ఢిల్లీలో మళ్లీ పెరిగిన కాలుష్యం..పడిపోయిన గాలి నాణ్యత

ఢిల్లీలో మళ్లీ పెరిగిన కాలుష్యం..పడిపోయిన గాలి నాణ్యత

న్యూఢిల్లీ: కొద్దిరోజులుగా కాస్త ఊరటనిచ్చిన ఢిల్లీ వాతావరణం మళ్లీ కాలుష్యం బారిన పడింది. శుక్రవారం నాటితో పోలిస్తే శనివారం నగరంలో గాలి నాణ్యత క్షీణించి మోస్తరు కేటగిరీకి చేరుకుంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ప్రకారం.. శుక్రవారం 60గా ఉన్న గాలి నాణ్యత సూచీ(ఏక్యూఐ), శనివారం నాటికి 117కు పెరిగింది. 

శుక్రవారం నమోదైన 60 ఏక్యూఐ గత నాలుగేళ్లలో అక్టోబర్ నెలలో అత్యంత స్వచ్ఛమైన గాలిగా రికార్డైంది. అంతకు ముందు చివరిగా 2022 అక్టోబర్ 10న దీనికంటే తక్కువగా 44 ఏక్యూఐ నమోదైంది. నగరంలోని మొత్తం 58 ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లలో 24 కేంద్రాల్లో తృప్తికరమైన గాలి నాణ్యత నమోదైంది. 

32 కేంద్రాల్లో మోస్తరుగా ఉంది. 2 కేంద్రాల్లో పేలవమైన స్థాయికి పడిపోయింది. అత్యధికంగా జహంగీర్‌‌పురిలో 243, పంజాబీ బాగ్‌‌లో 212 ఏక్యూఐ నమోదై అత్యంత వాయు కాలుష్యాన్ని నమోదు చేశాయి. డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ సమాచారం ప్రకారం.. ఢిల్లీలో కాలుష్యానికి రవాణా రంగం 16.3%, వ్యవసాయ వ్యర్థాల దహనం 19.1%, గృహ సంబంధిత వనరులు 4.1% కారణం కాగా పరిశ్రమలు, నిర్మాణాలు, ఇతర రంగాలు సైతం కాలుష్యంలో భాగమయ్యాయి. 

ఇక ఎన్‌‌సీఆర్ పరిధిలోని గురుగ్రామ్ (6.5%), ఝజ్జర్ (5%), ఫరీదాబాద్ (4.3%) కాలుష్య కారకాలు కూడా ఢిల్లీని ప్రభావితం చేస్తున్నాయి. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ప్రకారం.. ఆదివారం కూడా గాలి నాణ్యత మోస్తరు కేటగిరీలోనే ఉండే అవకాశం ఉంది. అయితే రాబోయే 6  రోజుల్లో ఇది క్రమంగా పేలవమైన నుంచి చాలా పేలవమైన స్థాయికి దిగజారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.