దీపావళి పటాకులతో ఢిల్లీలో భారీగా పెరిగిన కాలుష్యం

దీపావళి పటాకులతో ఢిల్లీలో భారీగా పెరిగిన కాలుష్యం

ఢిల్లీలో వాయు కాలుష్యం మళ్లీ పెరిగింది. బాణాసంచా కాల్చడంపై ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ కొంతమంది దానిని ఉల్లంఘించారు. వాయువ్య ఢిల్లీతో పాటు చాలచోట్ల ప్రజలు పటాకులు కాల్చారు. దీంతో ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. గాలినాణ్యత దారుణంగా పడిపోయింది.

ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 323గా నమోదైంది. నోయిడా, ఫరిదాబాద్, గురుగ్రామ్ లలోనూ గాలి నాణ్యత పేలవమైన స్థాయికి చేరుకుంది. అయితే గత నాలుగేళ్లతో పోలిస్తే ఇదే కనిష్టం కావడం గమనార్హం. గతేడాది ఏక్యూఐ 382 గా నమోదవగా, 2020లో 414, 2019లో 337గా నమోదైంది. 

గాలి నాణ్యత

గాలి నాణ్యత సున్నా నుండి 50 మధ్య ఉంటే బాగా ఉన్నట్టు అర్ధం. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైనదని.. 101 నుంచి 200 వరకు ఉంటే మితమైన నాణ్యత, 201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత, 301నుంచి 400 చాలా పేలవమైనది,  401 నుంచి 500 ఉంటే ప్రమాదకరస్థాయి అని సూచన. వాయు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేజ్రీ సర్కార్ బాణాసంచాపై నిషేధం విధించింది.