ఢిల్లీ క్యాపిటల్స్‌ క్రీడా స్ఫూర్తిని మరచింది

ఢిల్లీ క్యాపిటల్స్‌ క్రీడా స్ఫూర్తిని మరచింది

ఐపీఎల్‌-2022లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ శుక్రవారం తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ ఆఖరి ఓవర్‌లో రాజుకున్న నో- బాల్‌ వివాదం క్రీడావర్గాల్లో చర్చనీయాంశంకాగా..ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌పై టీమిండియా మాజీ ఆటగాళ్లు, ఇతర మాజీ క్రికెటర్లు విమర్శలు కురిపిస్తున్నారు. జెంటిల్‌మెన్‌ గేమ్‌లో క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించడం ఏమిటని మండిపడుతున్నారు. ఏదేమైనా ఢిల్లీ సారథి పంత్‌, అసిస్టెంట్‌ కోచ్‌ ఆమ్రే ప్రవర్తించిన తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని విమర్శిస్తున్నారు. 

అంపైర్‌ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసిన రిషభ్‌ పంత్‌, క్రీజులో ఉన్న తమ ఆటగాళ్లను వెనక్కి పిలవడం.. ఆమ్రే మైదానంలోకి దూసుకెళ్లడం వివాదాస్పదంగా మారింది. ఈ క్ర‌మంలో ఈ ఘటనపై స్పందించిన టీమిండియా మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ ట్విటర్‌ వేదికగా అసహనం వ్యక్తం చేశాడు. ‘‘ఢిల్లీ క్యాపిటల్స్‌ క్రీడాస్ఫూర్తిని మరచి చెత్తగా వ్యవహరించింది. జెంటిల్‌మెన్‌ గేమ్‌ అయిన క్రికెట్‌లో ఇలాంటివి అస్సలు ఆమోదయోగ్యం కాదు’’ అని పంత్‌ తీరును తెలుపుతూ ట్వీట్ చేశాడు. ఇక భారత జట్టు మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్‌ సైతం ఇదే తరహాలో స్పందించాడు.