ఢిల్లీ గాలి యమ డేంజరస్

ఢిల్లీ గాలి యమ డేంజరస్
  • ఢిల్లీ గాలి డేంజరస్.. మొస మర్రుతలే
  • ఢిల్లీలో అత్యంత డేంజరస్​గా పొల్యూషన్
  • 500 కంటే పైకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్
  • ఇండ్లల్ల కూడా మాస్కులు పెట్టుకుంటున్రు
  • జనం ఎట్ల బతకాలె.. లాక్ డౌన్​ అయినా పెట్టాలని సుప్రీం కోర్టు సూచన
  • ఢిల్లీ కేబినెట్ అత్యవసర సమావేశం
  • వారం రోజుల పాటు స్కూళ్లు, ప్రభుత్వ ఆఫీసులు బంద్
  • జనరేటర్లు, ఇటుక బట్టీలు, స్టోన్ క్రషర్లపై బ్యాన్
  • రైతులను నిందించుడు ఫ్యాషనైంది
  • పంట వ్యర్థాల కాల్చివేతే కారణమా?
  • పొగ, దుమ్ము, పటాకులే పెద్ద సమస్య
  • క్రాకర్స్ పై ఢిల్లీ పోలీసులేం చేస్తున్నట్టు?
  • రేపటికల్లా పరిష్కారాలతో రండి
  • కేంద్ర ప్రభుత్వానికి ఆదేశం

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పొల్యూషన్ తీవ్రతపై సుప్రీంకోర్టు సీరియసైంది. ‘‘ఇండ్లల్ల కూడా జనం మాస్కులు పెట్టుకోవాల్సిన దారుణ పరిస్థితులున్నయి. ఎమర్జెన్సీ సిచ్యుయేషనిది” అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలు తగలబెట్టడమే సమస్యకు కారణమన్నట్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతున్నారని తప్పుబట్టింది. ‘‘అదీ కొంత కారణమే. కానీ ఢిల్లీ కాలుష్యానికి బండ్ల పొగ, పటాకులు, దుమ్ము వంటివే అసలు రీజన్లు” అభిప్రాయపడింది. ప్రతిదానికీ రైతులను నిందించడం అందరికీ ఫ్యాషనైందంటూ మండిపడింది. ‘‘సమస్య పరిష్కారానికి మీరేం చర్యలు తీసుకున్నరు? ఢిల్లీలో వాహన కాలుష్యాన్ని, పటాకుల గోలను కంట్రోల్ చేసే మెకానిజమేది? అసలు ఢిల్లీ పోలీసులు ఏం చేస్తున్నట్టు? ముందు వాళ్లను కంట్రోల్ల పెట్టండి” అంటూ క్లాసు తీసుకుంది. ‘‘ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్​ను కనీసం 200 స్థాయికి తగ్గించే మార్గం ఆలోచించండి” అని సూచించింది.

అవసరమైతే లాక్​ డౌన్​ పెట్టండి
చిన్న, సన్నకారు రైతులకు పంట వ్యర్థాలను తొలగించే యంత్రాలను ఫ్రీగా సప్లై చేసేలా చూడాలంటూ పర్యా    వరణవేత్త ఆదిత్య దూబే, లా స్టూడెంట్ అమన్ బంకా పెట్టుకున్న పిటిషన్ పై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన సుప్రీంకోర్టు స్పెషల్ బెంచ్ శనివారం విచారణ జరిపింది. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీని పెంచేందుకు అవసరమైతే రెండు రోజులు లాక్ డౌన్ విధించాలని కేంద్రానికి సూచించింది. ‘‘ఇంతటి పొల్యూషన్లోనే పిల్లలు స్కూళ్లకు వెళ్తున్నారు. వాళ్ల ఆరోగ్యాలు ఏమవుతాయి?  సమస్యేమిటి, దాని పరిష్కార బాధ్యత ఎవరిది అన్నదే మా ప్రశ్న. ఆ పని కేంద్రం చేస్తుందా, రాష్ట్రాలా అన్నదానితో నిమిత్తం లేదు. ఇది రాజకీయ సమస్య కాదు. అందరి సమస్య. అంతిమంగా పొల్యుషన్ లెవల్స్ అర్జెంటుగా దిగిరావాలన్నదే మా ఉద్దేశం” అని జస్టిస్ రమణ స్పష్టం చేశారు. సమస్య పరిష్కారానికి కేంద్రం, రాష్ట్రాలు ఎవరి ప్రయత్నం వాళ్లు చేస్తున్నారని ఎస్జీ బదులిచ్చారు. ‘‘కేంద్రం కూడా ఏ రాష్ట్రంపైనా నేరం మోపడం లేదు. సమస్యకు రైతులే కారణమన్నది నా ఉద్దేశం అసలే కాదు. అయితే పంజాబ్, హర్యానాల్లో ఐదారు రోజులుగా భారీగా పంట వ్యర్థాలను తగలబెడుతున్నారు. దీన్ని నియంత్రించేందుకు అవసరమైతే అలాంటి రైతులపై పర్యావరణ పరిహారం విధించాలని ఆ రాష్ట్రాలకు సూచించాం” అని వివరించారు. ఇలాంటి చర్యలతో రైతులను బలవంతపెట్టలేమని బెంచ్​ అభిప్రాయపడింది. ‘‘దానికి బదులు వారికి ప్రోత్సాహకాలివ్వాలి. యూపీ, పంజాబ్, హర్యానాల్లో చాలామంది మూడెకరాల్లోపున్న సన్నకారు రైతులే. పంట వ్యర్థాలను తొలగించే మెషీన్లను కొనే స్తోమత వారిలో చాలామందికి ఉండదు. వాటిని కేంద్రం, రాష్ట్రాలే వాళ్లకు అందించొచ్చు. పంట వ్యర్థాలను సేకరించి పేపర్ తయారీకి, చలికాలంలో రాజస్థాన్ వంటి చోట్ల మేకల మేతగా, ఇంకా చాలారకాలుగా ఉపయోగించొచ్చు’’ అని సూచించింది.

