
- ముహూర్తం ఖరారు చేసిన కేసీఆర్
- 27న పార్టీ జనరల్‌బాడీ మీటింగ్‌లో అధికారిక ప్రకటన
హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలోని వసంత్ విహార్‌లో నిర్మించిన బీఆర్ఎస్కేంద్ర కార్యాలయాన్ని మే నాలుగో తేదీన ప్రారంభించనున్నారు. భవనం పనులు పూర్తి కావడంతో ప్రారంభోత్సవానికి ఈ మేరకు కేసీఆర్ ముహూర్తం నిర్ణయించారు. ఈనెల 27న తెలంగాణ భవన్‌లో నిర్వహించనున్న పార్టీ జనరల్‌బాడీ మీటింగ్‌లో దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారు. పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం సందర్భంగా రాజశ్యామలయాగం, ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహించే అవకాశముందని సమాచారం.
మంత్రి ప్రశాంత్ రెడ్డి కొన్ని రోజుల క్రితమే ఢిల్లీకి వెళ్లి.. పార్టీ ఆఫీస్‌కు తుది మెరుగులపై పలు సూచనలు చేసి వచ్చారు. టీఆర్ఎస్ పార్టీ పేరు బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత సర్దార్పటేల్రోడ్డులోని అద్దె భవనంలో ఏర్పాటు చేసిన ఆఫీస్‌ను నిరుడు డిసెంబర్14న కేసీఆర్ప్రారంభించారు. పార్టీ జాతీయ వ్యవహారాలు పర్యవేక్షించేందుకు తాత్కాలికంగా ఈ ఆఫీస్ ఏర్పాటు చేశారు.