‘అమ్మ’తొలి మహిళా ప్రెసిడెంట్గా నటి శ్వేతా మీనన్.. పురుషాధిక్యాన్ని బద్దలుకొట్టి సంచలన విజయం

‘అమ్మ’తొలి మహిళా ప్రెసిడెంట్గా నటి శ్వేతా మీనన్.. పురుషాధిక్యాన్ని బద్దలుకొట్టి సంచలన విజయం

మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (AMMA) తొలి మహిళా అధ్యక్షురాలిగా శ్వేతా మీనన్ ఎన్నికయ్యారు. పురుషాధిక్యాన్ని బద్దలుకొట్టి సంచలన విజయం సాధించింది. నటుడు, బీజేపీ నాయకుడు దేవన్‌తో గట్టి పోటీ ఎదుర్కొని శ్వేతా మీనన్ గెలుపొందింది. ఆగస్టు 15న నిర్వహించిన ఎన్నికల్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ దేవన్‌కు 132 ఓట్లు రాగా.. శ్వేతా మీనన్కు 159 ఓట్లు వచ్చాయి. 27 ఓట్లతో శ్వేత విజయం సాధించింది. 

ఈ క్రమంలో శ్వేతతో పాటు, నటి కుక్కు పరమేశ్వరన్ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. కుక్కు పరమేశ్వరన్‌కు 172 ఓట్లు రాగా, ఆమెపై పోటీ చేసిన రవీంద్రన్‌కు 115 ఓట్లు వచ్చాయి. నటి అన్సిబా హసన్ జాయింట్ సెక్రటరీగా ఎగ్జిక్యూటివ్ కమిటీకి తిరిగి వచ్చారు. వీరిలో ముగ్గురు మహిళలు కీలక నాయకత్వ బాధ్యతలను చేపడుతుండటం విశేషం. అదనంగా, జయన్ చెర్తాల, లక్ష్మీ ప్రియ ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు.

ఫలితాలు ప్రకటించిన అనంతరం శ్వేతా మీనన్ మాట్లాడుతూ, మొత్తం 506 మంది సభ్యులలో 298 మంది ఓటు వేసిన వారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సినిమాల్లో పురుషులు, స్త్రీలు ఉంటారని తాను ఎప్పటికీ నమ్మను. కేవలం పాత్రలు మాత్రమే ఉంటాయని శ్వేతా మీనన్ చెప్పుకొచ్చింది. మలయాళ స్టార్ హీరోలు మోహన్ లాల్, మమ్ముట్టి, సురేష్ గోపి వంటి స్టార్స్‌ మద్ధతు తనకు చాలా అవసరమని శ్వేతా మీనన్ అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఇదిలా ఉంటే.. 31 ఏళ్ల క్రితం ‘అమ్మ’ ప్రారంభమైంది. M.G.సోమన్‌, మధు, హీరో మోహన్‌లాల్‌ తదితరులు ప్రెసిడెంట్‌గా పని చేశారు. అయితే, గతకొన్నేళ్ళుగా మలయాళ చిత్ర సీమలో పనిచేసే మహిళలు క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని హేమ కమిటీ నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక మళయాళ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపింది.

ఈ క్రమంలో 2024 ఆగస్ట్లో 'అమ్మ’ అధ్యక్ష పదవికి మోహన్ లాల్ రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో 17 మంది సభ్యులు ఉన్న పాలక కమిటీ కూడా మూకుమ్మడిగా రాజీనామా చేసింది. ఈ క్రమంలో 2027లో నిర్వహించాల్సిన ఎన్నికలను ఈ ఏడాది నిర్వహించారు.

శ్వేతా మీనన్ విషయానికి వస్తే..

నటి, మోడల్, టెలివిజన్ యాంకర్ శ్వేతా మీనన్  కేరళలోని మలప్పురం జిల్లాలో జన్మించింది. ఆమె 1994లో ఫెమినా మిస్ ఇండియా ఆసియా పసిఫిక్ టైటిల్ విజేతగా నిలిచింది. 1991లో వచ్చిన 'అనస్వరం' అనే మలయాళ మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత శ్వేత మీనన్ మలయాళం, హిందీ, తెలుగు, తమిళ భాషా సినిమాల్లో నటించి ఉత్తమ నటిగా రెండు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది. ఆమె బిగ్ బాస్ మలయాళం సీజన్ 1 లో సైతం పాల్గొంది. ఇకపోతే.. మలయాళం తెలుగు డబ్బింగ్ 'రతినిర్వేదం' అనే రొమాంటిక్ మూవీతో తెలుగు ప్రేక్షకులకి సుపరిచితం.