లైబ్రరీ బిల్డింగ్ నిర్మాణానికి ఫండ్స్ ఇస్తాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

లైబ్రరీ బిల్డింగ్ నిర్మాణానికి ఫండ్స్ ఇస్తాం  : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

సూర్యాపేట, వెలుగు : గ్రంథాలయ సంస్థ నూతన భవనం, మౌలిక వసతుల కల్పన కోసం ఇప్పటికే రూ.కోటి మంజూరు చేసినట్లు నీటి పారుదల, పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అదనంగా మరో కోటి రూపాయలను ఎస్డీఎఫ్ నిధుల నుంచి మంజూరు చేస్తానని, 6 నెలల్లో పనులన్నీ పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు. సూర్యాపేట పట్టణంలో జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన భవన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావితరాలకు నాణ్యమైన విద్యనందించేందుకు అన్ని విధాలా సహకరిస్తానని తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు వ్యక్తిగతంగా సహాయం చేస్తానని, విద్యార్థులు ఆహ్లాదకర వాతావరణంలో మంచిగా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని సూచించారు. 

పెన్ పహాడ్, తుంగతుర్తి, మోతే, గరిడేపల్లిలో గ్రంథాలయాల నిర్మాణం, కోదాడ, హుజూర్ నగర్ లో అదనపు గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తే రేపు సాయంత్రంలోపు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

 రాత్రిపూట గ్రంథాలయాలు ఎక్కువ సేపు పని చేసేలా అదనంగా అవుట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించుకునేందుకు నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, అగ్రికల్చర్ కమిషన్ మెంబర్ చెవిటి వెంకన్నయాదవ్  పాల్గొన్నారు. 

అగ్రికల్చరల్ యూనివర్సిటీ కోసం స్థల పరిశీలన 

హుజూర్ నగర్, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు శుక్రవారం మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డి వివిధ చోట్ల భూములను పరిశీలించారు. హుజూర్ నగర్ లోని మగ్దూంనగర్, మేళ్లచెరువు మండలం ఎర్రగట్టు తండా, పాలకీడు మండలం గుండ్లపాడు భూములను పరిశీలించారు. ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్లు నాగార్జునరెడ్డి, కమలాకర్, ప్రజాప్రతినిధులు, నాయకులు భూముల వివరాలను వివరించారు. అగ్రికల్చరల్ యూనివర్సిటీ కోసం భూసేకరణ, మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన అంశాలను అధికారులతో చర్చించారు. 

పూల బొకేలు, శాలువాలు తీసుకురావద్దు.. 

తనను కలవడానికి వచ్చేవారు పూలబొకేలు, శాలువాలు తీసుకురావద్దని, ఆ డబ్బును జిల్లా గ్రంథాలయ సంస్థకు డొనేట్​ చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటనపై స్పందించి చలసాని రాజీవ్.. జిల్లా గ్రంథాలయ సంస్థ పేరిట  రూ.10 వేల చెక్కును అందజేశారు.