సదరం రీఅసెస్మెంట్లకు ఏండ్లుగా ఎదురుచూపులే..రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌‌లో 6,316 అప్పీళ్లు

సదరం రీఅసెస్మెంట్లకు ఏండ్లుగా ఎదురుచూపులే..రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌‌లో 6,316 అప్పీళ్లు
  • డిస్ట్రిక్ట్‌‌ బోర్డులో రిజక్ట్‌‌ కావడంతో స్టేట్‌‌ మెడికల్‌‌ బోర్డుకు అప్లై చేసుకున్న దివ్యాంగులు
  • ఏండ్లు గడుస్తున్నా పట్టించుకోని రాష్ట్ర స్థాయి ఆఫీసర్లు
  • పింఛన్లు, బస్‌‌పాస్‌‌ వంటి బెనిఫిట్స్‌‌కు దూరం అవుతున్న దివ్యాంగులు

కరీంనగర్, వెలుగు : సదరం రీ అసెస్మెంట్లలో జరుగుతున్న జాప్యం దివ్యాంగుల పాలిట శాపంగా మారుతోంది. రీఅసెస్మెంట్‌‌ చేయడంలో రాష్ట్ర స్థాయి మెడికల్‌‌ బోర్డు ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో దివ్యాంగులు అన్ని ప్రభుత్వ పథకాలకు దూరం అవుతున్నారు. ఇలాంటి అప్పీళ్లు రాష్ట్రవ్యాప్తంగా 6 వేలకు పైగా పెండింగ్‌‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఏండ్ల తరబడి ఎదురుచూపులే...

వివిధ కారణాలతో జిల్లా మెడికల్ బోర్డులో రిజెక్ట్ అవడంతో పాటు తక్కువ పర్సంటేజీ వైకల్యం ఉన్నట్లు తేలిన దివ్యాంగులు రాష్ట్ర స్థాయి మెడికల్‌‌ బోర్డుకు అప్పీల్‌‌ చేసుకుంటుంటారు. ఈ అప్పీళ్లను ఎప్పటికప్పుడు క్లియర్‌‌ చేయాల్సిన ఆఫీసర్లు ఏండ్ల తరబడి పెండింగ్‌‌లో పెడుతున్నారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు సంబంధించిన అప్పీళ్లు నాలుగైదేళ్లు, మరికొన్ని జిల్లా నుంచి వచ్చిన అప్పీళ్లు ఏడెనిమిదేండ్లకు పైగా పెండింగ్‌‌లో ఉండడం గమనార్హం. రీఅసెస్‌‌మెంట్‌‌ కాకపోవడంతో సదరం సర్టిఫికెట్‌‌ పొందలేక దివ్యాంగులు పింఛన్లు, బస్‌‌పాస్‌‌లతో పాటు ఇతర బెనిపిట్స్‌‌ను కోల్పోతున్నారు. సదరం క్యాంపుల నిర్వహణను చూడాల్సిన సెర్ప్‌‌ ఆఫీసర్ల నిర్లక్ష్యం, పట్టింపులేనితనం కూడా రీఅసెస్‌‌మెంట్‌‌ జాప్యానికి కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

రాష్ట్రవ్యాప్తంగా ఆరు వేలకు పైనే..

రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కలిపి మొత్తం 6,316 అప్పీళ్లు స్టేట్‌‌ మెడికల్‌‌ బోర్డు వద్ద పెండింగ్‌‌లో ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ఆర్థో, లొకోమోటర్‌‌ డిజేబులిటీకి సంబంధించిన అప్పీళ్లే 4,238 ఉన్నాయి. ఆ తర్వాత విజువల్‌‌ ఇంపెయిర్‌‌మెంట్‌‌వి 714, హియరింగ్‌‌కు సంబంధించిన అప్పీళ్లు 888, మెంటల్‌‌ ఇల్‌‌నెస్‌‌కు సంబంధించిన 427 అప్పీళ్లు పెండింగ్‌‌లో ఉన్నాయి. జిల్లాల వారీగా చూస్తే మహబూబాబాద్‌‌ జిల్లా నుంచి అత్యధికంగా 375 అప్పీళ్లు పెండింగ్‌‌లో ఉండగా, ఇందులో ఆర్థో/లొకోమోటర్‌‌ డిజేబులిటీ అప్పీళ్లు 268, విజువల్‌‌కు సంబంధించి 63, హియరింగ్‌‌కు సంబంధించి 32 ఉన్నాయి. 

రంగారెడ్డి జిల్లాలో 374 అప్పీళ్లు ఉంటే ఆర్థో/లొకోమోటర్ అప్పీళ్లు 302, విజువల్‌‌ 23, హియరింగ్‌‌ 35 ఉన్నాయి. కరీంనగర్‌‌ జిల్లాలో మొత్తం 355 అప్పీళ్లు ఉండగా... ఆర్థో 229, విజువల్‌‌ ఇంపెయిర్‌‌మెంట్‌‌ 45, హియరింగ్‌‌ 72 ఉన్నాయి. హైదరాబాద్‌‌ జిల్లాలో 316 అప్పీళ్లు పెండింగ్‌‌ ఉంటే ఇందులో 290 ఆర్థో, మేడ్చల్‌‌ మల్కాజిగిరి జిల్లాలో 315 అప్పీళ్లకు 245 ఆర్థో ఉన్నాయి. అత్యంత తక్కువగా కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా నుంచి 60, మహబూబూనగర్‌‌ జిల్లా నుంచి 61, జగిత్యాల 78, ఆదిలాబాద్ 86, జనగామ 90, వికారాబాద్ జిల్లా నుంచి 98 అప్పీళ్లు పెండింగ్‌‌లో ఉండగా... మిగతా అన్ని జిల్లాల్లో 100 నుంచి 300 లోపు అప్పీళ్లు స్టేట్‌‌ బోర్డు వద్ద పెండింగ్‌‌లో ఉన్నాయి. ప్రస్తుతం అప్పీళ్లను మాన్యువల్‌‌గానే తీసుకుంటున్నారని, స్టేట్‌‌ బోర్డుకు కూడా ఆన్‌‌లైన్‌‌లో అప్పీల్‌‌ చేసుకునే అవకాశం ఇస్తే పారదర్శకత పెరుగుతుందన్న వాదన వినిపిస్తోంది.  

అప్పీల్‌‌ చేసి మూడేళ్లయినా పిలుపు రాలే.. 

నాకు పక్షపాతం వచ్చి ఎడమ కాలు, చేయి రెండూ పని చేయడం లేదు. కరీంనగర్‌‌ మెడికల్ బోర్డు 2015 మార్చి 19న రెండేండ్ల గడువుతో తాత్కాలికంగా సదరం సర్టిఫికెట్‌‌ జారీ చేసింది. 2017లో రెన్యూవల్‌‌ కోసం మళ్లీ కరీంనగర్‌‌ మెడికల్‌‌ బోర్డు ఎదుట హాజరు అయ్యాను. అప్పుడు పరీక్షించిన డాక్టర్లు నన్ను అనర్హుడిగా నిర్ధారించారు. దీంతో రీఅసెస్‌‌మెంట్‌‌ కోసం 2022లో అప్లై చేసుకోగా... నా అప్లికేషన్‌‌ను స్టేట్‌‌ అప్పీలేట్‌‌ మెడికల్‌‌ బోర్డుకు సిఫార్సు చేశారు. కానీ మూడేండ్లయినా రీఅసెస్‌‌మెంట్‌‌ కోసం పిలువలేదు.- అబ్దుల్‌‌ జావీద్‌‌, కరీంనగర్‌‌