అభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ కుట్రలు : మ‌నీష్ సిసోడియా

అభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ కుట్రలు : మ‌నీష్ సిసోడియా

న్యూఢిల్లీ : ఆప్ స‌ర్కార్ వివిధ రంగాల్లో చేప‌ట్టిన అభివృద్ధి ప‌నుల‌ను అడ్డుకునేందుకు బీజేపీ పార్టీ త‌ప్పుడు ఫిర్యాదులు చేస్తోంద‌ని ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా ఆరోపించారు. కొవిడ్‌-పై పోరులో భాగంగా తాత్కాలిక ఆస్పత్రుల నిర్మాణంలో జ‌రిగిన అక్రమాలపై ఏసీబీ ద‌ర్యాప్తున‌కు లెఫ్టినెంట్ గ‌వ‌ర్నర్ వీకే స‌క్సేనా అనుమ‌తించిన నేప‌థ్యంలో సిసోడియా ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆమ్ ఆద్మీ పార్టీ నిజాయితీ క‌లిగిన పార్టీ అని, త‌మ‌ను భ‌య‌పెట్టేందుకు అభివృద్ధి ప‌నుల‌కు ఆటంకాలు క‌లిగించేందుకు బీజేపీ ఇలాంటి కుయుక్తుల‌కు పాల్పడుతోంద‌ని మ‌నీష్ సిసోడియా ఆరోపించారు. ఇది పాత ఫిర్యాద‌ని, గత లెఫ్టినెంట్ గ‌వ‌ర్నర్ అనిల్ బైజ‌ల్ దీన్ని తోసిపుచ్చార‌ని మ‌నీష్ సిసోడియా గుర్తు చేశారు. నూత‌న ఎల్‌జీ ఈ ఆరోప‌ణ‌ల‌పై ద‌ర్యాప్తున‌కు అనుమ‌తించార‌ని చెప్పారు. బీజేపీ ఫిర్యాదుల ఆధారంగా చ‌ర్యలు చేప‌ట్టవ‌ద్దని, సాధార‌ణ ప్రజ‌ల‌ను ఫిర్యాదు చేయాల్సిందిగా కోరాల‌ని లెఫ్టినెంట్ గ‌వ‌ర్నర్ స‌క్సేనాకు సిసోడియా విజ్ఞప్తి చేశారు.

ఈశాన్య ఢిల్లీ ఎంపీ మ‌నోజ్ తివారీ ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ ద‌ర్యాప్తున‌కు ఎల్‌జీ ఆమోదం తెలిపారు. దేశ రాజ‌ధానిలో ఏడు ఆస్పత్రుల నిర్మాణం కోసం ఆప్ ప్రభుత్వం ముందుగా రూ .1216 కోట్లకు టెండర్లు పిలిచిందని, ఆ తర్వాత ఈ మొత్తాన్ని రూ.1256 కోట్లకు పెంచిందని బీజేపీ ఎంపీ తివారీ ఆరోపించారు.