ఢిల్లీ లిక్కర్ స్కాం..కేజ్రీవాలే కింగ్ పిన్

ఢిల్లీ లిక్కర్ స్కాం..కేజ్రీవాలే కింగ్ పిన్
  • ఢిల్లీ లిక్కర్ స్కాం..కేజ్రీవాలే కింగ్ పిన్
  • ఢిల్లీ కోర్టుకు ఈడీ వెల్లడి 
  • స్కామ్​లో కేజ్రీవాల్ నేరుగా ఇన్వాల్వ్ అయ్యారు
  • కవితతో భేటీ అయ్యారు
  • ఆమె నుంచే ఆప్​కు రూ. 100 కోట్లు ముట్టాయి 
  • ఇది 100 కోట్లు కాదు.. 600 కోట్ల స్కామ్​ అని ప్రకటన  
  • 7 రోజుల ఈడీ కస్టడీకి ఢిల్లీ సీఎం.. అప్పగించిన కోర్టు

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్​ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాలే ప్రధాన కుట్రదారు అని కోర్టుకు ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వెల్లడించింది. ‘‘లిక్కర్ పాలసీ అమలులో కేజ్రీవాల్ నేరుగా ఇన్వాల్వ్ అయ్యారు. సౌత్ గ్రూప్ కు అనుకూలంగా వ్యవహరించారు. ఇందుకు ప్రతిఫలంగా ఆయన ముడుపులు డిమాండ్ చేశారు. కాల్ రికార్డుల ఆధారంగా వీటన్నింటినీ మేం ధ్రువీకరించుకున్నాం” అని స్పష్టం చేసింది. ఈ కేసులో సహ నిందితురాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నామని తెలిపింది. కవితతో కేజ్రీవాల్ భేటీ అయ్యారని, లిక్కర్ పాలసీ రూపకల్పనపై కలిసి పని చేద్దామని చెప్పారని ఈడీ తెలిపింది. కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు కేజ్రీవాల్ ను 10 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరింది. దీంతో కోర్టు 7 రోజుల పాటు (మార్చి 28 వరకు) కస్టడీకి అప్పగిస్తూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్​ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఈడీ గురువారం సాయంత్రం కేజ్రీవాల్​ను అరెస్ట్ చేసింది. రాత్రి ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో ఉంచింది. శుక్రవారం ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో స్పెషల్ జడ్జి కావేరీ బవేజా ముందు ప్రవేశపెట్టింది.

రిమాండ్ పై విచారణ సందర్భంగా ఈడీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఏఎస్ వీ రాజు వాదనలు వినిపించారు. లిక్కర్ స్కాంలో కేజ్రీవాలే కింగ్ పిన్ అని, ఆయన ఇందులో ప్రధాన కుట్రదారు అని తెలిపారు. ఈ కేసులో సౌత్ గ్రూప్, ఇతర నిందితులకు మధ్య కేజ్రీవాలే మధ్యవర్తిగా వ్యవహరించారన్నారు. కేజ్రీవాల్ తోపాటు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఆప్ నేత విజయ్ నాయర్ కూడా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పారు. లిక్కర్ స్కాంలో  రూ. 600 కోట్లకుపైగా ముడుపులు చేతులు మారాయని ఆరోపించారు. ఇందులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతోసహా సౌత్ గ్రూప్ నుంచి రూ. 100 కోట్ల చెల్లింపులు జరిగాయన్నారు. కాగా, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకోవాలన్న కుట్రతోనే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారని ఆప్ ఆరోపించింది. కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. కేజ్రీవాల్ అరెస్ట్ కు వ్యతిరేకంగా శుక్రవారం ఢిల్లీలో ఆందోళనలు చేసిన మంత్రులు ఆతిషి, సౌరభ్ భరద్వాజ్, పార్టీ నేత కుల్దీప్ కుమార్, తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్ ను కోర్టులో ప్రవేశపెట్టిన సందర్భంగా కోర్టు పరిసరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 

గోవా, పంజాబ్ ఎన్నికలకు రూ. 45 కోట్లు.. 

లిక్కర్ స్కాంలో భాగంగా 4 మార్గాల్లో హవాలా ద్వారా రూ. 45 కోట్ల ముడుపులను ఆప్ అందుకున్నదని, ఆ మొత్తాన్ని 2022లో జరిగిన గోవా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు పెట్టిందని ఈడీ తెలిపింది. ‘‘మేం ఈ డబ్బు తరలిన విధానాన్ని గుర్తించాం. గోవాకు నాలుగు మార్గాల్లో డబ్బు చేరింది. ఆప్ అభ్యర్థుల్లో ఒకరి స్టేట్ మెంట్ ద్వారా కూడా డబ్బు అందిన విషయం కన్ఫమ్ అయింది. ఆమ్ ఆద్మీ పార్టీకి కేజ్రీవాలే అధిపతి అని, ఆ పార్టీలో జరిగే అన్ని వ్యవహారాలకూ ఆయనే బాధ్యుడు” అని ఏఎస్ వీ రాజు స్పష్టం చేశారు. ఈ కేసులో ఈడీ 9 సార్లు సమన్లు ఇచ్చినా, కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగానే విచారణకు హాజరుకాలేదన్నారు. ఇక ఆప్ నేత విజయ్ నాయర్ ఢిల్లీ రవాణా మంత్రి కైలాస్ గెహ్లాట్ కు కేటాయించిన ఇంట్లో ఉంటూ.. ఆప్ నేతలకు, సౌత్ గ్రూప్ వ్యక్తులకు మధ్యవర్తిగా వ్యవహరించాడన్నారు.  

