'ఆదిపురుష్' సినిమా యూనిట్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

'ఆదిపురుష్' సినిమా యూనిట్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

ఆదిపురుష్ సినిమా యూనిట్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఓ వర్గం మనోభావాలు దెబ్బతిన్నాయన్న ఆరోపణలతో ఇటీవలే పిల్ దాఖలైంది. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ తో పాటు హీరో ప్రభాస్ కు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. ఓ వర్గం దేవుళ్లను టీజర్ లో తప్పుగా చూపారని న్యాయవాది రాజ్ గౌరవ్ పిటిషన్ దాఖలు చేశారు. అలా చూపించడం అసమంజసమైన సరికానిదని గౌరవ్ పిటిషన్ లో పేర్కొన్నారు. రాముడిని క్రూరమైన ప్రతీకార రూపంగా చూపారని వాదించిన పిటిషనర్... రావణుడి పాత్ర  చాలా  భయంకరంగా ఉందని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆదిపురుష్ పై నిషేధం విధించాలని పిటిషనర్ కోర్టుకు వినతి పత్రం అందించారు. ఓం రౌత్ దర్శకత్వం  వహించిన ఈ సినిమాకు భూషణ్ కుమార్, ఓం ప్రసాద్, సుతార్, రాజేష్  నాయర్ లు నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా తెలుగు, హిందీ,తమిళం, మళయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

రాధేశ్యామ్ సినిమా తర్వాత ప్రభాస్‌ హీరోగా ప్రతిష్ఠాత్మకంగా సిద్ధమైన చిత్రం ‘ఆదిపురుష్‌’. రామాయణ మహాకావ్యాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కిన ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్, కృతి సనన్‌ నటిస్తుండగా ఓం రౌత్‌ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా టీజర్ రిలీజైనప్పటి నుంచి ఈ మూవీని వివాదాలు చుట్టుముడుతున్నాయి. రామాయణాన్ని తప్పుగా ప్రదర్శించారని, అపహాస్యం చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ మూవీపై విపరీతమైన ట్రోల్ జరుగుతోంది. ఆదిపురుష్ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేస్తూ బైకాట్ ఆదిపురుష్ హ్యాష్ ట్యాగ్ తో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.