వ్యర్థాల తరలింపుకు ఏం చేస్తున్నరు?
వ్యర్థాల సేకరణకు, పొలాల నుంచి ప్లాంట్ల దాకా తరలించేందుకు ఎలాంటి ఒప్పందా లు చేసుకున్నారని ఎస్జీని బెంచ్ ప్రశ్నించింది. పలు ఏజెన్సీలను నియమించుకుంటున్నామని, ఇప్పటికే టెండర్లు పిలిచామని ఆయన బదులిచ్చారు. కోతలు పూర్తవుతూనే వచ్చే సీజన్ కోసం పొలాన్ని సిద్ధం చేసుకోవాల్సిన ఒత్తిడి రైతులపై ఉంటుంది గనుక తక్షణం చర్యలు తీసుకోవాలని జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. ‘‘ఈ విషయంలో మీ ఆఫీసర్లు పాలసీ తేవడం బాగానే ఉంది. కానీ దాన్ని ఎంత స్పీడుగా అమలు చేయబోతున్నారు? రైతులిప్పుడు ఖరీఫ్ కోసం పొలాలను సిద్ధం చేసుకునే తొందరలో ఉన్నారు. కాబట్టి 15 రోజుల్లోగా పంట వ్యర్థాలన్నింటినీ తొలగించే ఏర్పాటు చేయగలరా?” అని ప్రశ్నించారు. ఎస్జీ సమయం కోరడంతో పూర్తి వివరాలతో రావాలంటూ విచారణను సోమవారానికి బెంచ్ వాయిదా వేసింది.

నాకు ఇంగ్లిష్​పై అంతగా పట్టు లేదు: సీజేఐ
విచారణ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ, సొలిసిటర్ జనరల్​ తుషార్​ మెహతా మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. కాలుష్యానికి కేవలం రైతులే కారణమని తాను చెప్పలేదన్న మెహతా వ్యాఖ్యలపై సీజేఐ స్పందిస్తూ.. ‘దురదృష్టవశాత్తు నాకు ఇంగ్లిష్​ అంతగా రాదు. లాంగ్వేజ్​పై అంత పట్టు లేదు. మనసులో అనుకున్నదాన్ని ఇంగ్లిష్​లో సరిగా ఎక్స్ ప్రెస్ చేయలేను. ఇంగ్లిష్ చదవడం 8వ తరగతి నుంచే​నేర్చుకున్నా’ అన్నారు. తాను కూడా 8వ క్లాస్​లోనే ఇంగ్లిష్ ​నేర్చుకోవడం మొదలు పెట్టానంటూ మెహతా కూడా బదులిచ్చారు. ‘‘డిగ్రీ దాకా నేను గుజరాతీ మీడియంలోనే చదివా. లాయర్​గా నేను మాట్లాడే మాటలు అప్పుడప్పుడు తప్పుడు అర్థానికి దారి తీస్తాయేమోనని అనిపిస్తుంది. కానీ అలా చెప్పాలని అనుకోం కదా’ అన్నారు.                             

