ఢిల్లీని పూర్తిగా కమ్మేసిన పటాకుల పొగ 

ఢిల్లీని పూర్తిగా కమ్మేసిన పటాకుల పొగ 
  • ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి
  • దేశ రాజధానిని పూర్తిగా కమ్మేసిన పొగ 
  • పటాకులు.. పొలాల్లో గడ్డి కాల్చుడుతో భారీగా కాలుష్యం    
  • పొల్యూషన్, పొగమంచుతో మసకబారిన సూర్యుడు    
  • ‘సివియర్’ జోన్ కు పడిపోయిన ఎయిర్ క్వాలిటీ  ఇండెక్స్   
  • 200 మీటర్ల దూరంలోనూ ఏమీ కనిపించక యాక్సిడెంట్లు    
  • తలనొప్పి, గొంతులో దురద, కండ్లలో నీళ్లతో జనం పరేషాన్​

న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీని పొగ మేఘాలు పూర్తిగా కమ్మేశాయి. రోడ్లపై రెండు వందల మీటర్ల దూరంలోనూ ఏమీ కన్పించనంతగా పొగమంచు అలముకున్నది. పట్టపగలు.. మిట్ట మధ్యాహ్నం కూడా సూర్యుడు మసకగా కన్పించాడు. ఒకవైపు  దీపావళికి జనం టపాసుల మోత మోగించడం.. మరోవైపు పొరుగు రాష్ట్రాల్లోని రైతులు తమ పొలాల్లో మిగిలిపోయిన గడ్డిని భారీగా తగలబెట్టడంతో దట్టమైన పొగలు కమ్మేసి ఢిల్లీ జనాలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. గురువారం సాయంత్రం నుంచే ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ), విజిబిలిటీ దారుణంగా పడిపోయాయి. శుక్రవారం సాయంత్రం కల్లా సిటీలో ఏక్యూఐ ‘సివియర్’ జోన్ కు దిగజారింది. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో జనం తలనొప్పి, గొంతులో దురద, కండ్లల్లో మంట, నీళ్లు కారడం వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం జనం ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే బెదురుకునే పరిస్థితి నెలకొంది. దీంతో ఢిల్లీలో మరోసారి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించే పరిస్థితులు కన్పిస్తున్నాయి.

గడ్డి కాల్చుడుతో 36% పొల్యూషన్
ఢిల్లీకి పొరుగునే ఉన్న హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోని రైతులు తమ పొలాల్లో మిగిలిపోయిన గడ్డిని కాల్చడం, గాలులు ఢిల్లీ దిశగా రావడం  వల్ల కూడా ఢిల్లీని పొగలు చుట్టుముట్టాయి. ఢిల్లీలోని గాలి పొల్యూషన్ కు గడ్డి కాల్చుడే 36 శాతం కారణమని ఎయిర్ క్వాలిటీని అంచనా వేసే ‘సఫర్’ సంస్థ వెల్లడించింది. దీంతోపాటు దీపావళికి టపాసులు కాల్చడం పొల్యూషన్ ఒక్కసారిగా పెరిగేందుకు కారణమైందని చెప్తున్నారు. టెంపరేచర్లు తక్కువగా ఉండటం, పొగమంచు పెరగడంతో పొల్యూషన్ గాలిలో అలాగే ఉండిపోయిందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(సీపీసీబీ) వెల్లడించింది.

