న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పొల్యూషన్‌ను తగ్గించడానికి అధికారులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కాలుష్యం వెదజల్లే వాటిని పూర్తిగా బ్యాన్ చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా బొగ్గు పొయ్యిలపై తందూరీ తయారీని నిషేధించారు. ఎవరైనా రూల్స్‌ను బ్రేక్ చేస్తే భారీగా జరిమానా విధించనున్నారు.
ఈ మేరకు ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ (డీపీసీసీ) గురువారం ప్రకటన రిలీజ్ చేసింది. హోటల్స్, రెస్టారెంట్లు, దాబాలు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లలో బొగ్గుతోపాటు కట్టెల పొయ్యిలను కూడా వాడొద్దని తెలిపింది. సాధారణంగా ఢిల్లీలో బొగ్గు పొయ్యిలపై కాల్చి తయారు చేసే తందూరీకి గిరాకీ ఎక్కువ. ఢిల్లీలోని లజపత్ నగర్, కరోల్ బాగ్, సుభాష్ నగర్ వంటి ప్రాంతాలు తందూరీ, టిక్కాలకు ఫేమస్. సాయంత్రం వేళ టూరిస్టులతో ఈ ప్రాంతం బిజీగా మారుతుంది.
అయితే, ఇప్పటికే పెద్ద పెద్ద రెస్టారెంట్లు బొగ్గు, కట్టెల పొయ్యి స్థానంలో కాంపాక్ట్ గ్యాస్, ఎలక్ట్రిక్ యూనిట్లను వాడుతున్నాయి. కానీ చిన్న చిన్న హోటల్స్, రోడ్డు సైడ్ సెంటర్లు ఇంకా పాత పద్ధతినే కొనసాగిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