కేజ్రీవాల్ పై డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు.. 

కేజ్రీవాల్ తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయాల్సిన అవసరమే లేదన్నారు. ‘‘అరెస్టు చేసే అధికారం ఉన్నంతమాత్రాన ప్రతి ఒక్కరినీ అరెస్టు చేయాల్సిన అవసరం ఉండదు. డబ్బు లావాదేవీలను గుర్తించామని చెప్పడం అరెస్టు చేసేందుకు తగిన కారణం కాబోదు. ఇందులో కొత్త ప్యాటర్న్ కనిపిస్తోంది. మీరు ఒక సాక్షి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. కానీ మొదటి, రెండో వాంగ్మూలాల్లో ఎక్కడా కేజ్రీవాల్ పేరును ఆ సాక్షి చెప్పలేదు. ఆయనను మీరు అరెస్ట్ చేశారు. బెయిల్ ఇవ్వొద్దని కోరారు. ఆ తర్వాత అతను అప్రూవర్ గా మారాడు. చివరకు అతను ఒక తెలివైన స్టేట్ మెంట్ ఇస్తాడు” అని సింఘ్వీ అన్నారు. ‘‘కేజ్రీవాల్ ఎలా ఇన్వాల్వ్ అయ్యారో మీరు చెప్పాలి. నమ్మశక్యంగా లేని కారణంతో మీరు ఆయనను అరెస్ట్ చేయలేరు. 

ముందు నిందితుడిగా ఉండి, తర్వాత అప్రూవర్ గా మారిన వ్యక్తులు తాము కేజ్రీవాల్ ను కలిశామంటూ ఇచ్చిన స్టేట్ మెంట్లు తప్ప.. మీ దగ్గర డైరెక్ట్ ఎవిడెన్స్ ఏమీ లేదు. ఒకవేళ వ్యక్తులను అరెస్ట్ చేసి, ఆ తర్వాత క్షమిస్తూ పోతే వాళ్లు తప్పకుండా ఎవరి పేరు చెప్పమన్నా చెప్తారు. దీనిని రొటీన్ రిమాండ్ గా చూడొద్దు. ఇందులో ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశాలున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలి” అని కోర్టును సింఘ్వీ కోరారు. కేజ్రీవాల్ తరఫున మరో అడ్వకేట్ విక్రమ్ చౌధురి వాదిస్తూ.. ‘‘ఈడీ జడ్జిలా అదే సమయంలో తలారిలా కూడా వ్యవహరిస్తోంది” అని ఆరోపించారు. అయితే, ఈ కేసులో ఎలక్ట్రానిక్ డివైస్ లను ధ్వంసం చేసినట్లు ఆధారాలు ఉన్నాయని ఎస్ వీ రాజు చెప్పారు. కేజ్రీవాల్ ను రిలీజ్ చేస్తే ఇలాంటివి మరిన్ని జరగొచ్చన్నారు. ఇందులో స్కాం, ఫ్రాడ్ జరిగాయనేందుకు గట్టి ఆధారాలు ఉన్నాయని, ఎన్నికల్లో ఫండింగ్ కోసమే ఎక్సైజ్ పాలసీని మార్చారన్నారు.  

సుప్రీంలో కేజ్రీవాల్ పిటిషన్ వాపస్ 

ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో గురువారం రాత్రి వేసిన పిటిషన్​ను కేజ్రీవాల్ శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టులో విచారణకు కొద్దిసేపటి ముందు ఉపసంహరించుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్​ను కోర్టు తిరస్కరించిన కొద్దిసేపటికే కేజ్రీవాల్ ఈ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. ఆల్రెడీ అరెస్టు కావడం, రిమాండ్​పై కింది కోర్టులో విచారణ జరుగుతుండడంతో పిటిషన్ అర్థరహితమవుతుందని కేజ్రీవాల్ తరఫు లాయర్లు విత్ డ్రా చేసు కున్నట్టు తెలుస్తోంది. 

సీఎంగా కంటిన్యూ అవుతారా?

