రూ.4,100 కోట్లతో గ్రేటర్ వరంగల్లో యూజీడీ పనులు :మంత్రి పొంగులేటి

రూ.4,100 కోట్లతో గ్రేటర్ వరంగల్లో యూజీడీ పనులు :మంత్రి పొంగులేటి
  • రెవెన్యూ, ఉమ్మడి వరంగల్ ఇన్​చార్జి మంత్రి పొంగులేటి

వరంగల్‍/ ఖిలా​వరంగల్ (మామునూరు)​​, వెలుగు: గ్రేటర్‍ వరంగల్‍ అభివృద్ధే లక్ష్యంగా త్వరలో రూ.4,100 కోట్లతో అండర్‍ గ్రౌండ్‍ డ్రైనేజీ పనులు ప్రారంభిస్తామని ఉమ్మడి వరంగల్‍ ఇన్​చార్జి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‍రెడ్డి తెలిపారు. గ్రేటర్‍ వరంగల్‍ ను డెవలప్‍ చేయడానికి రూ.5 వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. శుక్రవారం ఖిలా వరంగల్​ కోటలో నిర్వహించిన స్వాతంత్ర్య దిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించారు.

 అనంతరం మాట్లాడుతూ ఓరుగల్లు జిల్లావాసుల చిరకాలవాంఛగా ఉన్నమామునూర్‍ ఎయిర్‍పోర్ట్​ కలను సాకారం కాబోతోందన్నారు. విమానాశ్రయ భూసేకరణకు ఇప్పటికే రూ.205 కోట్లు కేటాయించామన్నారు. 24 అంతస్తుల సూపర్‍ స్పెషాలిటీ హాస్పిటల్‍ వర్క్స్​ స్పీడప్‍ చేస్తామన్నారు. 

కాకతీయ మెగా టెక్స్​టైల్‍ పార్క్, వరంగల్‍ కొత్త బస్టాండ్‍, కాళోజీ కళాక్షేత్రం, నర్సంపేటలో మెడికల్‍ కాలేజీ, భద్రకాళి ఆలయ మాడవీధులు, రాజగోపురాలు, చెరువు ఆధునీకరణ పనులు నడుస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 5వేల ఎకరాల్లో పామ్‍ ఆయిల్‍ తోటలు పెంచడమే తమ లక్ష్యమని, జిల్లాలో ఈ ఏడాది 31 లక్షల మొక్కలు నాటడమే టార్గెట్‍ అని చెప్పారు. 

బ్యాంకు లింకేజి కింద 7933 స్వశక్తి మహిళా సంఘాలకు లక్ష్యానికి మించి రూ.475 కోట్ల రుణాలు మంజూరు చేసి రికవరీ చేసిన క్రమంలో జిల్లాకు అవార్డులు రావడం అభినందనీయమన్నారు. మత్స్యశాఖ ద్వారా 11 వేల టన్నుల చేపలు, రొయ్యలు ఉత్పత్తి చేశామని, రిజర్వాయర్లు, మధ్య తరహా చెరువుల్లో 82 లక్షల చేప పిల్లలు వేసి 16 వేల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు.

 కార్యక్రమంలో మేయర్‍ గుండు సుధారాణి, వరంగల్‍ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే కేఆర్‍.నాగరాజు, కలెక్టర్‍ సత్యశారద, కుడా చైర్మన్‍ ఇనగాల వెంకట్రామిరెడ్డి, డీసీపీ అంకిత్‍ కుమార్‍తో  కలిసి స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించారు.