భార్యను ఇంటిపని చెయ్యాలనడం క్రూరత్వం కాదు: ఢిల్లీ హైకోర్టు

భార్యను ఇంటిపని చెయ్యాలనడం క్రూరత్వం కాదు: ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ: ఇంటిపని చేయాలని భార్యను భర్త అడగడం క్రూరత్వం కాదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. కుటుంబ బాధ్యతలు పంచుకోవడమే వివాహ బంధం  ఉద్దేశమని, ఆ క్రమంలో ఇంటిపని చేయాలని కోరడం క్రూరత్వం కిందకు రాదని హైకోర్టు స్పష్టం చేసింది. ‘‘భార్య చేసే ఇంటి పనిని నౌకర్లు చేసే పనితో పోల్చలేం. ఎందుకంటే భర్త కుటుంబం కోసం భార్య చేసే ఇంటిపనిలో ప్రేమ, అనురాగం ఉంటుంది” అని హైకోర్టు పేర్కొంది. 

ఇంటిపని చేయాలని తన భార్యను అడిగితే, ఆమె ఒప్పుకోవడం లేదని, వృద్ధులైన తన తల్లిదండ్రులను విడిచి వేరు కాపురం పెట్టాలని బలవంతం చేస్తోందని సీఐఎస్ఎఫ్​  జవాన్  అయిన ఓ వ్యక్తి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తనకు విడాకులు మంజూరు చేయాలని కోరగా.. ఫ్యామిలీ కోర్టు అందుకు నిరాకరించింది. దీంతో అతను హైకోర్టును ఆశ్రయించాడు. తన భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా తాము ప్రత్యేకంగా నివసించాలని బలవంతం చేస్తున్నారని అతను ఆరోపించాడు. అతని పిటిషన్ పై జస్టిస్  సురేష్​ కుమార్  నేతృత్వంలోని బెంచ్ విచారణ జరిపింది. 

‘‘ఆదాయ వనరులు లేని వృద్ధులైన తన తల్లిదండ్రులను చూసుకునే నైతిక బాధ్యత ఆ కొడుకుపై ఉంటుంది. వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవాల్సిన సమయంలో వదిలి వేరుకాపురం పెట్టడం హిందూ సంప్రదాయంలో వాంఛనీయం కాదు. వారిని వదిలి వేరుకాపురం పెట్టాలని బలవంతం చేయడం క్రూరత్వమే అని ‘నరేంద్ర వర్సెస్  కె.మీనా’  కేసులో సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. అలాంటి కేసే ఈ కేసు కూడా. కుటుంబ బాధ్యతలు పంచుకోవడమే వివాహ బంధంలో ముఖ్య ఉద్దేశం” అని బెంచ్ తేల్చిచెప్పింది.