రోజుకు రూ.2 ఖర్చుకే పోస్టల్ ఇన్సూరెన్స్.. రూ.15 లక్షలు కవరేజ్, పూర్తి బెనిఫిట్స్ ఇవే..

రోజుకు రూ.2 ఖర్చుకే పోస్టల్ ఇన్సూరెన్స్.. రూ.15 లక్షలు కవరేజ్, పూర్తి బెనిఫిట్స్ ఇవే..

Postal Insurance: ఈరోజుల్లో ఇన్సూరెన్స్ పాలసీ కలిగి ఉండటం చాలా ముఖ్యమైనదిగా మారిపోయింది. వాస్తవానికి ఇది కుటుంబానికి ఒక ముందస్తు ఆర్థిక భద్రతా ప్రణాళికగా చెప్పుకోవచ్చు. ప్రమాదాలు ఏ రూపంలో ఎప్పుడు వస్తాయో తెలియదు కాబట్టి తక్కువ ఖర్చులో భారత పోస్టల్ డిపార్ట్మెంట్ లాంటి సంస్థలు ఆఫర్ చేస్తున్న ఇన్సూరెన్స్ పాలసీలను ఉపయోగించుకోవటం మంచిది. 

ప్రభుత్వ సంస్థ అయిన పోస్టల్ డిపార్ట్మెంట్ ఎల్లప్పుడూ సామాన్య మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు ఎల్లప్పుడూ మంచి ఆర్థిక ఉత్పత్తులను ప్రవేశపెడుతూనే ఉంటుంది. దీనిలో ఒకటే ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ. దీనిని పోస్టల్ డిపార్ట్మెంట్ కొన్ని ప్రైవేటు సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుని ఆఫర్ చేస్తోంది. స్కీమ్ పాలసీదారులకు అందే పూర్తి బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

* ముందుగా ఏడాదికి రూ.549 అంటే రోజుకు దాదాపు రూ.1.50 ఖర్చుతో రూ.10 లక్షల వరకు కవరేజీని ఆఫర్ చేస్తోంది పోస్టల్ యాక్సిడెంటల్ స్కీమ్. ఇక ఇదే సమయంలో రూ.15 లక్షల వరకు కవరేజీ కోరుకునే వారు రోజుకు రూ.2 అంటే ఏడాదికి రూ.749 ప్రీమియం రూపంలో చెల్లిస్తే సరిపోతుంది. వాస్తవానికి ఈ ఖర్చు రోజుకు ఒక చాక్లె్ట్ కంటే తక్కువ. చిన్న మెుత్తంలో పెద్ద రక్షణను పొందాలనుకునే వారికి ఈ స్కీమ్ మంచి మార్గం. 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వ్యక్తులు దీనిని పొంటానికి అర్హులు.

* స్కీమ్ కింద ఏదైనా ప్రమాదంలో అంగ వైకల్యం, పాక్షిక లేదా పూర్తి వైకల్యానికి బీమా కవరేజ్ లభిస్తుంది. అలాగే ప్రమాద సమయంలో ఓపిడి వైద్య ఖర్చులకు రూ.30వేల వరకు అందిస్తారు. ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేకుంటే రూ.15వందల వరకు కన్సల్టేషన్ వర్తిస్తుంది. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే రూ.60వేల వరకు ఆర్థిక భరోసా లభిస్తుంది. 

* స్కీమ్ కింద బాధితుడి పిల్లల చదువు కోసం గరిష్ఠంగా రూ.లక్ష ఫీజులు అందిస్తుంది పోస్టల్ డిపార్ట్మెంట్. ఇక ప్రమాదంలో వ్యక్తికి ఎముకలు వరిగినా లేక కోమాలోకి వెళ్లినా లక్ష రూపాయలు అందించబడతాయి. ఇక అనుకోని పరిస్థితుల్లో ప్రమాదం వల్ల పాలసీదారు మరణిస్తే వారి కుటుంబానికి ప్రయాణ ఖర్చులకు రూ.25వేల వరకు కవర్ చేస్తుంది పాలసీ. సదరు వ్యక్తి అంత్యక్రియలకు రూ.5వేల సాయం కుటుంబానికి అందించబడుతుంది. 

ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ పాలసీ కొనుగోలు కోసం మీకు సమీపంలోని పోస్టాఫీసుకు వెళితే వారు పూర్తి వివరాలు తెలియజేస్తారు. స్కీమ్ కోసం టాటా ఏఐజీ, బజాజ్ అలయన్స్, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్, సుందరం ఇన్సూరెన్స్ వంటి ప్రైవేటు సంస్థలతో పోస్టల్  డిపార్ట్మెంట్ భాగస్వామ్యాన్ని కలిగి ఉంది.