జైలర్ సినిమాపై IPL టీం అభ్యంతరం.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

జైలర్ సినిమాపై  IPL టీం అభ్యంతరం.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ మూవీ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. విడుదలైన నాటి నుంచి మంచి టాక్‌తో పాటు.. కలెక్షన్ల పరంగానూ దూసుకుపోతోంది. అయితే అనూహ్య రీతిలో ఈ సినిమా చిత్ర నిర్మాతలకు.. ఐపీఎల్‌ ప్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) టీమ్ నుంచి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమాలో ఓ సీన్ పై ఆర్‌సీబీ మేనేజ్మెంట్ అభ్యంతరం వ్యక్తం చేయగా.. దాన్ని తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.

ఆ సీన్ ఏదంటే?

జైలర్ మూవీ ఫస్టాఫ్‌లో రజినీ మద్యం మత్తులో ఉన్నప్పుడు.. అతనిని ఇద్దరు విలన్ మనుషులు ఫాలో అవుతుంటారు.  రజినీ వారి కదలికలను ముందే పసిగట్టి.. ఒక చోట కార్నర్ చేసి వారిని చంపేస్తాడు. ఈ సీన్‌లో ఇద్దరు రౌడీల్లో ఒకరు ఆర్‌సీబీ జెర్సీ వేసుకుని ఉంటాడు. ఈ సీన్ పట్ల ఆర్‌సీబీ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చెన్నై సూపర్ కింగ్స్‌తో పోలిస్తే ఆర్‌సీబీని తక్కువ చేసి చూపించాలనే ఉద్దేశ్యంతోనే ఈ సీన్ చిత్రీకరించారని మండిపడ్డారు. చివరకు ఈ విషయం ఆర్‌సీబీ మేనేజ్మెంట్‌ను చేరడంతో.. వారు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

జైలర్ సినిమాలో కాంట్రాక్ట్ కిల్లర్ తమ జెర్సీ ధరించి ఒక మహిళ గురించి అవమానకరమైన, స్త్రీ ద్వేషపూరిత ప్రకటనలు చేశాడని ఆరోపించారు. అనుమతి లేకుండా తమ జెర్సీని ఉపయోగించడం వల్ల తమ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని ఆర్‌సీబీ తరపు న్యాయవాదులు వాదించారు. వీరి వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం.. సెప్టెంబర్ 1 నుంచి ఆర్‌సీబీ జెర్సీ ధరించి ఉన్న దృశ్యాలను థియేటర్లలో ప్రదర్శించరాదని జైలర్ చిత్ర నిర్మాతలకు ఆదేశాలు జారీ చేసింది.

ఢిల్లీ హైకోర్టు తాజా ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 1 తర్వాత అన్ని థియేటర్లలో ఆర్సీబీ జెర్సీ ఉన్న సన్నివేశాన్ని తొలగించాలి. లేనియెడల చట్ట ప్రకారం చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాగా, కోర్టు ఆదేశాలను జైలర్ చిత్ర బృందం అంగీకరించింది. సెప్టెంబర్ 1, 2023 నాటికి థియేట్రికల్ వెర్షన్‌లో మార్పు చేస్తామని చెప్పుకొచ్చింది.