ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చివరి విడత పోలింగ్ సజావుగా ముగిసింది

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చివరి విడత పోలింగ్ సజావుగా ముగిసింది
  • ఆఖరు విడత పోలింగ్ ప్రశాంతం
  • నిజామాబాద్​ జిల్లాలో 76.45 శాతం, 
  • కామారెడ్డి జిల్లాలో 85.95 శాతం ఓటింగ్ నమోదు
  • ఆర్మూర్​ డివిజన్​లోని 51 సెంటర్లలో వెబ్ క్యాస్టింగ్
  • పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్లు, అబ్జర్వర్లు ​

నిజామాబాద్/కామారెడ్డి, వెలుగు :  ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో చివరి విడత పోలింగ్​ సజావుగా ముగిసింది.  ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు 
కొనసాగింది. ఉదయం 9 గంటల వరకు మూములుగా సాగిన పోలింగ్... తర్వాత పుంజుకుంది. మధ్యాహ్నం ఒంటిగంటలోపు పోలింగ్ సెంటర్లలోకి వచ్చిన వారిని మాత్రమే ఓటింగ్​కు అనుమతించి, గేట్లు క్లోజ్ చేశారు. 2 గంటలకు కౌంటింగ్ మొదలుపెట్టగా చిన్న గ్రామ పంచాయతీల రిజల్ట్స్​చకచకా వెలువడ్డాయి. అధిక సంఖ్యలో ఓటర్లు ఉన్న మండల కేంద్రాల్లోని జీపీల్లో కౌంటింగ్ ఆలస్యంగా సాగింది.

నిజామాబాద్​ జిల్లాలో..

ఆర్మూర్ డివిజన్​లోని 12 మండలాల్లో 3,06,795 ఓటర్ల ఉండగా, 1,490 పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. 76.45 శాతం ఓటింగ్​ నమోదు కాగా, పురుషుల కంటే మహిళలు అధికంగా ఓట్లు వేశారు. 1,41,182 పురుష ఓటర్లలో 96,990 మంది (68.70 శాతం) ఓటు వేయగా, 1,65,607 మహిళల్లో 1,37,555 మంది (83.06శాతం) ఓట్లు వేసి చైతన్యం చాటారు. ఇతరులు ఆరుగురిలో ఒకరు ఓటింగ్​లో పాల్గొన్నారు.

 ఆలూర్, ఆర్మూర్​, బాల్కొండ, భీంగల్, డొంకేశ్వర్, కమ్మర్​పల్లి, మెండోరా, మోర్తాడ్​, ముప్కాల్, నందిపేట, వేల్పూర్, ఎర్గెట్ల మండలాల్లో 165 జీపీలు ఉండగా, 19 మంది సర్పంచ్​లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 146 సర్పంచ్ స్థానాలకు 562 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 1,620 వార్డుల్లో  490 వార్డులు ఏకగ్రీవం కాగా, 1,130 వార్డులకు 3,382 అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి, జనరల్​ అబ్జర్వర్ శ్యాంప్రసాద్​లాల్, సీపీ సాయిచైతన్య పోలింగ్, కౌంటింగ్​ కేంద్రాలను పరిశీలించారు. హైపర్ సెన్సిటివ్​గా గుర్తించిన 51 పోలింగ్ సెంటర్లను మానిటరింగ్ చేయడానికి వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు. 60 సెంటర్లపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ముందస్తుగా 194 మందిని బైండోవర్ చేశారు. థర్డ్ ఫేజ్ ఎన్నికల బందోబస్తుకు 1,100 మంది పోలీసులను నియమించారు. బాల్గొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్​రెడ్డి తన స్వగ్రామం వేల్పూర్​లో కుటుంబీకులతో వచ్చి ఓటు వేశారు. ఆర్మూర్​ ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి భార్య, కూతురుతో కలిసి అంకాపూర్​లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.    

కామారెడ్డి జిల్లాలో.. 

 కామారెడ్డి జిల్లాలోని 8 మండలాల్లో  85.95 శాతం పోలింగ్ నమోదైంది.  1,90,295 మంది ఓటర్లకు గాను 1,63,567 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహిళలు అధిక సంఖ్యలో  ఓటు  వేశారు. అత్యధికంగా పెద్దకొడప్​గల్​లో 89.69 శాతం,  అతి తక్కువగా బీర్కుర్ మండలంలో 80.76 శాతం పోలింగ్​ నమోదైంది.  బాన్సువాడ డివిజన్​లోని బిచ్​కుంద, బీర్కుర్, బాన్సువాడ, డొంగ్లి, మద్నూర్, జుక్కల్, పెద్దకొడప్​గల్ మండలాల్లో 168 పంచాయతీలకు గాను 26 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. 142 పంచాయతీల్లో పోలింగ్ జరిగింది.

1,482 వార్డులకుగాను  449 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 1,020 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. పోలింగ్ ప్రక్రియప్రశాంతంగా ముగిసింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా  పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్​, ఎస్పీ రాజేశ్​చంద్ర,  అడిషనల్ కలెక్టర్లు విక్టర్, మదన్మోహన్,  సబ్ కలెక్టర్​ కిరణ్మయి పోలింగ్ పక్రియను పర్యవేక్షించారు.  

శాంతియుతంగా ఎన్నికలుమూడో విడత పోలింగ్ జిల్లాలో శాంతియుతంగ నిర్వహించినట్లు ఎస్పీ  రాజేశ్​చంద్ర పేర్కొన్నారు. బాన్సువాడ, బీర్కుర్​, నస్రుల్లాబాద్, మద్నూర్ మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను ఎస్పీ విజిట్ చేశారు.  విజయోత్సవ ర్యాలీలకు ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ లేదన్నారు.  

ప్రశాంతంగా పోలింగ్​

మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ పేర్కొన్నారు. బుధవారం  బీర్కుర్​, నస్రుల్లాబాద్​,  డొంగ్లి, పెద్దకొడప్​గల్​ మండలాల్లో పోలింగ్​ పక్రియను కలెక్టర్ పరిశీలించారు.  ఓటర్లకు పోలింగ్​ కేంద్రాల్లో వసతులు కల్పించామన్నారు.