ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ ఎత్తేసిన ప్రభుత్వం

ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ ఎత్తేసిన ప్రభుత్వం

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు కరోనా నిబంధనలు సడలిస్తూ వస్తున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ నిబంధనలు ఎత్తివేసింది అక్కడి ప్రభుత్వం. అయితే  ఫేస్ మాస్క్‌లు ధరించడం..కోవిడ్‌కు సంబంధించిన కొన్ని రూల్స్ పాటించాలంటున్నారు. అయితే ఇప్పటివరకు కారులో ప్రయాణించే సింగిల్ డ్రైవర్లకు మాత్రమే మాస్క్‌ ధరించడం తప్పనిసరి కాదని ప్రభుత్వం పేర్కొంది. ఇకపై ఇప్పుడు ప్రైవేట్ కారులో ప్రయాణించే వారందరికీ మాస్కు నుంచి మినహాయింపు ఇవ్వబడినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు సోమవారం నుంచి అమలులోకి రానున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకపోవడం, సామాజిక దూర నిబంధనలను పాటించకపోవడం వంటి వారిపై విధించే జరిమానాను కూడా రూ.2,000 నుంచి రూ.500కి తగ్గించారు.

రెండు నెలల పాటు విధించిన కోవిడ్ నిబంధనలు ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం చూపాయి. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (DDMA) శుక్రవారం అన్ని కోవిడ్-సంబంధిత పరిమితులను ఎత్తివేయాలని నిర్ణయించింది. రాత్రి కర్ఫ్యూ కూడా ఎత్తివేశారు అధికారులు. మార్కుట్లు రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటాయన్నారు. రెస్టారెంట్లు, బార్‌లు, కేఫ్‌లు మరియు సినిమా హాళ్లు 100 శాతం సీటింగ్ సామర్థ్యంతో పని చేయవచ్చన్నారు. పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులను నిలిపివేస్తాయని ఏప్రిల్ 1 నుండి భౌతిక తరగతులు మాత్రమే జరుగుతాయని DDMA పేర్కొంది.

మరోవైపు ఢిల్లీలో కరోనా కేసులు కూడా తగ్గుతూ వచ్చాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో 440 కొత్తగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.ఇక కరోనా కారణంగా తాజాగా ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం ఢిల్లీలో 2,063 పాజిటివ్ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి