విదేశీ విద్యా పథకంలో అంబేద్కర్ పేరు తొలగింపు..టీడీపీ పోరుబాట

విదేశీ విద్యా పథకంలో అంబేద్కర్ పేరు తొలగింపు..టీడీపీ పోరుబాట

అంబేద్కర్ విదేశీ విద్యా పథకంలో.. అంబేద్కర్ పేరును ఏపీ ప్రభుత్వం తొలగింపుపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనిపై పోరుబాటకు రెడీ అయిపోయింది. మంగళగిరి అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం నేతలు ఆమరణ నిరహార దీక్ష చేపట్టారు. టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎం.ఎస్.రాజు దీక్షలను ప్రారంభించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరిట విదేశీ విద్యా పథకాన్ని గతంలో ప్రవేశపెట్టారని టీడీపీ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు కనికళ్ళ చిరంజీవి గుర్తు చేశారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక... అంబేద్కర్ పేరును తొలగించి ‘జగనన్న విదేశీ విద్య’ పేరు పెట్టుకోవడం సిగ్గు చేటన్నారు. నెల రోజుల ముందే నిరసన తెలియజేసి తాము ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసినా ఎలాంటి స్పందన లేదన్నారు.

ఏ రాజ్యాంగంపై ప్రమాణం చేసి సీఎంగా గద్దె నెక్కారో... అలాంటి రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ పేరు తొలగించి.. ఆయన పేరు పెట్టుకోవడం దళితులను అవమానపరచడమేనన్నారు. అధికారంలోకి రాగానే 29 దళిత సంక్షేమ ఫధకాలు రద్దు పరిచారని వివరించారు. నిరాహార దీక్షకు కూర్చున్న వారిలో టీడీపీ నాయకులు కనికళ్ళ చిరంజీవి, వేమూరి మైనర్ బాబు, యర్రగుంట్ల భాగ్యరావు, కంభంపాటి శిరీష, పినపాటి జీవన్ కుమార్, పడవల మహేష్, కొప్పుల మధుబాబు, బేతపూడి సుధాకర్, మేకల అనిల్ కుమార్, తెనాలి మాణిక్యం, నెమలికంటి అనూష తదితరులు ఉన్నారు. పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు, ప్రజా, దళిత సంఘాల నేతలు అమరణ నిరాహార దీక్షలో కూర్చొన్న వారికి సంఘీభావం తెలిపారు.