
- మూడు రోజులు అప్పగించిన స్పెషల్ కోర్టు
- అధికారికంగా అరెస్ట్ చేసినట్టు సీబీఐ ప్రకటన
- నేను అమాయకుడిని.. నేనేం చేయలేదు: కేజ్రీవాల్
- ఢిల్లీ ముఖ్యమంత్రే ఈ కేసులో కీలక సూత్రధారి: సీబీఐ
- కేజ్రీవాల్ ఇంట్లోనే లిక్కర్ పాలసీ తయారైందని వాదన
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌ను రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టు మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగించింది. దీంతో దర్యాప్తు సంస్థ అధికారులు కేజ్రీవాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో సీఎంకు వ్యతిరేకంగా తమ వద్ద సాక్ష్యాలు ఉన్నాయని స్పెషల్ కోర్టుకు సీబీఐ వివరించింది. కేజ్రీవాల్‌ను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని పిటిషన్ దాఖలు చేసింది. వాదనలు విన్న సీబీఐ కోర్టు స్పెషల్ జడ్జి అమితాబ్ రావత్.. మూడు రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కేసులో అర్విందే కీలకం: సీబీఐ
తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను పోలీసులు బుధవారం ఉదయం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. తాము ఇంకా కేజ్రీవాల్‌ను అధికారికంగా అరెస్ట్ చేయలేదని సీబీఐ తరఫు అడ్వకేట్ కోర్టుకు తెలిపారు. ‘‘లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్ కీలకంగా వ్యవహరించారు. ఆయన ఇంట్లోనే లిక్కర్ పాలసీ తయారైంది. సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్ మధ్య మీటింగ్ ఏర్పాటు చేసింది కేజ్రీవాలే. గోవాకు నగదును హవాలా మార్గంలో ఆయనే తరలించారు” అని కోర్టుకు చెప్పారు. రూ.338 కోట్లు చేతులు మారినట్లు ఆధారాలున్నాయని, కస్టడీకి అప్పగిస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు. సీబీఐ రిక్వెస్ట్‌పై కేజ్రీవాల్ తరఫు అడ్వకేట్ విక్రమ్ చౌదరి అభ్యంతరం తెలిపారు.
నేను అమాయకుడిని: అర్వింద్ కేజ్రీవాల్
తాను అమాయకుడినని కేజ్రీవాల్ కోర్టుకు తెలిపారు. ‘‘మనీశ్ సిసోడియాపై నేను నిందలు వేసినట్టు మీడియాలో చూపిస్తున్నారు. నేను, సిసోడియా నిర్దోషులం.. ఇదంతా చేసింది వేరేవాళ్లని కూడా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. సిసోడియా ఇన్నోసెంట్ అని చెప్పాను. ఆప్ పార్టీ కూడా ఇన్నోసెంట్. మీడియా ముందు మా పరువు తీయడమే సీబీఐ ప్లాన్. మీడియాలో వచ్చిన ప్రకటనలు అన్నీ ఫేక్. వాటి వెనుక సీబీఐ ఉందన్న విషయం మీడియాలో రావాలి’’ అని కోర్టును కోరారు. ఈ కేసును సీబీఐ కావాలనే సెన్సేషనల్ చేస్తున్నదన్నారు.
అన్ని న్యూస్ పేపర్లలో టాప్ హెడ్లైన్ చేస్తున్నదని తెలిపారు. దీన్ని నియంత్రించాలని కోర్టును కోరగా.. మీడియాను కంట్రోల్ చేయలేమని జడ్జి తేల్చి చెప్పారు. ఇరుపక్షాల వాదనల తర్వాత కేజ్రీవాల్‌ను మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు స్టే విధించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కేజ్రీవాల్ వెనక్కి తీసుకున్నారు.