కరోనా కట్టడిలో ఢిల్లీ సక్సెస్: 80 వేల టెస్టులు.. 487 కేసులు

కరోనా కట్టడిలో ఢిల్లీ సక్సెస్: 80 వేల టెస్టులు.. 487 కేసులు

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ కట్టడిలో ఢిల్లీ సర్కార్ సక్సెస్ అయింది. అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే లాక్ డౌన్ పెట్టి సత్ఫలితాలు సాధించింది. ఏప్రిల్ లో వేలల్లో నమోదైన కేసులు, ఇప్పుడు వందల్లోకి తగ్గాయి. మరణాలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 80,046 టెస్టులు చేయగా.. కేవలం 487 కేసులు మాత్రమే నమోదయ్యాయి. రెండున్నర నెలల తర్వాత ఇంత తక్కువ కేసులు రికార్డయ్యాయి. కరోనా మరణాలు కూడా దాదాపు రెండు నెలల తర్వాత 50లోపే నమోదయ్యాయి. వైరస్ తో మరో 45 మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 14,27,926కు చేరగా.. మొత్తం మరణాల సంఖ్య 24,447కు చేరింది. మొత్తం టెస్టుల సంఖ్య 19,52,6,590కు పెరిగింది. పాజిటివిటీ రేటు కూడా వరుసగా నాలుగో రోజు ఒక్క శాతం లోపే నమోదైంది. 

పాజిటివిటీ రేటు 0.61 శాతానికి తగ్గిందని ఢిల్లీ హెల్త్ డిపార్ట్ మెంట్ గురువారం వెల్లడించింది. వైరస్ నుంచి కోలుకొని మరో 1,058 మంది డిశ్చార్జి అయ్యారని తెలిపింది. ప్రస్తుతం 8,748 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయని చెప్పింది. ఢిల్లీలో కరోనా కేసులు, మరణాలు కొన్ని రోజుల నుంచి క్రమంగా తగ్గుతున్నాయి. ఆదివారం 946 కేసులు, 78 మరణాలు నమోదు కాగా.. సోమవారం 648 కేసులు, 86 మరణాలు నమోదయ్యాయి. మంగళవారం 623 కేసులు, 62 మరణాలు రికార్డవ్వగా.. బుధవారం 576 కేసులు, 103 మరణాలు రికార్డయ్యాయి. గురువారం నాటికి కేసుల సంఖ్య 487కు తగ్గగా, మరణాల సంఖ్య 45కు తగ్గింది. 
బ్లాక్ ఫంగస్ కేసులు వెయ్యి 
ఢిల్లీలో ఇప్పటివరకు 1,044 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు హెల్త్ మినిస్టర్ సత్యేంద్ర జైన్ వెల్లడించారు. ఇన్ఫెక్షన్​తో 89 మంది చనిపోయారని తెలిపారు. కేంద్రం అనుసరిస్తున్న వ్యాక్సినేషన్ పాలసీ బాగాలేదని, దానిపై మరోసారి ఆలోచించాలని సూచించారు. రాష్ట్రాలకు అవసరమైన టీకాలను కేంద్రం పంపిణీ చేయాలని కోరారు. ప్రజలకు తాము వ్యాక్సిన్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నా సరిపడా వ్యాక్సిన్లు కేంద్రం నుంచి రావడం లేదన్నారు.