DC vs GT: మిల్లర్, రషీద్ మెరుపులు వృధా.. చివరి బంతికి గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్

DC vs GT: మిల్లర్, రషీద్ మెరుపులు వృధా.. చివరి బంతికి గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్

ఐపీఎల్ లో మరో థ్రిల్లింగ్ మ్యాచ్ అభిమానులను అలరించింది. ఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ చివరి బంతికి విజయం సాధించింది. అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో 4 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 224 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లను 220 పరుగులు చేసింది. 

225 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ గిల్ 6 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ దశలో సాహా(39), సాయి సుదర్శన్(39 బంతుల్లో 65, 7 ఫోర్లు, 2 సిక్సులు) ఇన్నింగ్స్ చక్కబెట్టే బాధ్యతను తీసుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్ ను ఆసక్తికరంగా మార్చేశారు. 25 బంతుల్లో 39 పరుగులు చేసిన సాహా.. ఓమర్జాయ్(1).. షారుఖ్ ఖాన్(8).. సాయి సుదర్శన్ స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో మ్యాచ్ ఢిల్లీ వైపు మళ్లింది. అయితే మిల్లర్(23 బంతుల్లో 55, 6 ఫోర్లు, 3 సిక్సులు) భారీ హిట్టింగ్ తో విరుచుకుపడి  ఢిల్లీని వణికించాడు. 

also read : మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్

మిల్లర్ ఔటైనా చివర్లో రషీద్ ఖాన్ 11 బంతుల్లోనే 21 పరుగులు చేసి మ్యాచ్ ను చివరి బంతి వరకు తీసుకెళ్లాడు. చివరి బంతికి 5 పరుగులు చేయాల్సిన దశలో రషీద్ బౌండరీ కొట్టడంలో విఫలమయ్యాడు. దీంతో ఢిల్లీ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్(43 బంతుల్లో 88,5 ఫోర్లు, 8 సిక్సులు) అక్షర్ పటేల్(43 బంతుల్లో 66,5 ఫోర్లు, 4 సిక్సులు) భారీ భాగస్వామ్యంతో నిర్ణీత 20 ఓవర్లలో 224 పరుగుల భారీ స్కోర్ చేసింది.