 
లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా కొనసాగుతారా? అంటే ఆప్ నేతలు, పలువురు లీగల్ ఎక్స్ పర్ట్ లు అవుననే చెప్తున్నారు. కేజ్రీవాల్ ఇంకా దోషిగా తేలలేదని, కేవలం నిందితుడు మాత్రమేనని వారు స్పష్టం చేస్తున్నారు. సీఎంగా ఉన్న వ్యక్తి అరెస్ట్ అయితే, ఆ పదవిలో కొనసాగరాదని చట్టంలో ఎక్కడా లేదని సీనియర్ అడ్వకేట్ గోపాల్ శంకరనారాయణన్ చెప్పారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం, ఒక ఎమ్మెల్యే రెండేండ్ల కంటే ఎక్కువ శిక్ష పడే కేసులో దోషిగా తేలిన తర్వాతే అనర్హతకు గురవుతారన్నారు. అందువల్ల టెక్నికల్​గా జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపేందుకు అడ్డంకి ఏమీ లేదన్నారు. అయితే, చట్టపరంగా అడ్డంకి లేకపోయినా.. పరిపాలన పరంగా ఇది సాధ్యం కాదని మరో సీనియర్ అడ్వకేట్ వికాస్ సింగ్ అభిప్రాయపడ్డారు. కేజ్రీవాల్ రిలీజ్ కాకపోతే తీహార్ జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తారని ఆప్ మంత్రులు ఇదివరకే ప్రకటించారు. కానీ ప్రస్తుతం జైలు గైడ్ లైన్స్ ప్రకారం.. అక్కడ ఉండే నిందితులు వారానికి రెండు సార్లు మాత్రమే ఇతరులను కలిసేందుకు అనుమతిస్తారు. అందువల్ల అక్కడి నుంచి పాలన సాధ్యం కాదని మరికొందరు అంటున్నారు. అయితే, కేజ్రీవాల్​ను జైలులో కాకుండా ఆయన ఇంట్లోనే హౌస్ అరెస్టులో ఉంచితే సీఎంగా పాలన కొనసాగించడం సాధ్యమవుతుందని తీహార్ జైలు మాజీ ఆఫీసర్ ఒకరు చెప్పారు.

రూ. 600 కోట్ల కుంభకోణం.. 

లిక్కర్ బిజినెస్ లో వోల్ సేల్ వ్యాపారులకు 12%, రిటైల్ వ్యాపారులకు 185% ప్రాఫిట్ మార్జిన్ వచ్చేలా ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించారని ఈడీ తరఫున ఏఎస్ వీ రాజు వాదించారు. ఇలా వచ్చిన లాభాల్లో నుంచి 6% (రూ. 600 కోట్లు) ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపుల రూపంలో ఇవ్వాలని ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఇందులో దాదాపు మూడో వంతు డబ్బును బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఇతర సౌత్ గ్రూప్ వ్యక్తుల నుంచి చెల్లింపులు జరిగాయని, ఈ డబ్బును ఆప్ ఎన్నికల్లో ప్రచారానికి వాడుకున్నదన్నారు. అయితే, ఈ కేసులో 80% మంది వ్యక్తులు వారి స్టేట్ మెంట్లలో కేజ్రీవాల్ పేరు చెప్పనేలేదని సింఘ్వీ అన్నారు. దీనిపై రాజు స్పందిస్తూ.. లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో కేజ్రీవాల్ నేరుగా ఇన్వాల్వ్ అయ్యారన్నారు. లంచాలు తీసుకునేందుకు వీలు అయ్యేలానే ఈ పాలసీని రూపొందించారన్నారు. ‘‘కేజ్రీవాల్ ముడుపులను డిమాండ్ చేశారు. అందుకు ప్రతిఫలంగా ఢిల్లీలోని లిక్కర్ బిజినెస్ సౌత్ గ్రూప్ నియంత్రణలోకి వెళ్లేలా చూశారు. మొత్తం కుంభకోణం విలువ రూ. 600 కోట్లకుపైనే ఉంటుంది. ఇందులో రూ. 100 కోట్లను లంచంగా అందుకున్నారు” అని వివరించారు.  

రిజైన్ చేయను.. జైలు నుంచే పాలిస్తా

జైలులో ఉన్నా, బయట ఉన్నా తన జీవితం దేశానికే అంకితమని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు ఆయనను ఈడీ అధికారులు తీసుకొచ్చిన సందర్భంగా అక్కడున్న మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘నా జీవితం దేశ సేవకే అంకితం. నేను జైలులో ఉన్నా, బయట ఉన్నా దేశ సేవలోనే గడుపుతా” అని అన్నారు. అరెస్ట్ తర్వాత కేజ్రీవాల్ స్పందించడం ఇదే తొలిసారి. అనంతరం కోర్టు కస్టడీ విధించిన తర్వాత తిరిగి వస్తుండగా కూడా కేజ్రీవాల్ మాట్లాడుతూ... సీఎం పదవికి రాజీనామా చేయబోనన్నారు. అవసరమైతే జైలు నుంచే సర్కారును నడుపుతానని ప్రకటించారు.