Delhi Capitals : పాంటింగ్ పదవికి ఎసరు.. ఢిల్లీ భవిష్యత్తు ఏంటి?

Delhi Capitals : పాంటింగ్ పదవికి ఎసరు.. ఢిల్లీ భవిష్యత్తు ఏంటి?

ఢిల్లీ క్యాపిటల్స్.. ఐపీఎల్ లో నిలకడ లేని జట్టు. ఒక సీజన్ లో ఉత్తమ ప్రదర్శన చేస్తే.. మరో సీజన్ లో అట్టడుగు స్థానానికి పడిపోతుంది. ఇప్పటివరకు ఆడిన 16 సీజన్స్ లో కేవలం రెండు సార్లు మాత్రమే ఫైనల్స్ కు చేరగలిగింది. 2021లో ఫైనల్ చేరినా కప్పు కొట్టలేకపోయింది. తర్వాత సీజన్ లో పాయింట్స్ టేబుల్ లో చివరి స్థానంలో నిలిచింది. 

ఈ సీజన్ లో కూడా ఆడిన ఐదు మ్యాచుల్లో ఓడిపోయి.. చివరి స్థానంలో సెటిల్ అయింది. ప్రతీ సీజన్ లో టాప్ ప్లేయర్లు ఉన్నా.. మేటి కోచ్ లు పనిచేస్తున్నా ఢిల్లీ రాత మాత్రం మారడం లేదు. అయితే, ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఢిల్లీ మేనేజ్మెంట్.. ప్రస్తుత కోచ్ రికీ పాంటింగ్ ను పదవి నుంచి తొలగించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.  

కెప్టెన్ గా వార్నర్ కూడా తనదైన ముద్ర వేయలేకపోతున్నాడు. ఓడిపోతున్న టీంను గట్టుకు చేర్చలేకపోతున్నాడు. ఇక ఢిల్లీ కోచింగ్‌ స్టాఫ్‌ విషయానికొస్తే.. రికీ పాంటింగ్‌ హెడ్‌కోచ్‌గా ఉండగా,సౌరవ్‌ గంగూలీ డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌గా సేవలు అందిస్తున్నాడు. మరోవైపు షేన్‌ వాట్సన్‌, జేమ్స్‌ హోప్స్‌, అజిత్‌ అగార్కర్‌, ప్రవీణ్‌ ఆమ్రే, బిజూ జార్జ్‌ ఢిల్లీ జట్టుకు అసిస్టెంట్‌ కోచ్‌లుగా వ్యవహరిస్తున్నారు. 

ఇంతటి హేమా హేమీలున్నాగానీ జట్టు ఓటమిని తప్పించలేకపోతున్నారు. దీంతో ఈ జంబో స్టాఫ్ లో కొంతమంది కూడా తొలగించే పనిలో పడింది ఢిల్లీ మేనేజ్మెంట్.