ఐదేండ్లలోనే దారుణంగా ఎయిర్ క్వాలిటీ 
సాధారణంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 0-–50 మధ్యలో ఉంటే అక్కడ ఎయిర్ క్వాలిటీ మంచిగుందని చెప్తారు. 51–100 మధ్యలో ఉంటే సంతృప్తికరంగా ఉందని, 101‌‌–200 మధ్యలో ఉంటే మధ్యస్తం అని, 201–300 మధ్యలో ఉంటే పూర్ అని, 301–400 మధ్యలో ఉంటే వెరీ పూర్ అని, 401–500 మధ్యలో ఉంటే సివియర్ గా అంచనా వేస్తారు. అయితే ఢిల్లీతో పాటు దాని పొరుగునే ఉన్న సిటీల్లో శుక్రవారం ఏక్యూఐ ఏకంగా 400 పైనే నమోదైంది. ఢిల్లీలో శుక్రవారం ఏక్యూఐ 463గా నమోదైంది. ఢిల్లీలో గత ఐదేండ్లలో నమోదైన వాటిలో ఇదే అత్యధిక ఎయిర్ పొల్యూషన్ అని సీపీసీబీ వెల్లడించింది. 

ఏడు రెట్లు ఎక్కువగా కాలుష్యం
ఢిల్లీలో పీఎం(పర్టిక్యులేట్ మ్యాటర్) 2.5 కాలుష్య కణాలు ఒక్క రోజులోనే క్యూబిక్ మీటర్ గాలిలో 430 మైక్రోగ్రాములకు పెరిగాయి. మామూలుగా ఒక క్యూబిక్ మీటర్ గాలిలో 60 మైక్రోగ్రాముల కంటే తక్కువగా పీఎం 2.5 కణాలు ఉంటే ఊపిరితిత్తులకు ప్రమాదం ఉండదు. కానీ సేఫ్టీ లెవల్ కంటే ఏకంగా 7 రెట్లు ఎక్కువగా పీఎం 2.5 కణాలు ఉన్నట్లు సీపీసీబీ పేర్కొంది. పీఎం 10 స్థాయి కణాలు 558 మైక్రో గ్రాములకు చేరినట్లు తెలిపింది. అయితే గాలిలో 48 గంటల పాటు పీఎం 2.5 కణాలు 300 మైక్రోగ్రాముల కంటే ఎక్కువగా, పీఎం 10 స్థాయి కణాలు 500 మైక్రోగ్రాముల కంటే ఎక్కువగా ఉంటే.. దీనిని ఎమర్జెన్సీ 
కేటగిరీగా పరిగణించాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. 

నిషేధాన్ని పట్టించుకోని జనం 
ఢిల్లీలో జనవరి 1 దాకా పటాకులపై బ్యాన్ విధించారు. అయినా దీపావళికి జనం పటాకుల మోత మోగించిన్రు. అనేక ప్రాంతాల్లో జనం పెద్ద ఎత్తున టపాసులు కాలుస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఢిల్లీ ప్రజలు ప్రభుత్వం విధించిన బ్యాన్ ను ఒక జోక్ గా మార్చేశారంటూ పర్యావరణవేత్తలు విమర్శించారు. గురువారం సాయంత్రం నుంచి రాత్రి 11 వరకు ఢిల్లీలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలు టపాసులు కాల్చి ఎంజాయ్ చేశారు.  గ్రేటర్ నోయిడా వద్ద హైవేపై రోడ్డు కన్పించకపోవడంతో ఆరు కార్లు ఒకదానికొకటి ఢీకొట్టాయి. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. 

ఆప్, బీజేపీ మాటలయుద్ధం  
ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్​పై ఆప్, బీజేపీ ఒకదానిపై ఒకటి మండిపడ్డాయి. దీపావళికి ఢిల్లీలో చాలా మంది జనం పటాకులు కాల్చలేదని, బీజేపీ రెచ్చగొట్టడం వల్లే మిగతా వాళ్లు పటాకులు కాల్చారంటూ ఢిల్లీ ఎన్విరాన్‌‌మెంట్ మినిస్టర్ గోపాల్ రాయ్ అన్నారు. పొల్యూషన్ ను కంట్రోల్ చేయడంలో కేజ్రీవాల్ సర్కార్ ఫెయిలైందని బీజేపీ నేత అమిత్ మాలవీయ స్పష్టంచేశారు.