూ.  4 కోట్ల లోటు

ఏటా మున్సిపల్​ రూ. 4 కోట్ల వరకు బడ్జెట్‌‌ లోటు ఏర్పడుతోంది.  ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి.  ఆస్తి పన్ను, షాపింగ్‌‌ కాంప్లెక్సు, నీటి కుళాయిలు, వివిధ మార్గాల ద్వారా రూ. 11 కోట్ల ఆదాయం వస్తుంది.  ఖర్చు రూ.15 కోట్లు ఉంది.  ఈ పరిస్థితుల్లో  సిబ్బంది జీతాలు ప్రతి నెలా చెల్లించకపోవటం, కరెంటు బిల్లుల బకాలయిలు,  జనరల్ ఫండ్స్​తో ​ చేసిన వర్క్స్​కు పేమేంట్స్​ చెల్లించటంలో జాప్యం లాంటివి ఉన్నాయి. 

కొలతలు సరిచూస్తున్నాం

ఆస్తి పన్ను పెంచడానికి కొలతలు తీయటం లేదు.  బిల్డింగ్​ల కొలతల్ని పరిశీలన చేస్తున్నాం.  ఇందుకోసం వార్డుల వారీగా కొలతలు తీయడానికి టీమ్స్​ ఏర్పాటు చేశాం. ఎక్కువ విస్తీర్ణంలో బిల్డింగ్​ నిర్మాణం జరిగి తక్కువగా పన్ను చెల్లిస్తుంటే వీటిని సరిజేస్తాం.  ఈ పక్రియ త్వరగా కంప్లీట్​ చేస్తాం.- సుజాత, మున్సిపల్​  కమిషనర్​