పొగమంచు ఎఫెక్ట్..ఎయిర్​పోర్టుల్లో వార్ రూమ్స్

పొగమంచు ఎఫెక్ట్..ఎయిర్​పోర్టుల్లో వార్ రూమ్స్

న్యూఢిల్లీ :  దట్టమైన పొగమంచు కారణంగా దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీంతో వాటిని నివారించేందుకు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 6 పాయింట్ల కార్యాచరణ ప్లాన్​ను మంగళవారం ప్రకటించారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, కోల్​కతా, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లోని ఎయిర్​పోర్టుల్లో ప్రయాణికులకు తలెత్తే ఇబ్బందులను పరిష్కరించేందుకు వార్​రూమ్​లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు విమాన సర్వీసుల నిర్వహణకు సంబంధించి ఏయిర్ లైన్స్ కు స్టాండర్డ్ ఆపరేటింటగ్ ప్రొసీజర్స్(ఎస్వోపీ)ను విడుదల చేశారు.

 ఆరు నగరాల్లోని ఎయిర్​పోర్టుల్లో 24 గంటల పాటు సీఐఎస్ఎఫ్ సిబ్బంది అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. తాజా మార్గదర్శకాల అమలు తీరును డీజీసీఏ పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. మెట్రో నగరాల్లోని ఎయిర్​పోర్టుల రోజువారీ కార్యకలాపాలపై రిపోర్టును కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలని కేంద్ర మంత్రి ఆదేశించారు. కాగా, దట్టమైన పొగమంచు కారణంగా ఆది, సోమవారాల్లో ఢిల్లీ ఎయిర్ పోర్టులో 100కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. 150పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల ప్యాసింజర్లు సహనం కోల్పోయి దాడులకు పాల్పడ్డారు.

పైలట్​పై దాడి చేసిన ప్యాసింజర్ అరెస్ట్

విమానం ఆలస్యానికి సంబంధించిన ప్రకటన చేస్తున్న పైలట్​పై దాడి చేసిన ప్యాసింజర్​ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఆదివారం ఢిల్లీ నుంచి గోవా బయల్దేరాల్సిన విమానం టేకాఫ్​కు ఇంకో 13 గంటల టైం పడ్తుందని పైలట్ చెప్పడంతో ప్రయాణికుడు సాహిల్ కటారియా సహనం కోల్పోయాడు. పైలట్​ను చెంపదెబ్బ కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. ప్రస్తుతం నిందితుడిని బెయిల్​పై విడుదల చేశారు.

టార్మాక్​పై ప్యాసింజర్ల భోజనం..

ముంబైలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్టు టార్మాక్ మీద ప్రయాణికులు భోజనం చేసిన ఘటనపై ఇండిగోతో పాటు, ముంబై ఎయిర్​పోర్టుకు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ మంగళవారం నోటీసులిచ్చింది. ప్రయాణికులకు తగిన సౌకర్యాలు కల్పించలేదని ఫైర్ అయింది. ఆదివారం రాత్రి గోవా నుంచి ఢిల్లీకి బయల్దేరిన విమానం పొగమంచు కారణంగా ముంబైలో ల్యాండ్ అయింది. ప్రయాణికులు కిందికి దిగి అటూఇటూ పరిగెత్తారు. అక్కడే కూర్చుని భోజనం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఏవియేషన్ మినిస్ట్రీ స్పందించింది.