10 ఏళ్లు పైబడిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాల ఏరివేత ఢిల్లీలో తిరిగి ప్రారంభమైంది. శుక్రవారం ఢిల్లీ రవాణా శాఖ బైకులు, కార్లు, ఈ-రిక్షాలు సహా మొత్తం 213 వాహనాలను సీజ్ చేసింది. ఎల్‌జీ వీకే సక్సేనా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్బంధ డ్రైవ్‌ను తక్షణమే పునఃప్రారంభించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. గతేడాది ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆగిపోయిన ఈ కార్యక్రమం ఫిబ్రవరిలో కొత్త పాలసీని రూపొందించాక తిరిగి పునఃప్రారంభమైంది.
ఎందుకీ ఏరివేత..?
ఢిల్లీలో వాయు కాలుష్య తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. చలి కాలంలో అయితే మరీ ఎక్కువ. 10 మీటర్ల దూరంలో ఉన్న మనిషి సైతం కనిపించరు. అందువల్ల ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ఏ వాహనం అయినా సరే 15 ఏళ్లకు మించి వాడేందుకు అవకాశం లేదు. నిర్దేశించిన సమయం దాటితే ఆ వాహనాలు స్క్రాప్ చేయాల్సిందే. అలా చేస్తే కర్బన ఉద్ఘారాలు తగ్గి కొంతైనా కాలుష్యం తగ్గుతుందని నమ్మకం. అందుకు గానూ ఎండ్-ఆఫ్-లైఫ్ వెహికల్స్ (ELV) కొత్త పాలసీని తీసుకొచ్చారు. అలా స్క్రాప్ చేసిన వాహనాలకు కొంత మొత్తంలో డబ్బులు చెల్లిస్తారు.
ఏంటి ELV ..?
15 ఏళ్లు దాటిన పెట్రోల్‌తో నడిచే వాహనం లేదా 10 ఏళ్లు పైబడిన డీజిల్ వాహనాలను ఎండ్-ఆఫ్-లైఫ్ వెహికల్స్(ELVలు) అంటారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి), సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఢిల్లీలో వీటిని వినియోగం నిషేధం. ఇలా రిజిస్టర్డ్ వాహనాల యజమానులు వాటిని బహిరంగ ప్రదేశంలో కూడా పార్క్ చేయలేరు. ఈ ఆదేశాలకు అనుగుణంగా, ఢిల్లీ రవాణా శాఖ రోడ్లు, పబ్లిక్ ప్రాంతాల నుండి ELVలను తొలగించే డ్రైవ్ నడుపుతోంది. వాటిని రీసైక్లింగ్, వేస్ట్ మేనేజ్‌మెంట్ ఫెసిలిటీ (RVSF)కి పంపుతుంది.
తిరిగి ఇస్తారా..?
సీజ్ చేసిన వాహనాలకు జరిమానా చెల్లిస్తే తిరిగిచ్చే వెసులుబాటు ఉంది. నాలుగు చక్రాల వాహనాలకు రూ. 10వేలు, ద్విచక్ర వాహనాలకు రూ. 5వేలు జరిమానా చెల్లించాలి. అందునా ఇక్కడ ఓ నిబంధన ఉంది. వాహనం తిరిగి ఢిల్లీలో నడపబడదని లేదా బహిరంగ ప్రదేశాల్లో పార్క్ చేయబడదని నిర్ధారిస్తూ అండర్‌టేకింగ్ సమర్పించాలి. అలా అండర్‌టేకింగ్ సమర్పించిన అనంతరం వాహనాన్ని స్క్రాపింగ్ యార్డ్ నుండి నేరుగా ఢిల్లీ-ఎన్‌సిఆర్ నుండి బయటకు తీసుకెళ్లాలి. ఢిల్లీ బయటకు తీసుకెళ్లి ఏం చేస్తారా అనుకోకండి.. పొరుగు రాష్ట్రాల వారికి అమ్ముకోవచ్చు.