మొస మర్రుతలే
దేశ రాజధానికి గాలాడ్తతలేదు. దీపావళి ముగిసి పది రోజులైనా ఆగని పటాకుల మోత, పక్క రాష్ట్రాల పంట వ్యర్థాల తాలూకు పొగ, బండ్ల కాలుష్యం, విపరీతమైన దుమ్ము... అన్నీ కలిసి ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నయి. గాలిని స్తంభింపజేసి సమస్య తీవ్రతను ఎన్నో రెట్లు పెంచే భయంకరమైన చలి వాతావరణం దీనికి తోడైంది. ఫలితంగా ఢిల్లీలో శనివారం పొల్యూషన్ పీక్స్ కు చేరింది. ‘అత్యంత ప్రమాదకర’ స్థాయిని కూడా దాటేసింది. కాలుష్యాన్ని కొలిచే పొల్యూషన్ ఇండెక్స్ లో ఏకంగా 500 పాయింట్లను దాటేసి కొత్త రికార్డులు సృష్టించింది. ఒకట్రెండు మీటర్ల అవతల ఏముందో కూడా కనిపించనంతటి దట్టమైన కాలుష్యపు పొర నగరాన్ని, చుట్టుపక్కల పరిసరాలనూ కమ్మేసింది. దాంతో ఊపిరాడుడే కష్టంగా మారింది. ఇండ్లలో కూడా జనం మూతులకు మాస్కులు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నరు. దీనిపై సుప్రీంకోర్టు సీరియసైంది. 

ఢిల్లీలో జనం బతకాలా వద్దా అంటూ కేంద్రంపై, కేజ్రీవాల్ సర్కారుపై మండిపడింది. జనం ప్రాణాలను కాపాడే కనీస బాధ్యత లేదా అని క్లాసు తీసుకున్నది. అర్జెంటుగా ఒకట్రెండు రోజులు లాక్ డౌనన్నా పెట్టండంటూ తలంటింది. దాంతో ఢిల్లీ సర్కారు నిమిషాల వ్యవధిలో రంగంలోకి దిగింది. కేబినెట్ అత్యవసరంగా సమావేశమై చర్చించింది. స్కూళ్లు, ప్రభుత్వాఫీసులను సోమవారం నుంచి వారం పాటు మూసేయాలని నిర్ణయించింది. ఆన్ లైన్ క్లాసులు చెప్పాలని యాజమాన్యాలను ఆదేశిం చింది. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ప్రైవేటు సంస్థలు కూడా దీన్నే ఫాలో కావాలని సూచించింది. భవన నిర్మాణంతో పాటు అన్ని రకాల కన్ స్ట్రక్షన్ తదితర యాక్టివిటీలపైనా 4 రోజుల నిషేధం విధించింది.

ఢిల్లీ పొగ పీల్సుడంటే... 20 సిగరెట్లు తాగినట్టే
ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీ గాలి పీల్చడం రోజుకు 20 సిగరెట్లు తాగడంతో సమానమని ఢిల్లీ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు ముందు హాజరైన సీనియర్ లాయర్ రాహుల్ మెహ్రా అన్నారు. ‘‘పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నం. ఢిల్లీలో డీజిల్ జనరేటర్ల వాడకాన్ని నిషేధించాం. పార్కింగ్ ఫీజులను కనీసం నాలుగింతలు చేస్తున్నాం. బస్సులు, మెట్రోల ఫ్రీక్వెన్సీ పెంచుతున్నం. హోటళ్లు బొగ్గు, వంటచెరుకు వాడటాన్ని నిషేధించాం. ఇటుక బట్టీలు, స్టోన్ క్రషన్ ప్లాంట్లను తక్షణం మూసేయాలని ఆదేశించాం” అని చెప్పారు. ఢిల్లీలో ఏర్పాటు చేశామంటున్న స్మాగ్ టవర్లు పని చేస్తున్నాయా అని బెంచ్ ప్రశ్నించింది.

నేనూ రైతునే.. 
‘‘నేనూ రైతునే. సీజేఐ జస్టిస్ రమణదీ రైతు కుటుంబమే. రైతుల సమస్యలన్నీ మాకు తెలుసు. యూపీ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లోని చిన్న, సన్నకారు రైతులకు పంట వ్యర్థాలను తొలగించే మెషీన్లు కొనే స్తోమత ఉండదు” అని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఢిల్లీ పొల్యూషన్ పై శనివారం విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఉద్దేశించి ఆయన ఈ కామెంట్లు చేశారు. ‘‘రెండు లక్షల మెషీన్లు అందుబాటులో ఉన్నాయని మీరంటున్నారు. కానీ పేద రైతులు వాటిని కొనలేరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే వాటిని అందజేయొచ్చుగా” అని సూచించారు. మెషీన్లను 80‌‌ శాతం సబ్సిడీపై అందిస్తున్నామని ఎస్జీ చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘సబ్సిడీ పోను మెషీన్ ఖరీదెంత? అంత పెట్టి రైతు కొనలేడు. నేనూ రైతునే. సీజే కూడా రైతు కుటుంబం నుంచే వచ్చారు. నాకు, ఆయనకు, బెంచ్ లో ఉన్న జస్టిస్ డి.వై.చంద్రచూడ్ కు ఈ వాస్తవాలన్నీ తెలుసు” అన్నారు.