పటాకులు అమ్మినా, కాల్చినా భారీ జరిమానా

పటాకులు అమ్మినా, కాల్చినా భారీ జరిమానా

న్యూఢిల్లీ: దీపావళి పండుగ క్రమంలో కరోనా రోగుల ఆరోగ్యాన్ని, పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని పలు రాష్ర్టాలు పటాకుల విక్రయం, వినియోగంపై నిషేధం విధిస్తున్నాయి. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న వేళ ప్రజలు దీపావళి పండుగను దీపాలతోనే జరుపుకోవాలని, పటాకులు కాల్చవద్దని ఇప్పటికే పలు రాష్ట్రాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రభుత్వం కఠిన హెచ్చరికలు జారీ చేసింది. పటాకులపై నిషేధం విధించిన ఢిల్లీ ప్రభుత్వం.. జరిమానాల గురించి కూడా వెల్లడించింది.

దీపావళి పండుగకు ఎవరైనా పటాకులు అమ్మినా.. కాల్చినా రూ.లక్ష వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ శుక్రవారం ఈ విషయం తెలిపారు. పటాకులు అమ్ముతున్న లేదా కాల్చినట్టుగా కనిపించిన వ్యక్తులపై గాలి (కాలుష్య నివారణ, నియంత్రణ) చట్టం 1981 కింద కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఈ చట్టం కింద గరిష్ఠంగా రూ.లక్ష వరకు జరిమానా విధించవచ్చని తెలిపారు మంత్రి గోపాల్‌ రాయ్‌. పటాకుల నిషేధంపై కార్యాచరణ సిద్ధం చేసేందుకు ఢిల్లీ కాలుష్య నియంత్రణ సంస్థ, పర్యావరణ శాఖ, ఢిల్లీ పోలీసులతో కలిసి సోమవారం సమావేశం నిర్వహిస్తామని ఆయన చెప్పారు.