Delhi Airport: ఒక రన్‌వేపై 2 విమానాలు.. మహిళా పైలట్ అప్రమత్తతో త‌ప్పిన పెను ప్ర‌మాదం

Delhi Airport: ఒక రన్‌వేపై 2 విమానాలు.. మహిళా పైలట్ అప్రమత్తతో త‌ప్పిన పెను ప్ర‌మాదం

ఢిల్లీ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఒకేసారి ఒక రన్‌వేపై రెండు విమానాల‌కు టేకాఫ్‌, ల్యాండింగ్‌కు ఏటీసీ సిబ్బంది అనుమ‌తి ఇచ్చారు. అయితే చివ‌రి క్ష‌ణాల్లో మహిళా పైలట్ అప్రమత్తతో టేకాఫ్‌ను ర‌ద్దు చేశారు. దీంతో పెద్ద ప్ర‌మాద‌మే తప్పింది. ఈ రెండు విమానాలు 1800 మీటర్ల సమీప దూరానికి వచ్చాయి.

బుధవారం మధ్యాహ్నం అహ్మదాబాద్ నుండి ఢిల్లీ చేరుకున్న విస్తారా విమానం(వీటీఐ926) ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యింది. ఈ విమానం పార్కింగ్ బేకు చేరుకోవడానికి యాక్టివ్ రన్‌వేని దాటాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆదేశించింది. ఇంతలోనే అదే రన్‌వేపై విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బాగ్‌డోగ్రాకు వెళ్లాల్సిన వీటీఐ725 విమానానికి ఏటీసీ అధికారులు టేకాఫ్ తీసుకోవడానికి అనుమతిచ్చారు. 

వీటీఐ725 విమానం రన్‌వేని దాటుతుండటాన్ని గుర్తించిన అహ్మదాబాద్- ఢిల్లీ ఫ్లైట్‌లోని మహిళా ఫైలెట్ వెంటనే ఏటీసీ అధికారులను హెచ్చరించింది. దీంతో తప్పును గమనించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్.. టేకాఫ్‌ను నిలిపివేసింది. అబార్ట్ సంకేతాలు ఇవ్వ‌డంతో బాగ్‌డోగ్రాకు వెళ్లాల్సిన విమానం.. రన్‌వే నుంచి పార్కింగ్ బేకు వెళ్లిపోయింది. ఈ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టి వ‌ర‌కు విస్తారా ఎయిర్‌లైన్స్ సంస్థ ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఈ ఘటన జరిగిన సమయంలో వీటీఐ725 విమానంలో మొత్తం 300 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.