పేరెంట్స్‌‌‌‌ బతికుండగా.. తాత ఆస్తి గ్రాండ్‌‌‌‌ చిల్డ్రన్కు రాదు

పేరెంట్స్‌‌‌‌ బతికుండగా.. తాత ఆస్తి గ్రాండ్‌‌‌‌ చిల్డ్రన్కు రాదు
  • తాత ఆస్తి కావాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌‌‌‌ వేసిన మనుమరాలు 

న్యూఢిల్లీ, వెలుగు: తల్లిదండ్రులు బతికి ఉండగా మనవడు, మనుమరాళ్లు(గ్రాండ్ చైల్డ్) తాత ఆస్తిలో వాటాను క్లెయిమ్ చేయొద్దని ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. మరణించిన తన తాత పవన్ కుమార్ జైన్ ఆస్తిలో నాలుగో వంతు వాటా కోరుతూ మనుమరాలు కృతికా జైన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ప్రతివాదులుగా తండ్రి రాకేశ్‌‌‌‌ జైన్, అత్త నీనా జైన్‌‌‌‌లపై సివిల్ దావాను దాఖలు చేశారు. 

ఈ పిటిషన్‌‌‌‌ను తాజాగా జస్టిస్ పురుషీంద్ర కుమార్ కౌరవ్ ధర్మాసనం విచారించింది. దివంగత తన తాత పవన్ కుమార్ జైన్ కొనుగోలు చేసిన ఆస్తి పూర్వీకులదని పిటిషనర్ కృతికా జైన్ తరఫు అడ్వకేట్ కోర్టుకు నివేదించారు. అందువల్ల ఈ ఆస్తిలో ఆమెకు హక్కు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా బెంచ్ స్పందిస్తూ.. పవన్ కుమార్ జైన్ కొనుగోలు చేసిన ఆస్తి హిందూ వారసత్వ చట్టం–1956లోని సెక్షన్ 8 ప్రకారం.. అతని భార్య, పిల్లలకు చెందుతుందని స్పష్టం చేసింది. అలాగే, కృతిక మనుమరాలు కావడంతో, ఆమె తండ్రి జీవించి ఉన్నప్పుడు (క్లాస్1) వారసురాలిగా అర్హత సాధించలేదని తేల్చిచెప్పింది. అందువల్ల ఆమెకు తాత ఆస్తిపై చట్టపరమైన హక్కులేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. 1956 ప్రకారం.. క్లాస్1 వారసులు వారసత్వంగా పొందిన ఆస్తి వారి సంపూర్ణ ఆస్తిగా మారుతుందని పేర్కొంది. ఈ ఆస్తి ఉమ్మడి కుటుంబ ఆస్తి కాదని స్పష్టతనిస్తూ.. కృతిక దావాను తిరస్కరించింది.