ఎసిడిటీ అనుకున్నడు.. గుండెనొప్పితో డిగ్రీ స్టూడెంట్​ మృతి

ఎసిడిటీ అనుకున్నడు.. గుండెనొప్పితో డిగ్రీ స్టూడెంట్​ మృతి

కోనరావుపేట,వెలుగు : ఏది గుండెనొప్పో...ఏది ఎసిడిటీనో గుర్తించక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సంఘటనే రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం...  గ్రామానికి చెందిన ఈర్ల సాయెబు-, బాలవ్వ కొడుకు వంశీ(22) డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. తల్లి పదేండ్ల క్రితం అనారోగ్యంతో చనిపోగా సంవత్సరీకం జరిపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గురువారం స్నేహితునితో కలిసి వేములవాడకు వెళ్లి వచ్చిన వంశీకి ఛాతిలో నొప్పి వచ్చింది. ఎసిడిటీ కావచ్చని అనుకున్న వంశీ ఇంట్లో ఉన్న ఇనో తాగాడు. అయినా తగ్గకపోవడంతో స్థానిక ఆర్ఎంపీ దగ్గరకు వెళ్లాడు. సదరు ఆర్​ఎంపీ నొప్పి తగ్గే మందులు ఇచ్చి పంపించాడు. అవి వేసుకున్న వంశీ ఇంట్లో బాత్​రూంకు వెళ్లాడు. చాలాసేపైనా బయటకు రాకపోవడంతో   తండ్రికి అనుమానం వచ్చింది. బాత్​రూం తలుపు తీసి చూడగా వంశీ అపస్మారకస్థితిలో కనిపించాడు. అతడిని సిరిసిల్ల ప్రభుత్వ దవాఖానకు తరలించగా అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. గుండెనొప్పితో చనిపోయాడని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కోనరావుపేట ఎస్సై రమాకాంత్ కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు